Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం పూర్తి అయ్యేదెన్నడు ?

– నిధులు లేక మూలన పడ్డ పోలవరం
– ఆంధ్రప్రదేశ్ ను వంచించిన మోడీ సర్కార్
– చతికిలపడ్డ జగన్ రెడ్డి సర్కార్
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంటులో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా మోదీ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని శైలజనాథ్ ఆరోపించారు.

ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్, 2014–15 ఆర్థిక సంవత్సరపు నిధుల లోటు భర్తీ, వెనుకబడిఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం పూర్తి ఖర్చు భరించి కేంద్రమే నిర్మించవలసిన ప్రాజెక్టు పోలవరం. అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పచెప్పి ఏప్రిల్ 1, 2014 రేట్ల ప్రకారమే ఖర్చును భరిస్తామనే ఒక పరిమితిని కేంద్రం విధించుకుందని పేర్కొన్నారు.

దీనివల్ల మిగతా జాతీయ ప్రాజెక్టులకు అందే ప్రయోజనాలు కూడా పోలవరం విషయంలో రాష్ట్రానికి అందడం లేదని, అంచనా వ్యయం సుమారు రూ.55వేల కోట్లుగా ఉన్న పోలవరానికి, జాతీయ ప్రాజెక్టులకు వర్తించే నిబంధనల ప్రకారం ఆ అంచనాలోని 60శాతం నిధులు అంటే సుమారు రూ.33వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే 90శాతం నిధులు అంటే దాదాపు రూ.50వేల కోట్లను కేంద్రమే భరించాలని, కాని అటు సాధారణ రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వకుండా, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చే విధంగానూ ఇవ్వకుండా, చట్టం ప్రకారం 100శాతాన్ని తానే భరించాల్సిన పోలవరం ఖర్చులో కేవలం రూ.20,398 కోట్లు మాత్రమే భరిస్తామని ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడాన్ని శైలజనాథ్ తప్పుపట్టారు.

దీనికి ప్రత్యేక ప్యాకేజీ అని పేరు పెట్టిందని, దీంతో నిధులు లేక పోలవరం ఇప్పుడు మూలన పడిందని, ఎప్పుడో 2018లో పూర్తి కావాల్సిన పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని శైలజనాథ్ విమర్శించారు. విభజన వల్ల, రాజధాని కోల్పోవడం వల్ల నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే పరిష్కారమని పార్లమెంటు ఉభయ సభలలో ఏకగ్రీవంగా తీర్మానించారని, కాంగ్రెస్ ఐదేళ్లు మాత్రమే హోదా ఇస్తామంటే ప్రతిపక్ష బీజేపీ పదేళ్లు ఇవ్వాలని పట్టుపట్టిందని, చివరకు ప్రకటించిన విధంగా ఐదేళ్ల ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ను మోదీ ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు.

ఈ హోదా కోసం పోరాడలేక ఛాతికలపడ్డారని జగన్ రెడ్డి సర్కార్ ని విమర్శించారు. దాదాపు 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు ప్రత్యేక హోదాను దాటవేస్తూ వచ్చిన కేంద్రానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ఒక సిఫారసు కోతికి కొబ్బరి ముక్కలా దొరికిందని విమర్శించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్) కింద తన వాటా 60శాతంగా 2015–16లో రూ.9,931కోట్లు, 2016–17లో రూ.12,928కోట్లు, 2017–18లో రూ.12,126 కోట్లు, 2018–19లో రూ.10,813కోట్లు, 2019–20లో రూ.10,990కోట్లు విడుదల చేసిందని, అంటే మొత్తం ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.56,788కోట్లు తన వాటా 60శాతం నిధుల క్రింద విడుదల చేసిందన్నారు.

ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ కింద అదనంగా ఇవ్వవలసిన 30శాతం నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు 2015–16లో రూ.4,965 కోట్లు, 2016–17లో రూ.6,464 కోట్లు, 2017–18లో రూ.6,063 కోట్లు, 2018–19లో రూ.5,406 కోట్లు, 2019–20లో రూ.5,495 కోట్లు అంటే మొత్తం రూ.28,394 కోట్లు ఈ ఐదేళ్ళలో రాష్ట్రానికి అదనంగా వచ్చేవని వివరించారు.

కానీ కేంద్రం దీన్ని ఈఏపిలకు ముడిపెట్టడం వల్ల ఈ ఐదేళ్లలో కేవలం సుమారు రూ.16 కోట్లు మాత్రమే ఈ నిధులలో భాగంగా కేంద్రం జమ చేసిందని, ఆంధ్రప్రదేశ్ కు అదనపు సాయంగా రావాల్సిన రూ.28,394 కోట్లు మొత్తం చెల్లించడానికి ఎంతకాలం పడుతుందో ప్రజలకు వారే చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE