Suryaa.co.in

Features

దీపావ‌ళి దీపాల్లో ఏ నూనె శుభ‌క‌రం?

జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస… దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. అయితే దీపాన్ని నేరుగా అగ్గి పుల్లతో వెలిగించకూడదు.

మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.

దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి.

మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.

ఏ నూనెతో దీపారాధన చేయాల‌న్న అనుమానం అంద‌రిలోనూ క‌లుగుతుంది. ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం.

ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.

వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది.

విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. అయితే వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు.

 

LEAVE A RESPONSE