రాక్షసులు అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన, వారిపట్ల అసహ్యం కలుగుతాయి. ఎందుకంటే వారి గురించి వారి మనోభావాల గురించి మనం విన్న కథలు అలా మన మనస్సులో ముద్రలు వేశాయి. ఇక పూర్వం వారి ఆకారములు, ప్రవర్తనలు ఎలావున్నా యుగాలననుసరించినా వారిబుద్ధులు మాత్రం మారలేదు. అటువంటి బుద్ధికలవాడు రాక్షసునిగానే వర్ణింపబడుతున్నాడు.
మొదటిలో అంటే కృతయుగములో రాక్షసులు జలములలో నివసించేవారట. అక్కడనుండే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగిలించటం లాంటివి చేయటము వలన భగవంతుడు మత్స్యావతారమెత్తి, వరాహావతారములెత్తి వారిని సంహరించాడు.
ఇలాకాదు అని వాళ్ళు నీళ్ళమధ్యలో దీవులలో చేరి లోకములో దుర్మార్గములు చేయటము మాత్రమేకాక, ఆ భావాలను వ్యాపింపచేయాలని ప్రయత్నించారు.
అయితే అప్పుడు కూడా ఆయన రామాది అవతారాలను దాల్చి వాళ్లను నిర్మూలించాడు. ఇలాకూడా లాభం లేదు, మనకార్యం నెరవేరాలంటే మనం మానవుల బంధువర్గంగా మారాలని సంకల్పించి, కంస, దుర్యోధన, జరాసంధ, శిశుపాలాది రూపాలలో మానవులకు మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించి చాలావరకు మానవజాతిని తమకనుకూలముగా మార్చగలిగారు.ఆయన కూడా ఊరుకోకుండా కృష్ణావతారమెత్తి, సద్బుద్ధి కలిగిన మానవులద్వారానే వారిని ఊచకోత కోపించి, మానవుల కర్తవ్యాన్ని తెలియపరచాడు.
ఇక మనం బయటవుంటే వాసుదేవుని నుండి మనం తప్పించుకోలేము. ఆయనకు దొరకకుండా ఉండేందుకు.. ఎక్కడచేరి మనప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించి ఈ కలియుగములో మానవ మనస్సులలో నివాసము ఏర్పరచుకున్నారు. అక్కడి నుండి తమ పనులు కొనసాగిస్తున్నారు.
అందుకే మనలో కోపాలు, ఈర్ష్య, అసూయాది గుణాలు, ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన, భగవంతుని ఉనికిని వ్యతిరేకించటం, సాటి జీవులపట్ల జాలి లేకపోవటం లాంటి లక్షణాలు పొడసూపుతున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసజాతి మనమాదమరచివున్న సందర్భములో మన మనస్సును అరిషడ్వర్గాలవైపు మళ్ళించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
ఆదమరచామో మనలో వారిగుణాలు ప్రజ్వరిల్లుతుంటాయి. భగవన్నామమనే కవచాన్ని ధరించి ప్రేమ, శమదమాదులనే ఆయుధాలు ధరించి జాగురూకులమై ఉండాలి.వాళ్ళు తలెత్తిన ప్రతిసారీ చావుదెబ్బ తీయాలి.
ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కష్టం. ఇక యుద్ధమెంత కఠినమో ఆలోచించాలి మనం.
ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మన పతనం ఖాయం. ` తస్మాత్.. జాగ్రత్త… జాగ్రత్త.
-సువర్చల