– జిపి,ఏజీపీ, స్టాండింగ్ కౌన్సిల్స్‌లో గుంటూరు కృష్ణా జిల్లాలకే పెద్దపీట
– మిగిలిన జిల్లాల న్యాయవాదులకు అంతంత మాత్రమే
– ప్రాంతీయ అసమానతలపై టీడీపీ న్యాయవాదవర్గాల అసంతృప్తి
– చంద్రబాబు-లోకేష్‌కు తెలియకుండానే నియమించారంటూ ఫిర్యాదులు
– పార్టీకి ఆ రెండు జిల్లాల న్యాయవాదులే పనిచేశారా అంటూ ప్రశ్నల వర్షం
– ఇదెక్కడి అన్యాయమంటున్న సీనియర్ న్యాయవాదులు
– ఏ ప్రాతిపదికన నియమించారంటూ ప్రశ్నలు
– చంద్రబాబుకు ఆధారాలతో సహా 76 పేజీల నివేదిక
– అందులో ‘న్యాయమెక్కడ నాయకా’ శీర్షికతో ‘సూర్య’ కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ చిన్న నియామకాలు చేసినా అందులో కులం, ప్రాంతం, విధేయత వంటి ప్రాతిపదికలు చూసి నియమిస్తుంటారు. చివరకు తన పక్కన ఒక బీసీ, ఒక ఎస్సీ ఉండేలా చూస్తారు. ప్రసంగాల్లో కూడా ఇలాంటి కులసమీకరణ ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. ఆవిధంగా కుల-ప్రాంత సమతుల్యంతో ఎంపిక చేస్తుంటారు. కానీ ఆయన నాయకత్వంలో నడిచే ప్రభుత్వంలో.. అలాంటివేమీ లేకుండా… బాబు వైఖరికి పూర్తి భిన్నంగా, కేవలం రెండు జిల్లాలకే పెద్దపీట వేసేలా నియామకాలు జరుగుతున్నాయంటే నమ్మగలరా?.. ఎస్. నమ్మితీరాలి. ఎందుకంటే ఆ ఆధారాలు సవివరంగా చంద్రబాబునాయుడుకు ఫిర్యాదురూపంలో వెళ్లాయి కాబట్టి.
ఆంధ్రా-తెలంగాణ ఉద్యమం మొదలయిందే ప్రాంతీయ అసమానతల కారణంగా. ఒక ప్రాంతానికే పాలకులు పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి ఆగ్రంగా మారి, అది ఉద్యమరూపంలో ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది. మరి ఆ అనుభవం దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సిన పెత్తందార్లు.. కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పెద్దపీట వేసి, మిగిలిన జిల్లాలను చిన్నచూపు చూస్తే, చివరకు అది పార్టీపై అసంతృప్తికి కారణం కాదా?..
ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో, సరిగ్గా అలాంటి ప్రాంతీయ అసమానతలకు తెరలేచిందన్నది టీడీపీ సీనియర్ న్యాయవాదుల ఆరోపణ. అందులో ప్రాంతీయ సమతుల్యం లోపించిందన్నది వారి ప్రధాన ఫిర్యాదు. ఇది చివరకు చంద్రబాబునాయుడు వరకూ వెళ్లిందట.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ స్థాయిలలో ప్రభుత్వ లాయర్లను నియమించారు. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబునాయుడు ఒక కీలక వ్యక్తిపై నమ్మకంతో పూర్తి అధికారం ఇచ్చినందున.. సదరు కీలక వ్యక్తి, తన ఇష్టానుసారం అందులో లాయర్లను నియమించినట్లు, బాబుకు కొందరు పార్టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తమ వద్ద ఉన్న ఆధారాలు బాబుకు అందచేసినట్లు సమాచారం.
‘‘మీరు ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛ, చనువును దుర్వినియోగం చేశారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ పదవుల్లో ఆయన గుంటూరు-కృష్ణా జిల్లాల వారికే పెద్దపీట వేశారు. ఇది ప్రాంతీయ అసమానతలకు కారణమయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మాతోపాటు, మిగిలిన జిల్లాల న్యాయవాదులు కూడా పోరాడారు. అధికారం వచ్చిన తర్వాత వారికి సరైన స్థానం కల్పించాల్సి ఉండగా, మీరు నమ్మిన వ్యక్తి కేవలం గుంటూరు-కృష్ణా జిల్లాలకే పెద్ద పీట వేయడంతో, పార్టీకి పనిచేసిన ఇతర జిల్లాల న్యాయవాదులు మనస్తాపం చెందుతున్నార’’ని సీనియర్ న్యాయవాదులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
ఇదెక్కడి ప్రాంతీయాభిమానం?
ఆ ప్రకారంగా..గత ఏడాది ఓ ప్రముఖుడి ఆధ్వర్యంలో నియమించిన 26మంది గవర్నమెంట్ ప్లీడర్లలో.. 16 మంది గుంటూరు, కృష్ణా జిల్లాల వారే ఉండటం గమనార్హం. ఇక 69 మంది అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లలో 28మంది, గుంటూరు-కృష్ణా జిల్లాల వారే ఉన్నారు. ఇక 43 మంది స్టాండింగ్ కౌన్సిల్స్‌లో 18 మంది గుంటూరు-కృష్ణా జిల్లాలకు చెందిన వారే ఉండ టంపై, టీడీపీ న్యాయవాదవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
‘‘ఇలాంటి అన్యాయం ఎక్కడా ఉండదు. అన్ని పదవులూ ఆ రెండు జిల్లాలకు ఇస్తే, మిగిలిన జిల్లాల న్యాయవాదులు ఆ పదవులకు పనికిరాని వారు, అనర్హులని చెప్పడమే ఆ నియామకాల ఉద్దేశమా? ఇది మిగిలిన జిల్లాల్లో పార్టీకి పనిచేసిన మా లాంటి లాయర్లను అవమానించడమే. ఐదేళ్లు మాకు అర్ధరాత్రి ఫోన్లు వస్తే ఇంటిని విడిచి, పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగిన సందర్భాలకు లెక్కలేదు. మాకేమీ పార్టీ నయాపైసా ఇవ్వలేదు. పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని ఇప్పుడు ఈవిధంగా అవమానిస్తారనుకోలేద’’ని, సీమకు చెందిన ఓ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా అధికారంలో లేనప్పుడు పార్టీకి ఎవరు పనిచేశారో, ఎవరు పనిచేయలేదోనన్న సమాచారం- అవగాహన లేని వారికి పెత్తనం ఎలా ఇచ్చారు? వారిని ఏవిధంగా గుడ్డిగా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదని టీడీపీ కార్యకర్తల బెయిల్ కోసం న్యాయపోరాటం చేసిన న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఉన్నం మురళీధర్?
కాగా న్యాయవ్యవస్థలో ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలకు సంబంధించి.. చంద్రబాబు-లోకేష్‌తో ప్రమేయం లేకుండా చక్రం తిప్పిన, ఓ ‘ప్రభుత్వ న్యాయపెద్ద’ వ్యవహారం.. చంద్రబాబు నాయుడు దృష్టికి ఆలస్యంగా వెళ్లినట్లు సమాచారం. సుదీర్ఘకాలం నుంచి పార్టీ-ప్రభుత్వానికి సంబంధించిన పలు నియమాకాలలో అంతా తానై వ్యవహరిస్తూ, బాబును తప్పుదోవపట్టిస్తున్న సదరు ‘ప్రభుత్వ న్యాయపెద్ద’, ఈ ఏడాదిలో జరిపిన నియామకాలు.. గాలి జనార్దన్‌రెడ్డి సహా, వైసీపీ నేతలకు సంబంధించిన కేసుల్లో ఆయన ఆఫీసు లాయర్లే అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఉండటం.. వాటిని పార్టీకి చెందిన మరికొందరు సీనియర్ న్యాయవాదులు, వైసీపీ నేతల పక్షాన వాదించిన వైనాన్ని ఆధారాలతో సహా చంద్రబాబుకు, 76 పేజీల నివేదికను సమర్పించారు. వాటిలో ‘న్యాయమెక్కడ నాయకా’ అన్న శీర్షికతో వచ్చిన ‘ ‘సూర్య’ ’ కథనం కూడా ఉండటం విశేషం.