-పెన్షన్ల పండగలో ఎన్టీఆర్ ఫొటో ఏదీ?
– కరపత్రం ఖరారు చేసే ముందు గమనించలేదా?
– అది తయారుచేసిన మేధావులకు అన్న గొప్పతనం తెలీదా?
– అసలు దానిని తెలుగువారే తయారుచేశారా?
– బాబు అనుమతి లేకుండా విడుదల చేశారా?
– అందులో ఆర్ధిక అంశాలే ఎక్కువ
– కరపత్రంలో రాజకీయ కోణం ఏదీ?
– పార్టీ సీనియర్లను సంప్రదించలేదా?
– చంద్రబాబు-లోకేష్‌కు చెడ్డపేరు తెస్తారా?
– ఎన్టీఆర్ భరోసా పేరు పెట్టి అన్న ఫొటో లేకుండా ఎలా?
– రఘురామకృష్ణంరాజు చెప్పేవరకూ గుర్తించరా?
– చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురావద్దన్న రఘురామరాజు
– ఆయనకు తెలియకుండా విడుదల చేసి ఉంటారని అనుమానం
– టీడీపీ సోషల్‌మీడియా గ్రూపులలో ‘ఎన్టీఆర్ ఫొటో’ చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
దేశంలో సామాజిక పించన్ల సృష్టికర్త దివంగత మహానేత ఎన్టీఆర్ అన్నది చిన్నపిల్లాడికీ తెలిసిన నిజం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే టీడీపీ సిద్ధాంతం. ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం ‘అన్న’ నినాదమే.. తెలుగుదేశం పార్టీపై చెరగని సంతకం. అలాంటిది.. దేశంలోనే తొలిసారి 7 వేల రూపాయల సామాజిక పించన్లను అందించిన బాబు నేతృత్వంలోని, టీడీపీ ప్రభుత్వం పేదల పెదవులపై చిరునవ్వులు పూయించింది. అది పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు నిరుపేదలకు ఇచ్చిన హామీ.
ఆర్ధిక సమస్యలున్నప్పటికీ.. జగన్ పుణ్యాన ఖజానా ఖాళీ అయినప్పటికీ, పేద లకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా ఒకటవతేదీనే.. 7 వేల రూపాయల ‘ఎన్టీఆర్ భరోసా సామాజిక పించన్లు’ పేరుతో అందించింది. అప్పుల కుప్పగా మారిన ఖజానా కాలంలో ఇదో విప్లవాత్మక నిర్ణయం. ఇది నిజం.
తమకు ఒకేసారి 7 వేలరూపాయలిచ్చిన చంద్రబాబునాయుడును, పేదలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. కష్టకాలంలో అక్కరకొచ్చే చంద్రబాబు సర్కారు ఇచ్చిన 7 వేల రూపాయలు చూసి మురిసిపోయారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ దానికంటే ముందు.. పెన్షనర్లకు పంపిణీ చేసిన ఓ కరపత్రంలో.. అసలు ఎవరి పేరు మీదైతే పెన్షన్ల పథకం ప్రారంభించారో, అలాంటి యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటో వేయడమే మర్చిపోయారు. ‘ఎన్టీఆర్ భరోసా సామాజిక పించన్లు’ అని పథకం పెట్టి.. వాటి ప్రాధాన్యత వివరిస్తూ ముద్రించిన కరపత్రంలో, ఎన్టీఆర్ ఫొటో ముద్రించకపోవడాన్ని టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నారు. భరించలేకపోతున్నారు. ఇది తమ రాజకీయ ప్రత్యర్ధులకు తామే అవకాశం ఇచ్చినట్టవుతుందని మధనపడుతున్నారు.
ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈ లోపాన్ని ఎత్తిచూపే వరకూ.. చివరకు సీనియర్లు కూడా ఈ లోటును ప్రస్తావించకపోవడంపై, పార్టీ సోషల్‌మీడియా గ్రూపుల వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా.. అధికారుల స్థాయిలో తీసుకున్న నిర్ణయంగా పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నారు.
నిజానికి మొట్టమొదట, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. పెన్షన్ల కరపత్రంపై ఎన్టీఆర్ ఫొటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోనే పించన్లకు శ్రీకారం చుట్టిన మహానుభావుడి ఫోటో లేకుండా కరపత్రాలు ముద్రించడం ఆశ్చర్యపరిచింది. బహుశా ఇది మా పార్టీ అధ్యక్షుడు-సీఎం చంద్రబాబునాయుడుకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా విడుదల చేసి ఉంటారనుకుంటా. ఎన్టీఆర్ అభిమానిగా నేను అభ్యంతరం వ్యక్తం చేశా. ఇలాంటి చర్యలు మా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు-భావినేత లోకేష్ కు చెడ్డపేరు తీసుకువచ్చేవే. అందుకే నేను అభ్యంతరం వ్యక్తం చేశా. ఇకపై ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. కరపత్రంపై అన్నగారి ఫొటో లేదని నేను చెప్పిన తర్వాత, చాలామంది ఫోన్లు చేసి నన్ను సమర్ధించారు. మా మనోభావాలు మీరు గుర్తించారని కృతజ్ఞతలు చెప్పారు. ఇది బాబుగారికి, లోకేష్‌గారికి తెలియకుండా బయటకు వచ్చినట్లు వాళ్లుకూడా అనుమానం వ్యక్తం చేశారు. నేను కూడా వాళ్లకు ఇది బాబు గారికి తెలియకుండా విడుదల చేసి ఉంటారని చెప్పా. అధికారులు ఇలాంటి పనులు చేసి దయచేసి మా పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్ద’ని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
కాగా ఎన్టీఆర్ ఫొటో లేకుండానే కరపత్రం విడుదల చేయడంపై.. ఎన్టీఆర్ అభిమానులు-పార్టీ కార్యకర్తలు, టీడీపీ సోషల్‌మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలకమైన కరపత్రం రూపొందించే ముందు పార్టీ సీనియర్లను సంప్రదించరా?.. వాళ్లతో సంప్రదించి ఉంటే కరపత్రంలో ఎన్టీఆర్ ఫొటో పెట్టాలని చెప్పేవారు కదా?..రాజకీయ అంశాలు కూడా చేర్చి ఉండేవారు కదా?.. కరపత్రంలో ఆర్ధిక అంశాలు ఇచ్చిన మేధావులు.. పేదల పట్ల పార్టీ ప్రదర్శించిన మానవతా కోణం మర్చిపోతే ఎలా? దానిని కరపత్రంలో ప్రస్తావించకపోతే ఎలా? దీనిని తయారుచేసిన వారికి ఎన్టీఆర్ గొప్పతనం తెలియదని.. అసలు ఇది తెలుగువాడు రూపొందించిన కరపత్రం కాదని అర్ధమవుతుంది.
అసలు అధికారులకు రాజకీయ కోణం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది?.. ఇది మానవతావాదానికి సంబంధించిన అంశమైనప్పుడు, కరపత్రంలో అంశాలు కూడా ఆ దారిలోనే ఉండాలి కదా?.. అసలు ఈ కరపత్రాన్ని చంద్రబాబునాయుడు-లోకేష్ అనుమతి లేకుండానే విడుదల చేసినట్లు అనుమానించాల్సి వస్తోంది. లేకపోతే వారే అది రూపొందించిన వారిపై నమ్మకంతో వదిలేసినట్లుంది..
మొన్నీమధ్యనే పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజు ఒక్కటే ఈ లోపాన్ని గ్రహించి పార్టీని అప్రమత్తం చేశారు. కానీ దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ఆ స్పృహ లేకపోవడమే ఆశ్చర్యం.. అసలు వారు దీనిని గమనించారా? లేక గమనించినా మనకెందుకులే అని నిర్లిప్తంగా ఉన్నారా?.. ఏది ఏమైనా.. అన్నగారి ఫొటో లేకుండా విడుదల చేసిన కరపత్రం తయారుచేసిన మేధావులు.. దానిని అనుమతించిన మేధావులపై చర్యలు తీసుకుని, మరోసారి ఇలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాలి! ఇదీ.. టీడీపీ సోషల్‌మీడియా గ్రూపులలో జరుగుతున్న ఆవేదనాభరిత చర్చ.