Suryaa.co.in

Editorial

ఏ బిడ్డను ఆశీర్వదించాలమ్మా?

– అడకత్తెరలో కరుణామయుడు
– జగన్ ప్రచారయాత్రను దీవించిన విజయమ్మ
– మళ్లీ సీఎంను చేయాలని ప్రార్ధన
– అదే ఇడుపులపాయలో మళ్లీ కూతురితో విజయమ్మ
– షర్మిల కోరిక ఫలించాలని ప్రార్ధన
– ఏసుప్రభువు ఇద్దరినీ దీవిస్తారా?
– అంటే ఇద్దరూ సీఎంలు ఎలా అవుతారు?
– లేక పులివెందులో కొడుకు, కడపలో షర్మిలను గెలిపించాలని ప్రార్ధించారా?
– నియోజకవర్గవారీ ప్రార్ధనలను ఏసుప్రభువు కరుణిస్తారా?
– కడపలో బిడ్డను గెలిపించాలని ప్రచారం చేయరేం?
– పులివెందులలో విజయమ్మ ప్రచారం ఎవరికి?
– తోడికోడలికా? కన్న కొడుకుకా?
– ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికేనని బాబు విమర్శ
– తల్లికాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ నాటకాలంటూ ధ్వజం
– ఏసు ఏ బిడ్డను కరుణిస్తారు?
– క్రైస్తవ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకసారి కొడుకు జగన్‌ను.. మరోసారి కూతురు షర్మిలని ఆశీర్వదించాలని తల్లి విజయమ్మ కోరుకోవడం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇద్దరూ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇద్దరి కార్యక్రమాలకూ తల్లి విజయమ్మ హాజరయింది. కొడుకు జగన్‌ను ఆశీర్వదించాలని ప్రార్ధించారు. కొడుకును సీఎంను చేయాలని ప్రార్ధించారు. ప్రజల వద్దకు వస్తున్న నా బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. తర్వాత కూతురు షర్మిల ప్రచార ప్రారంభ కార్యక్రమానికీ హాజరయి, ఆమెను ఆశీర్వదించాలని ఏసుప్రభును ప్రార్ధించారు. యథావిధిగా ఇద్దరికీ ముద్దులు పెట్టి, యుద్ధరంగానికి పంపించారు.

దానితో విజయమ్మ తీరుపై చర్చ మొదలయింది. ఏసుక్రీస్తు ఇద్దరినీ ఎలా ఆశీర్వదిస్తారు? ఎవరినో ఒకరినే ఆశీర్వదిస్తారు కదా? ఇద్దరినీ ఆశీర్వదించడమంటే ఇద్దరినీ ముఖ్యమంత్రిని చేయమన్నట్టే కదా? ఆ ప్రకారంగా ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు? పోనీ ఆమె కడప ఎంపీ వరకూ కూతురు షర్మిలను ఎంపీగా గెలిపించి, కొడుకు జగన్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చూడాలని ఏసుప్రభువును కోరుకున్నారా? అంటే అవినాష్‌రెడ్డిని ఓడించాలని డైరక్టుగా ప్రార్ధించినట్టే కదా? మరి ఈ ‘పక్షపాత ప్రార్ధన’ను ఏసు ఒప్పుకుంటారా? తల్లి మనసంటే ఇద్దరినీ కోరుకుంటుంది. కానీ ఏసు ఇద్దరికీ సమాన వరాలివ్వలేరు కదా? అన్న తర్క-వితర్కమైన చర్చ జరుగుతోంది. మొత్తానికి విజయమ్మ తన ప్రార్ధనలతో, కరుణాముయుడిని మహా మొహమాటంలో నెట్టారన్న వ్యాఖ్యలు క్రైస్తవ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

మరి రేపు పులివెందులలో తోడికోడలు సౌభాగ్యమ్మ.. కాంగ్రెస్ అభ్యర్ధిగా కొడుకు జగన్‌పై పోటీకి దిగితే, విజయమ్మ ఏసుప్రభువును ఏం ప్రార్ధిస్తారన్న ఆసక్తికరమైన చర్చ మరొకటి మొదలయింది. కొడుకు గెలిపించమని ప్రార్ధిస్తారా? లేక తోడికోడలిని గెలిపించాలని ప్రార్థిస్తారా అన్నది చూడాలి. మరిదిని చంపారంటున్న అవినాష్‌రెడ్డి అండ్ కోకు కొడుకు జగన్ మద్దతునిస్తున్నారని, స్వయంగా ఇద్దరు కూతుళ్లు ఆరోపిస్తున్నారు. మరి అలాంటి కొడుకు వ్యతిరేకంగా, కూతుళ్లకు మద్దతునిస్తారా? లేక ఎంతైనా కొడుకు కాబట్టి, పులివెందుల వరకూ జగన్ కోసం ప్రత్యేక ప్రార్ధనలు’ చేస్తారా? ఇలా ‘నియోజకవర్గాల వారీగా’ చేసే ప్రార్ధనలు’ ఏసుప్రభువు ఆలకిస్తారా? ప్రభువు ఆశీర్వాదాలు అసెంబ్లీకి పార్లమెంటుకు వేర్వురుగా ఉంటాయా? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

అసలు విజయమ్మ పులివెందుల ప్రచారంలో, బిడ్డ షర్మిలతో పాటు దిగుతారా? దిగితే కొడుకుకు ఓటు వేయమంటారా? తోడికోడలిని గెలిపించమంటారా? అన్న సందేహాలు తెరపైకొస్తున్నాయి. అసలు షర్మిల ప్రచారంలో విజయమ్మ ఎందుకు మాట్లాడటం లేదు? మొన్నటివరకూ కూతురు వెన్నంటి ఉన్న ఆమె, ఇప్పుడు ఆమె విజయం కోసం బహిరంగంగా ఎందుకు పనిచేయడం లేదు? గత ఎన్నికల్లో కొడుకు విజయం కోసం వేదికలెక్కి ప్రసంగించిన విజయమ్మ.. ఇప్పుడు కూతురు షర్మిల కోసం, ఆపని ఎందుకు చేయడం లేదన్న చర్చకు తెరలేచింది.

అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతె్తనపల్లి వేదికగా.. వైఎస్ కుటుంబపోరుపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు వైఎస్ కుటుంబం చేస్తున్న కుట్ర ఇది. తల్లికాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలివి. అంతర్గత సమస్యలుంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి. ఇది ప్రభుత్వ ఓటును చీల్చి, జగన్‌కు మేలు చేసే వ్యవహారమే’’ని స్పష్టం చేశారు. దానితో జగన్‌ను గెలిపించేందుకే వైఎస్ కుటుంబం, పోరాటమనే కథ అల్లుతోందన్న అనుమానాలకు తెరలేచినట్టయింది.

అటు విజయమ్మ వ్యవహారశైలి కూడా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆమె అటు జగన్, ఇటు షర్మిలతో ఉండటమే దానికి కారణమంటున్నారు. అలా కాకుండా విజయమ్మ ఎవరో ఒకరి పక్షాన నిలబడి, వారికి ప్రచారం చేస్తే అప్పుడు ఆమె చిత్తశుద్ధిని నమ్ముతారని స్పష్టం చేస్తున్నారు. అందుకు భిన్నంగా ‘ఇద్దరూ కావాలనే’ ఆమె వైఖరి వల్ల.. చంద్రబాబు చెప్పినట్లు తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ కలసి నాటకాలాడి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తున్నారన్న భావన బలపడేందుకు ఆసార్కం ఇస్తుందని విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE