Suryaa.co.in

Editorial

నాటి ‘సంతోష’పు మొక్కలు.. ఎక్కడ నాయకా?

– అధికారంలో ఉండగా మొక్కలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపీ సంతోష్
– సంతోష్ చాలెంజ్ పేరుతో చోటా మోటా నేతల హడావిడి
– బుల్లితెర నుంచి పెద్ద తెర తారల వరకూ పోటా పోటీ సెల్ఫీలు
– సంతోష్ ప్రసన్నం కోసం ‘మొక్కలతో సెల్ఫీల పోటీ’
– అధికారం పోయిన తర్వాత కనిపించని ‘మొక్కల పోటీ’
– ఇప్పటిదాకా ఒక్కరూ మొక్కలు నాటని వైనం
– కనిపించని మొక్కల ‘సంతోష’ం
( మార్తి సుబ్రహ్మణ్యం)

బెల్లం.. అధికారం రెండూ ఒకటే. బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. అది ప్రకృతి సహజం. బెల్లం ఆకర్షణ శక్తి అలాంటిది. అధికారం కూడా అంతే. అధికారంలో ఉంటే అందరూ ఎగబడుతుంటారు. భజన చేస్తుంటారు. మీ అంతటివాడు లేదని ఆకాశానికెత్తేస్తుంటారు.పనుల కోసం వాలిపోతుంటారు. అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడతుంటారు.

వారి టేస్టేమిటో కనుక్కొని..కొనుక్కొని.. ఫాలో అవుతుంటారు. వారి సంతోషమే తమ సంతోషమన్నంత బిల్డప్పులు ఇస్తుంటారు. ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్లు నిజమేనని భ్రమిస్తుంటారు. అవన్నీ అధికారం తెచ్చి పెట్టిన, తాత్కాలిక మెరుపులన్న విషయం చాలామందికి తెలియదు. స్థితప్రజ్ఞులు మాత్రమే అర్ధం చేసుకుని, అవసరానికి తగ్గట్లు వ్యవహరిస్తుంటారు.

ఇప్పుడు తెలంగాణలో ‘మొక్కల సంతోష’ం భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్‌ఎస్ అధికారంలో లేదు కాబట్టి! అదేంటి.. మొక్కలకు, అధికారం లేకపోవడానికి బాదరాయణ సంబంధమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఉంది కాబట్టే ఆ ఆశ్చర్యం మరి!

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ మేనల్లుడు, కమ్ ఎంపీ సంతోష్‌కుమార్ హవా మామూలుగా సాగలేదు. అంతఃపురంలో ఆయనదే పెత్తనం. కేసీఆర్ కంటే ఆయనే బిజీగా ఉండేవారు. సారు బిజీ కాబట్టి ఆయన తరఫున సంతోష్ అన్నీ చూసుకునేవారు. అలాంటి సంతోష్‌కుమార్ కొన్నేళ్లు మొక్కలపై ప్రేమ చూపించారు. మొక్కలునాటుతూ, ఆ ఫొటోను మరికొందరికి షేర్ చేసి చాలెంజ్ సెల్ఫీ దిగేవారు. అంటే మీరు కూడా మొక్కలు నాటండి అని సందేశం ఇచ్చేవారన్నమాట!

దానితో చిన్నా చితకా, పెద్దవాళ్లంతా సంతోష్‌ను ఫాలో అయ్యేవారు. అంటే మొక్కలు నాటిన చోట నిలబడి, ఫొటోలు తీయడం వంటి మీడియా కవరింగ్ ఫొటోలన్నమాట. కొన్నాళ్లు ఇదో యజ్ఞంలా మారింది. చిన్నా చితకా బుల్లితెర నటీమణుల నుంచి.. పెద్ద తెర తారల వరకూ క్యూలు కట్టి, మొక్కల దగ్గర నిలబడి సెల్ఫీ చాలెంజ్ చేసి, సంతోష్‌ను మెప్పించేవారు. ఆరకంగా అదొక ‘మొక్కల ఈవెంట్’లా మారింది.

సంతోష్ చివరకు సహచర ఎంపీలతో కూడా మొక్కల చాలెంజ్ చేయించి, రికార్డు బద్దలు కొట్టాలన్నంత కసితో పనిచేశారు. దీనితో అప్పట్లో సంతోష్‌ను ప్రసన్నం చేసుకోవాలనుకునే వారికి, ఈ ‘మొక్కల మొక్కులు’ షార్టుకట్‌లా మారింది. మరి అప్పట్లో ఈ మీడియా మొక్కల సంతోషం ఒక రేంజ్‌లో ఉండేది కదా?!

సీన్ కట్ చేస్తే.. తెలంగాణలో అధికారం మారింది. బీఆర్‌ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం అవినీతితోపాటు.. వివిధ అంశాలపై విచారణ మొదలయింది. బీఆర్‌ఎస్‌కు శ్రమదానం చేసిన అధికారులంతా, అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడంతా కాంగ్రెస్‌దే హవా.

అయినా సరే అధికారంతో సంబంధం లేకుండా ‘మొక్కలు మొక్కులు’ కొనసాగాలి కదా? మరదే విచిత్రం! ఎప్పుడైతే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందో అప్పుడే సంతోషపు మొక్కల హడావిడి ఆగిపోయింది. ఇప్పుడు మొక్కల చాలెంజ్ విసిరేవారు లేదు. దాన్ని స్వీకరించి సెల్ఫీలు దిగేవారూ లేరు. అంతా అధికార మాయ! ఇదీ అధికారం పోయిన తర్వాత, కనిపించని ‘సంతోష’పు మొక్కల కథ!!

LEAVE A RESPONSE