Suryaa.co.in

Editorial

ఎక్కడ.. బాబాయ్?

– వివేకాను మర్చిపోయిన వైసీపీ
– వివేకా జయంతి నిర్వహించని వైసీపీ నేతలు
– కనీసం ట్వీట్లలోనూ కనిపించని నివాళి
– గతంలో బాబాయ్ ఘనంగా నివాళి
– చెల్లి అడ్డం తిరగడటంతో దూరమైన బాబాయ్
– పార్టీ ఆదేశాలు లేకపోవడంతో నేతలు మౌనం
– విజయసాయి ట్వీట్‌లోనూ కనిపించని నివాళి
– బాబాయ్‌ను మర్చిపోయిన అబ్బాయ్ పార్టీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

దివంగత కడప మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ కుటుంబం మర్చిపోయింది. అధినేత మర్చిపోవడంతో, సహజంగా వైసీపీ నేతలూ బాబాయ్‌ను మర్చిపోయారు.

వివేకా హత్యకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చలో .. ‘రెండు కళ్ల’ సిద్ధాంతం వినిపించిన సీఎం జగన్ సైతం.. తన చిన్నాన్నను మర్చిపోవడమే వింత. గతంలో ఘనంగా బాబాయ్‌ను స్మరించుకున్న జగన్ కుటుంబం, వైసీపీ నేతలు ఇప్పుడు ఆ బాబాయ్ జయంతిని మర్చిపోవడమే విడ్డూరం.

దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డిని కొడుకు జగన్ కుటుంబం సహా, వైసీపీ శ్రేణులు మర్చిపోయాయి. వివేకా 72వ జయంతిని, ఆయన కూతురు డాక్టర్ సునీత తన కుటుంబసభ్యులతో మాత్రమే నిర్వహించారు. ఇదే వివేకా జయంతిని, ఇప్పటిదాకా వైసీపీ నేతలే ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు.

నేతలంతా బాబాయ్‌ను స్మరించుకునేవారు. ఆయన ఫొటో పూలదండలతో నిండిపోయేది. బాబాయ్ హంతకులను శిక్షించాలని మైకులు బద్దలు కొట్టేవారు. వివేకా స్మరణతో వైసీపీ మార్మోగిపోయేది.

ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్సయిపోయింది. హత్య కేసు కోర్టుకెక్కడంతో నివాళి కథ అడ్డం తిరిగింది. ఫలితంగా బాబాయ్ ఒంటరిపోయారు. ఆయన ఆత్మ కూడా ఒంటరయింది. ఆయనను స్మరించుకునే దిక్కు లేదు. అసలు వివేకానందరెడ్డి ఎవరో కూడా తెలియదన్నట్లు, వైసీపీ వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో..వివేకాపై అభిమానం ఉన్నప్పటికీ, వైసీపీ నేతలు కూడా సైలెంటయ్యారు.

అసలు సొంత పులివెందులలోనే, వివేకా ఫ్లెక్సీలు కట్టిన వైసీపీ నేతలు లేకపోవడం విషాదం. కనీసం మొహమాటానికి కూడా జగన్.. బాబాయ్‌కు ట్వీట్‌లో నివాళి అర్పించకపోవడం ఆశ్చర్యం. వివేకా హత్య సమయంలో మీడియాముందుకొచ్చి, బాబాయ్‌ది గుండెపోటు అని చెప్పిన ఎంపి విజయసాయిరెడ్డి కూడా.. తన ట్వీట్‌లో వివేకాను స్మరించుకోకపోవడం ఇంకో ఆశ్చర్యం. మొత్తంగా బాబాయ్‌ను అబ్బాయ్ పార్టీ విజయవంతంగా మర్చిపోయింది.

LEAVE A RESPONSE