Suryaa.co.in

Editorial

కాపు జాతిపిత లెక్కడ?

-కాపులను బూతులు తిట్టిన మాజీ మంత్రి కొడాలి నాని
– కొడాలి వ్యాఖ్యలపై కనిపించని కాపు మంత్రులు-ఎమ్మెల్యేల కన్నెర్ర
– ఖండించని కాపు కుల ప్రముఖులు
– కనిపించని ముద్రగడ, హరిరామజోగయ్య
– కొడాలి నాని వ్యాఖ్యలపై పేర్ని మౌనం
– సత్తిబాబు, రాంబాబు, కన్నబాబు ఎక్కడ?
– వంగవీటి వారసుడు రాధాకృష్ణ మౌనం
– వంగవీటి రాధాకు ఇది పట్టదా?
– రాధా-కొడాలి-వంశీ మిత్రులే
– కమ్మ కుల మహ మాటంతో మిత్రుడు కొడాలిని వదిలేశారా?
– ఖండించని వైసీపీ నాయకత్వం
– కొడాలిని మందలించని పార్టీ అధినేత జగన్‌
– కాపు ప్రముఖుల మౌనంపై కాపుల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాపు కులాన్ని దూషిస్తూ బూతులు మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నానిపై.. ఎదురుదాడి చేయని కాపు అగ్రనేతల మౌనాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడాలి నాని దూషణలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నప్పటికీ, ‘స్వయం ప్రకటిత కాపుజాతిపితలు’ ఖండించకుండా, మౌనంగా ఉండటంపై కాపులలో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. అటు తన పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని, కాపులను బూతులు తిట్టినా స్పందించని వైసీపీ నాయకత్వంపై, కాపులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కాపుల కోసమే బతుకుతున్నానంటూ.. టన్నుల కొద్దీ లేఖలు రాసే ముద్రగడ పద్మనాభం, ఈ వ్యవహారంలో మౌనంగా ఉండటంపై కాపు సంఘాలలో విస్మయం వ్యక్తమవుతోంది. కాపుజాతిపితగా తనను తాను భావించే ముద్రగడ.. కాపులను కొడాలి నాని బూతులు తిట్టినా ఇప్పటిదాకా, సీఎం జగన్‌కు ఒక్క లేఖ కూడా రాయకపోవడంపై కాపులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

టీడీపీ హయాంలో కాపుల కోసం నానా యాగీ చేసిన ముద్రగడ, ఇప్పుడు కేవలం తన కుటుంబసభ్యులకు వైసీపీ టికెట్లు ఇప్పించుకునేందుకే, జగన్‌ సర్కారుపై మాట్లాడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని స్థానంలో టీడీపీ నేత ఎవరైనా కాపులను విమర్శించి ఉన్నట్లయితే, ముద్రగడ ఈపాటికి అరటన్ను పేజీలతో.. లేఖలు రాసేవారన్న వ్యంగ్యాస్ర్తాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను, తన కొడుకుకు సీట్ల కోసమే ముద్రగడ.. కాపులను బూతులు తిట్టిన కొడాలి నానిని క్షమించినట్లున్నారన్న వ్యాఖ్యలు కాపువర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇక మంత్రివర్గంలో కాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి కన్నబాబు, పేర్ని నాని కూడా.. కొడాలి వ్యాఖ్యలపై మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కులాన్ని అడ్డుపెట్టుకుని, ఆ కోటాలో మంత్రి పదవులు పొందిన వీరంతా.. అదే కులాన్ని, కమ్మవర్గానికి చెందిన తమ సొంత పార్టీ ఎమ్మెల్యే తిడుతున్నా, మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి వారంతా కులాన్ని.. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారన్న వాస్తవం తేలిపోయిందని, కాపు నేతలు దుయ్యబడుతున్నారు.

ఇలాంటి ఘటనలు టీడీపీ అధికారంలో జరిగితే, ఈ పరిస్థితి వేరేగా ఉండేదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎవరైనా మంత్రి, మరొక కులాన్ని దూషిస్తే అల్లకల్లోలం చేసేవారని విశ్లేషిస్తున్నారు. అప్పుడు ఇదే ముద్రగడ, హరిరామజోగయ్య లాంటి కాపుజాతిపితలంతా, ఆమరణ నిరాహారదీక్షలు చేసేవారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధానంగా.. తాను మళ్లీ ఇదే కులంలో పుట్టి, కాపులకు సేవచేయాలని ఉందన్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.. తాజా పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. చేగొండి హరిరామయ్య జోగయ్యను పార్టీ ఆఫీసుకు పిలిచి, సలహాలు తీసుకున్న జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారని కాపులు ప్రశ్నిస్తున్నారు. కాపుల పార్టీగా భావించే జనసేన ఏం చేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘‘అసలు కాపులకు పౌరుషం ఉందా? ఆత్మాభిమానం ఉందా? ఒక కమ్మ వర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, కాపులను పచ్చిగా బూతులు తట్టినా ఒక్కరిలో స్పందన లేదు. అది చానెళ్లలో ప్రసారమైనప్పటికీ ఆ స్పృహ లేదు. కాపులకు కృష్ణదేవరాయల్‌ పేరు చెప్పుకునే అర్హత ఉందా? ఆయన పేరుతో రాయల్‌ అని ప్రచారం చేసుకునే నైతిక అర్హత ఉందా? అప్పటి ఆవేశం-ఆత్మాభిమానం చేవచచ్చిందా’’ అని కాపులు, తమ నేతల అసమర్ధత-స్వార్ధ రాజకీయాలపై విరుచుకుపడుతున్నారు.

విచిత్రంగా ఈ మొత్తం వ్యవహారంలో ..కాపు ఉద్యమ కమ్‌ జాతిపితగా పేరున్న దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా, ఎక్కడున్నారన్న ప్రశ్నలు కాపువర్గాల్లో వినిపిస్తున్నాయి. కాపులకు రోల్‌మోడల్‌, ఆరాధ్యదైవమయిన రంగా కొడుకే నాకెందుకని.. కొడాలి నాని వ్యాఖ్యపై పెదవి విప్పని దుస్థితి ఉంటే, ఇక కాపులకు రక్షణ ఎవరని కాపులు ప్రశ్నిస్తున్నారు.

వంగవీటి రాధా-గన్నవరం ఎమ్మెల్యే వంశీ-గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముగ్గురూ ప్రాణస్నేహితులన్నది జగద్విదితం. విచిత్రంగా కొడాలి నాని-వంశీ ఇద్దరూ కమ్మ కులానికి చెందినవారయితే.. రాధా తండ్రి వంగవీటి రంగా కాపు- తల్లి రత్నకుమారి కమ్మ కులానికి చెందిన వారన్నది తెలిసిందే. విచిత్రంగా ఈ ముగ్గురూ అన్ని ఫంక్షన్లలో కలుస్తుంటారు. అనుకున్నచోట కలుస్తుంటారు. ఆ ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

అందుకే తన కులాన్ని దూషించిన కొడాలి నానిని, వంగవీటి వారసుడు మిత్రధర్మం ప్రకారం ఎదురుదాడి చేయకుండా వదిలేశారా? లేక కమ్మ సామాజికవర్గ మొహమాటంతో కొడాలిని విమర్శించలేదా? వంగవీటి రంగా కొడుకుకే లేని రోషం, మనకెందుకు? అసలు వంగవీటిరాధా కాపు నేతగా ఎందుకు చె లామణి కావడం లేదు? తన మిత్రుడు కొడాలి నానిపై ఎదురుదాడి చేయకుండా, మౌనంగా ఉన్నారంటే వంగవీటి రాధాకు, కాపుకార్డు ఇష్టం లేదన్నట్లే కదా అన్న చర్చకు కాపు వర్గాల్లో తెరలేచింది.

మరోవైపు.. కొడాలి నాని వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం కూడా, స్పందించకుండా మౌనంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. సహజంగా అయితే రాజకీయ కోణంలో , అలాంటి వ్యాఖ్యలు చేసిన తన పార్టీని అధినేత పిలిచి మందలిస్తారు. ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అవి సదరు నేత వ్యక్తిగత వ్యాఖ్యలని ప్రకటన ఇస్తారు.

కానీ కొడాలి విషయంలో ఈ రెండింటిలో, ఏదీ జరగకపోవడం ఆశ్చర్యం. దీన్నిబట్టి వైసీపీ నాయకత్వం.. కాపులను బూతులు తిట్టిన కొడాలి వ్యాఖ్యలను, ఆనందిస్తోందన్న విషయం ఆ పార్టీ నాయకత్వం మౌనం ద్వారా స్పష్టమవుతోంది. బహుశా ఎలాగూ కాపులు దూరమవుతున్నారన్న లెక్కలు కావచ్చన్నది కాపుసంఘాల విశ్లేషణ.

LEAVE A RESPONSE