– ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు
– మధు యాష్కీ ఇంటిపై దాడి
– వివేక్ ఇంటిపైనా ఐటి, ఈడీ దాడులు
– ఈటలకు చెక్ రూపంలో డబ్బులిచ్చానన్న వివేక్
– మరి ఈటలపై కేసు పెట్టరా?
– ఈటలపై కేసులేమయ్యాయి?
– వినోద్‌పైనా దాడులు
– గతంలో పొంగులేటి శ్రీనివాసులురెడ్డితో బీజేపీ చర్చలు
– కాంగ్రెస్‌లో చేరగానే పొంగులేటిపై దాడులు
– బీజేపీలో ఉంటే పులుకడిగిన ముత్యాలా?
-బీజేపీలో ఉంటే సీత.. పార్టీ మారితే రావణులా?
– బీఆర్ఎస్ అభ్యర్ధులు, నేతలపై దాడులేవీ?
-మజ్లిస్ అగ్రనేతలపై దాడులేవీ?
-బీజేపీ-బీఆర్ఎస్ అనుబంధాన్ని మెళ్లో వేసుకుంటున్నారా?
– ‘పువ్వు’ పార్టీ ఇస్తున్న సందేశమేంటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎవరూ మాంసం తింటున్నామని బొక్కలు మెడలో వేసుకోరు. కానీ బీజేపీ దానికి విరుద్ధం. ఒకవైపు తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం క్షేత్రస్థాయిలో ఉంటే, దానికి తెరదించాల్సింది పోయి.. మరింత బలపరిచేలా జరుగుతున్న ఘటనలు, ఆ రెండు పార్టీల ఇమేజీని జమిలిగా డామేజీ చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో కేవలం కాంగ్రెస్ అభ్యర్ధులు-నేతలపై ఈడీ-ఐటీ చేస్తున్న దాడులు.. బీఆర్ఎస్-మజ్లిస్ నేతలకు ఇస్తున్న మినహాయింపులు, కాంగ్రెస్‌పై మరింత సానుభూతి పెంచుతున్నాయి. తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దళిత నేత జి.వివేక్-ఆయన
సోదరుడు వినోద్, ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై జరిగిన ఐటీ-ఈడీ దాడులు బీజేపీ-బీఆర్ఎస్ బంధాన్ని మరింత బలపరిచేలా ఉన్నాయి. ఇది ప్రజల్లో కాంగ్రెస్‌పై సానుభూతి పెంచేందుకు కారణమవుతున్నాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసి, ఆ పార్టీకి ఆర్ధికంగా దన్నుగా నిలిచిన జి. వివేక్ వెంకటస్వామి.. కొద్దిరోజుల క్రితం పార్టీ మారి కాంగ్రెసులో చేరి, ఆ పార్టీ చెన్నూరు అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆయనపై కొద్దిరోజుల క్రితమే ఐటీ-ఈడీ దాడులు జరిగాయి. అయితే ఇప్పటి బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే 27 కోట్ల రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చానని వివేక్ వెల్లడించారు.
మరి తనకు నోటీసులిచ్చిన ఐటీ.. డబ్బులు తీసుకున్న ఈటలకు ఎందుకు నోటీసులివ్వలేదన్న వివేక్ ప్రశ్న..జనక్షేత్రంలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈటలపై ఉన్న కేసులు అటకెక్కించారన్న ప్రచారం లేకపోలేదు. అంటే ఈటల బీజేపీలో ఉన్నందున ఆయనపై ఐటీ దాడులు చేయదా? ఆయనకు నోటీసు ఇవ్వదా? అన్న వివేక్ ప్రశ్న జనక్షేత్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
నిజానికి వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో, అభ్యర్ధులకు ఆర్ధిక సాయం చేశారు. ఈటల ఉప ఎన్నికల్లో కూడా వివేక్ అప్పు ఇస్తే, అది ఇప్పటిదాకా తీర్చలేదన్న చర్చ బీజేపీలో మొనటివరకూ జరిగిన విషయం తెలిసిందే.
ఈటలకు వివేక్ దాదాపు ఆరుకోట్ల అప్పు ఇచ్చారన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. ఒకప్పుడు స్వయంగా సీఎం కేసీఆరే ఆయన దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ స్వయంగా తన ఎన్నికల అపిడవిట్లో పేర్కొని, తాను వివేక్ దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నానని అఫిడవిట్లో పేర్కొనడం ప్రస్తావనార్హం.
మరి బీజేపీ నేత ఈటలకు 27 కోట్లు అప్పు ఇచ్చిన వివేక్‌కు నోటీసులిచ్చిన ఐటీ శాఖ..ఆ అప్పు తీసుకున్న అదే బీజేపీ నేత ఈటలకు ఎందుకు నోటీసులివ్వలేదన్నది, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరికైనా వచ్చే సందేహమే. నిబంధనల ప్రకారం వ్యాపారం చే స్తున్న తాను ఇప్పటిదాకా 10 వేల కోట్ల పన్నులు చెల్లించానన్న వివేక్.. బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ ఫిర్యాదుతోనే ఐటీ అధికారులు, 8 చోట్ల సోదాలు నిర్వహించారని చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. తాను ఏ వ్యాపారం చేసినా చట్టబద్ధంగానే చేశానని, బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మకై తన అరెస్టుకు కుట్ర చేస్తున్నారన్న వివేక్ ఆరోపణ చర్చనీయాంశంగా మారింది.
ఇక వివేక్ సోదరుడైన మాజీ మంత్రి వినోద్‌పైనా, కేసు నమోదవడం ప్రస్తావనార్హం. క్రికెట్‌కు సంబంధించిన అంశంలో ఆయనపై కేసు నమోదయింది. ఇటీవలి క్రికెట్ సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానెల్‌ను వ్యతిరేకించిన వారందరిపై కేసులు నమోదు కావడం ప్రస్తావనార్హం.అందులో అజారుద్దీన్ కూడా ఒకరు.
ఇక ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, బీజేపీలోకి తీసుకువచ్చేందుకు చాలా పెద్ద ప్రక్రియనే నడిచింది.బీజేపీ అగ్రనేతలు ఆయనతో చర్చలు జరిపారు. చేరిక తేదీ కూడా దాదాపు ఖరాయిందన్న ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల చివరకు ఆయన కాంగ్రెస్‌లో చేరి, ఇప్పుడు పాలేరు అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. అయితే
కొద్దిరోజుల క్రితం ఆయన నివాసంపై ఐటీ-ఈడీ దాడులు నిర్వహించింది. సరిగ్గా అదే సమయంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గెస్టు హౌస్‌పైనా దాడులు జరిగాయి.మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చనగారి లక్ష్మారెడ్డి నివాసాలపైనా దాడులు చేసి, నగదు సీజ్ చేశారు.
తాజాగా మాజీ ఏఐఎస్, తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకె గోయల్ నివాసంలో భారీ స్థాయిలో డబ్బు డంప్ చేశారన్న ఫిర్యాదుపె,ై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్, మల్లు రవి తదితరులు గోయల్ ఇంటి వద్దకు చేరడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. తనిఖీలో ఏమీ దొరకలేదన్న పోలీసుల ప్రకటనలపై, కాంగ్రెస్ నేతలు అగ్గిరాముళ్లయ్యారు. రెండు ఖాళీ కార్లు బయటకు వెళ్లినా , పోలీసులు వాటిని తనిఖీ చేయకుండా వదిలేశారని ఆరోపించారు.
అసలు పోలీసుల వాహనాలు కూడా తనిఖీలు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన ఉప
ఎన్నికల్లో కేసీఆర్ పోలీసుల వాహనాల్లోనే డబ్బు తరలించారని ఆరోపించారు. తాజాగా గోయల్ ఇంటిలో డబ్బులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
ప్రభుత్వ సలహాదారులు, మాజీ సలహాదారులతోపాటు.. కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఆరేడుమంది ఐఏఎస్ అధికారుల ఇళ్లమీద కూడా దాడులు చేసి, తనిఖీలు నిర్వహించాలని పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి డిమాండ్ చేయడం చర్చనీయాంశమయింది. ‘‘అసలు
పోలీసులుగానీ, కేంద్ర బృందాలు గానీ ప్రగతిభవన్, కేసీఆర్ ఫాంహౌస్, కేటీఆర్ ఫాంహౌస్‌లో గానీ ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు? కేసీఆర్ కుటుంబపెట్టుబడులున్న కంపెనీలపై ఐటీ,ఈడీ ఎందుకు సోదాలు చేయడం లేదు? బీఆర్ఎస్కు నిధులిస్తున్న కంపెనీలపై ఎందుకు దాడులు చేయడం లేదు? కాంగ్రెస్ వారి ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటి-ఈడీ ఓవైసీ కంపెనీలు,ఇళ్లపై ఒక్కసారి కూడా ఎందుకు దాడులు నిర్వహించలేదు? దీన్నిబట్టి బీఆర్ఎస్-బీజేపీ అపవిత్ర బంధం అర్ధమవుతుంది కదా?’’ అని అయోధ్యరెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతున్న వరసదాడులపై, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ మొన్నటివరకూ బీజేపీలో పవిత్రుడిగా ఉన్న వివేక్ కాంగ్రెస్‌లో చేరగానే అపవిత్రుడయ్యారా? అంటే బీజేపీలో ఉంటే సీత, కాంగ్రెస్‌లో చేరితే రావణాసురుడవుతారా? ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్ధి ఐటీ-ఈడీలే. వీటితోనే మా యుద్ధం’’ అని స్పష్టం చేశారు.
దీనితో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు జనక్షేత్రంలో చర్చనీయాంశమయింది. దేశంలో అనేకమంది బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఎంపీలపై దాడులు చేసిన ఐటీ-ఈడీ.. ఇప్పటిదాకా బీజేపీ రాజకీయ ప్రత్యర్ధి అయిన మజ్లిస్ నేతల కుటుంబాలపై, ఎందుకు దాడులు చేయలేదన్న ప్రశ్న బహిరంగంగానే వినిపిస్తోంది. బీజేపీ తన రాజకీయ ప్రత్యర్ధులను విడిచిపెట్టకుండా.. వారిపై దాడులు చేయిస్తున్న నేపథ్యంలో, మజ్లిస్‌కు మినహాయింపు ఇచ్చారంటే దాని అర్ధం ఏమిటన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్కు ఎన్నికల నిధులిస్తున్న పలు కంపెనీలపై దాడులు ఎందుకు విస్మరించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కృష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజనీరింగ్‌కు అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని,
అందులో కేసీఆర్ కుటుంబ పెట్టుబడులున్నాయని వైఎస్ షర్మిల స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయినా ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిజంగా బీజేపీకి బీఆర్ఎస్ను ఎన్నికల సమయంలో ఆర్ధికంగా దెబ్బతీయాలంటే ఇలాంటి ఎన్నో మార్గాలున్నా, కేంద్రంలోని బీజేపీ సర్కారు బీఆర్ఎస్ బదులు.. కాంగ్రెస్ లక్ష్యంగా దాడులు చేస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి బీజేపీ-బీఆర్ఎస్ బంధం ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ చేయిస్తున్న దాడులన్నీ.. పరోక్షంగా తెలంగాణలో బీఆర్ఎస్ను దరిచేర్చడానికేనన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతోంది.