Suryaa.co.in

Editorial

పవన్‌కు ‘కాపు’ కాయరా?

– కాపు సంఘాలు ఉన్నాయా?
– వైసీపీ దాడిపై ఎదురుదాడి ఏదీ?
– ముద్రగడ మహాస్వామి మాట్లాడరేం?
– రఘురామరాజు పాటి ధైర్యం కూడా లేని కాపులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్ని ముసుగులేసుకున్నా జనసేనాధిపతి పవన్‌కు కాపు నాయకుడన్న పేరు. ఆయన కార్యక్రమాలు, ర్యాలీల్లో పాల్గొనేది కాపులేనన్నది మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమయ్యే విషయం. కానీ ఆయన ఇప్పుడు వైసీపేయుల దృష్టిలో ఆ కాపు నాయకుడు కాస్తా కమ్మ నాయకుడయ్యారు. ‘కాపు జనసేన’ నుంచి ‘కమ్మ జనసేన’ అధ్యక్షుడిగా అవతరించారు. మంత్రి అమర్‌నాధ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా,Ycp-kapu-leadersపేర్ని నాని అంతా కలసి.. పవన్ నాయుడును చంద్రబాబునాయుడుగా మారుస్తు, మాటలదాడి చేస్తున్నారు. అయినా.. ఆంధ్రాలో ఒక్క కాపు నేతగానీ, ఒక్క కాపు సంఘం గానీ వారిపై ఎదురుదాడి చేయడం లేదు. కిర్లంపూడి కాపు పీఠాథిపతి, ముద్రగడ మహాస్వామి కూడా మౌనదీక్షలో ఉన్నారు. కాపుల యవ్వారంలో ఆయన స్వరపేటిక బలహీనపడి మూడున్నరేళ్లయిపోయింది.

అంటే దీనర్ధం ఏమిటి? ఆంధ్రా కాపులు ‘మా పవన్’ అంటూ చొక్కాలు చించుకుని, ఆయన పాల్గొనే సభల్లో ‘సీఎం సీఎం’ అని గొంతుపగిలేలా అరవడమే తప్ప.. ఆయనపై అధికార పార్టీ ‘కులమార్పిడి’ ముద్ర వేస్తుంటే, ఎదురుదాడి చేసే మొనగాడే లేరని అనుకోవాలా మరి? ‘‘టీడీపీతో కలిసి దత్తపుత్రుడివి అనిపించుకుంటావా? సొంతగా పోటీ చేస్తావా? అసలు నీకు సొంతంగా పోటీ చేసే స్వాతంత్య్రం ఉందా?’’ అంటూ కాకుల్లా పొడుస్తున్న వైసీపేయుల దాడిని ఎదుర్కొని, పవన్‌కు రక్షణగా నిలిచే కాపు నేత ఒక్కడూ లేడా? కొన్నాళ్లుగా ఆంధ్రాలో పవన్‌పై జరుగుతున్న దాడిని.. చేష్టలుడిగి, వెన్నుముక కోల్పోయిన కాపుల మౌనం చూస్తే, బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా ఇలాంటి అనుమానాలే వస్తాయి.

నిజానికి ఆంధ్రాలో ఒకప్పుడు కాపు సంఘాల ఉనికి, పాలకులకు చెమటలు పట్టించేవి. కాపులను సంతృప్తి పరచడమనేది పాలకుల ఆలోచనలో ఒక భాగమయ్యేది. మూడేళ్ల క్రితం వరకూ ఆ జోరు అలాగే కొనసాగింది. జగనన్న సీఎం అయిన తర్వాత, కాపు సంఘాలకు అసలు నవరంధ్రాలూ పూడుకుపోయాయి. నవనాడులూ కుంగిపోయాయి. చేవచచ్చిపోయింది. కాపులంటే పౌరుషానికి పెట్టిందన్న పేరు చచ్చుబడిపోయింది. అంతకుముందు తాము కాపు నేతలమంటూ మీడియా గొట్టాల ముందు.. గొంతులు సవరించుకున్న ఒక్క కాపు నేత కూడా, నేడు భూతద్దం పెట్టినా కనిపించడం లేదు. హోటల్లో కాపు సంక్షేమం పేరిట సమావేశాలు నిర్వహించిన మాజీ ఐఏఎస్, మాజీ ఐపిఎస్‌లు ఇప్పుడు తుపాకికి కూడా దొరకకుండా, హైదరాబాద్‌లో రెస్టు తీసుకుంటున్నారు.

రిజర్వేషన్లపై నానా యాగీ చేసి, సకుటుంబ సపరివార సమేతంగా కంచాలు కొట్టి, దీక్షలు చేసిన కిర్లంపూడి కాపు పీఠాథిపతి, కాపుజాతి ఉద్ధారకుడు ముద్రగడ పద్మనాభం గొంతు.. జగనన్న సీఎం అయిన తర్వాతmudragada-sound ఆటోమేటిగ్గా స్తంభించిపోయింది. ఇప్పుడాయన దీక్షల బదులు లేఖలు రాసే పనిలో ఉన్నారు. పైగా.. ‘మనలో మనకు కులాల కొట్లాట వద్దం’టూ శెట్టిబలిజలకు లేఖలు రాసి ‘మారిన మహాత్ముడ’య్యారు.

బహుశా అందుకే పవన్‌పై.. వైసీపీ కాపులు మాటలు దాడి చేస్తున్నా, ఏ ఒక్క కాపు నాయకుడూ ఎదురుదాడి చేయడం లేదనిపిస్తుంది. గత చంద్రబాబు సర్కారు కాపులకు ఇచ్చిన, 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయమని గట్టిగా గొంతు విప్పే కాపు నాయకులెవరూ ఇప్పుడు ఆంధ్రాలో కనిపించకపోవడం మరో విచిత్రం. కాపు సంఘాల పేరుతో ఒకరిద్దరు.. ఇంకా వంగవీటి రంగా పేరు చెప్పుకుని బతికే కొందరు ‘స్వయంప్రకటిత’ కాపు నాయకుల హడావిడి, టీవీ చర్చలు-ఫేస్‌బుక్కుల్లో తప్ప.. మోరవిరుచుకుని రోడ్డుపై నిలబడి, సర్కారును సవాల్ చేసే ఒక్క మొనగాడూ లేకుండా పోవడంపై, కాపుల్లో అసంతృప్తి రగలడం సహజమే.

పవన్‌ను వైసీపీ నాయకత్వం కాపునేతలను ముందుపెట్టి బూతులు తిట్టిస్తుంటే.. ఒక్క కాపు నాయకుడు గానీ, కాపు సంఘాలు గానీ స్పందించకపోవడం బట్టి.. పవన్ కాపుకార్డు వల్ల పెద్దగా ఫాయిదా లేదన్నది సుస్పష్టం. అదే సమయంలో కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిగా పెట్టినా, నయాపైసా లాభం లేకపోగా ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తిరోగమిస్తోంది. కనీసం మిత్రపక్షంగా ఉన్న జనసేనాధిపతిపై వైసీపీ మాటల దాడి చేస్తుంటే, అదే కులానికి చెందిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తనకెందుకులే అన్నట్లు ఉండటం ఇంకో విచిత్రం.

kanna-rangaఅంటే దీన్నిబట్టి కాపుల్లో రాజకీయ చైతన్యం విజయవంతంగా చచ్చిపోయిందని.. హత్యకు సిద్ధమయ్యే ఇంకో వంగవీటి రంగా పుడితే తప్ప, వారి ఉనికి కష్టమని అర్ధమవుతూనే ఉంది. అసలు కాపుల కోసం జీవితాంతం, ఊపిరిఉన్నంతవరకూ కొట్లాడిన వంగవీటి రంగా వారసుడయిన వంగవీటి రాధానే,vangaveetiradha‘కాపువనం’లో కనిపించరు. పైగా కాపులపై విమర్శనాస్త్రాలు సంధించే, అధికారపార్టీ నేతలంతా ఆయన దోస్తులే. వారసత్వానికి, రాజకీయ ఉనికికి వంగవీటి రంగా పేరు ఇంకా రాధాకు అక్కరకు వస్తోంది తప్ప, ఆయన మాత్రం కులానికి ఉపయోగపడటం లేదన్నది చాలామంది కాపునేతల ఉవాచ.

అసలు.. కాపు కులానికి సంబంధం లేని, పవన్ అన్నయ్య మీద గెలిచిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఉన్నంత ధైర్యం కూడా, కాపునేతల్లో లేశమాత్రమయినా కనిపించకపోవడమేraju-pavanవిచిత్రం. పవన్‌పై వైసీపీ చేసే మాటలదాడిపై ఎదురుదాడి చేసి, ‘కాపు కాస్తున్న’ది ఇప్పుడు రఘురామరాజు మాత్రమే కావడం ఆశ్చర్యం. మంత్రుల విమర్శలకు జనసేన నేతలకంటే, రఘురాముడే ఎక్కువగా స్పందిస్తున్నారంటే.. కాపు నాయకులు పవన్‌ను ఓన్ చేసుకుంటారా? లేదా అన్నది స్పష్టమవుతుంది.

ఇప్పుడు మళ్లీ పవన్ దగ్గరకొస్తే.. పవన్‌కు ఓటు లేని కాపు యువకులు తప్ప, ఓటున్న కాపులు అక్కరకు రావడం లేదన్నది అనుభవాలు చెబుతున్నాయి. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన ఓడిపోయారు. కాబట్టి ఇక కులప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయాలా? లేక వెంట వస్తారో రారో తెలియని కాపులనే నమ్ముకుని రాజకీయాలు చేయాలా? ఇవన్నీకపోతే… అందరూ కావాలనుకునే ‘మొహమాటం ముసుగు’తొలగించి, తానే అసలు సిసలు కాపు నేతగా అవతరించి.. వంగవీటి రంగా స్ధాయిలో కులనేతగా మారాలా? అన్నది పవన్ నిర్ణయించుకుంటే మంచిది. ఎందుకంటే.. పవన్ వెంట వంగవీటిలు, ముద్రగడలు, పల్లంరాజులు, తోటలు, గంటాలు, మిరియాలలు, పిళ్లాలెవరూ రారు కాబట్టి!

LEAVE A RESPONSE