-
నాధుడు లేని ఆడిట్ విభాగం
-
రెండు నుంచి ఇన్చార్జి కూడా లేని ఆడిట్ డిపార్టుమెంట్
-
రెండేళ్ల నుంచి పూర్తి స్థాయి డైరక్టర్ లేని నిర్లక్ష్యం
-
ఆ పోస్టు కోసం భారీ పైరవీలు
-
రేసులో వైవి సుబ్బారెడ్డి బంధువు
-
ఆమెకు తెలంగాణ సీఎంఓ సిఫార్సు?
-
మరొకరికి పవన్ కల్యాణ్ సిఫార్సు?
-
ఆ పోస్టుకు ఖరీదు కట్టి రంగంలోకి దళారీలు
-
కులం దన్ను ఉన్నవారికే డైరక్టర్ పోస్టా?
-
ప్రతిభ, సీనియారిటీకి పాతర
-
4 రోజుల్లో 40 ఆర్డర్లు ఇచ్చిన ఘనులు
-
ఈ -ఆఫీస్ ఉన్నా అన్నీ హార్డ్‌కాపీలే
-
మళ్లీ ఆయనకు ఆరునెలలు పొడిగింపు ఇస్తారట
-
అదే జరిగితే ఆరుగురు అధికారులకు అన్యాయం
-
చక్రం తిప్పుతున్న ఓ ఐఏఎస్?
-
ఆర్దిక శాఖపై మంత్రికి పట్టేది?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అవసరం లేకపోయినా పనిలేని వారిని కొనసాగించవద్దని.. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా.. ఆయనకు నోరు నొప్పి తప్ప, శాఖాధిపతుల్లో కించిత్తు కూడా మార్పు కనిపించడం లేదు. ఆయన ఆ వయసులోనూ గంటలపాటు సమీక్షలు నిర్వహించి ఆదేశాలివ్వడం.. వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో నోట్ చేసుకున్నట్లు అధికారులు నటించటం.. బయటకు వచ్చిన తర్వాత ఆ నోట్ ప్యాడ్‌ను కారులోనే పడేయటం సాధారణమయింది. ప్రధానంగా ఆర్ధిక, విద్యుత్, కార్మిక, రవాణా వంటి కీలక శాఖల్లో ఒక అలవాటుగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. కారణం.. సదరు మంత్రులకు శాఖలపై పట్టు లేకపోవడమేనన్నది వినిపించే జవాబు.
ఆర్ధిక శాఖలో డైరక్టర్ స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ కీలక విభాగం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, లైబ్రరీలు, దేవాలయాలు, చివరకు టిటిడి వంటి అనేక సంస్థలన్నీ ఆడిట్ డిపార్టుమెంట్ పరిథిలోకి వస్తాయి. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు ఏవి జరిగినా, ఆడిట్ డిపార్టుమెంట్‌కు తెలియాల్సిందే. వాటి లెక్కా డొక్కలు తేల్చాల్సింది ఈ విభాగమే.
మరి ఇంత కీలకమైన విభాగానికి రెండేళ్ల నుంచి పూర్తి స్థాయి డైరక్టర్ లేరంటే నమ్ముతారా? రెండురోజుల నుంచి అసలు ఇన్చార్జి కూడా లేకుండా ఒక ప్రభుత్వ విభాగం నడుస్తుందంటే నమ్మగలరా? రెండేళ్ల నుంచి ఇన్చార్జిల పాలనలోనే ఆడిట్ డిపార్ట్‌మెంట్ నడుస్తోందంటే నమ్ముతారా?
అసలు రిటైరవడాకి నాలుగు రోజుల ముందు ఓ ఇన్చార్జి అధికారి, ఆ నాలుగురోజుల్లో సరిగ్గా 40 ఆర్డర్లు.. అది కూడా ఈ-ఆఫీస్‌లో కాకుండా, హార్డ్‌కాపీతో.. ఇష్టానుసారం బదిలీలు, డిప్యుటేషన్లు ఇచ్చేశారంటే నమ్మగలరా? వైసీపీ జమానాలో పెత్తనం చేసి, 15 నెలల పాటు పోస్టింగ్ లేకుండా, తాజాగా చంద్రబాబు దయతో మళ్లీ పోస్టింగ్ దక్కించుకుని, ఇటీవలే రిటైరైన సదరు రెడ్డిగారికి.. మళ్లీ మరో ఆరు నెలల పొడిగింపు ఇచ్చేందుకు, ఓ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పుతున్నారంటే నమ్మగలరా? యస్.. నమ్మితీరాలి. ఎందుకంటే ఇవన్నీ నిఝంగా నిజాలు కాబట్టి! ఆర్ధికశాఖలో బహిరంగంగానే జరుగుతున్న చర్చ కాబట్టి!!
ఆర్ధిక శాఖలో అత్యంత కీలకమైన ఆడిట్ డిపార్ట్‌మెంట్ నాధుడు లేని నావలా మారింది. నిజానికి ఇంత కీలకమైన విభాగానికి డైరక్టర్ ఉండాలి. కానీ గత రెండేళ్ల నుంచి ఇన్చార్జితోనే బండి లాగించారు. అప్పటి ఇన్చార్జి డైరక్టర్ హరిప్రకాష్‌రెడ్డి వైసీపీ జమానాలో ఒక వెలుగువెలిగారు. కార్యదర్శి సత్యనారాయణ దన్నుతో చక్రం తిప్పారు. వివిధ ఫిర్యాదుల కారణంగా, 15 నెలల క్రితం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు.
అయితే గత రెండు నెలల క్రితం ఆయన, సీఎంఓ లోని ఒక అధికారి సలహాతో సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. తనకు ఆర్ధికంగా ఇబ్బందులున్నాయని, పైగా తాను త్వరలోనే రిటైరవుతున్నందున.. మానవతా దృక్పథంతో తనకు పోస్టింగ్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. దానికి కరుణించిన సీఎం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వమని ఆర్ధిక శాఖను ఆదేశించారు.
ఈలోగా రెడ్డిగారి ఘనత గురించి మీడియా తాటికాయంత అక్షరాలతో రాసింది. దానితో సీఎం ఆదేశాలను కొద్దిరోజులు పెండింగ్‌లో పెట్టిన ఆర్ధిక శాఖ కార్యదర్శి, రెడ్డిగారు రిటైయ్యే నాలుగురోజుల ముందు ఇన్చార్జి డైరక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది.
సహజంగా ప్రభుత్వంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలన్నీ ఈ- ఆఫీస్ ద్వారానే జరుగుతుంటాయి. కానీ నాలుగురోజుల్లో రిటైరయ్యే రెడ్డిగారు అందుకు భిన్నంగా.. నలభై ఆదేశాలు హార్డ్‌కాపీలతో ఇచ్చేశారని, అందులో చాలావరకూ ట్రాన్స్‌ఫర్లు, డిప్యుటేషన్లు, ప్రమోషన్ల ఫైళ్లే ఉన్నాయన్నది ఆర్ధికశాఖలో జరుగుతున్న చర్చ. కాబట్టి రెడ్డిగారు వెళ్లేముందు ఇచ్చిన ఆ 40 ఆర్డర్లను సమీక్షించాలన్నది ఆర్దికశాఖ ఉద్యోగుల వాదన.
ఇన్ని ఘనతలు మూటకట్టుకున్న రెడ్డిగారికి, రిటైరయినా ఇంకా ఆడిట్ డిపార్టుమెంట్‌పై ప్రేమచావక.. తనకు మరో ఆరునెలల సర్వీసు పొడిగింపు ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారట. దానికి ఆ శాఖలోని ఓ ఐఏఎస్ దన్నుగా నిలిచారన్నది ఆర్ధిక శాఖలో జరుగుతున్న చర్చ.
నిజంగా రెడ్డిగారికి మళ్లీ ఆరునెలలు పొడిగింపు ఇస్తే, ప్రస్తుతం డైరక్టర్ లేదా ఇన్చార్జి డైరక్టర్‌కు అర్హులైన ఆరుగురికి అన్యాయం జరుగుతుందన్నది ఉద్యోగుల వాదన. వీరిలో వైవి సుబ్బారెడ్డి బంధువుగా ప్రచారంలో ఉన్న విజయలక్ష్మి రెడ్డికి, గత 10 నెలల నుంచి పోస్టింగ్ లేదు. ఆమె తెలంగాణ సీఎంఓ నుంచి పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. విజయభారతికి సామాజికవర్గ కోణంలో డిప్యూటీ సీఎం పవన్ సిఫార్సు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఇదిలాఉండగా.. డైరక్టర్ పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కొందరు పైరవీలు రంగంలోకి దిగి.. ఆ పోస్టుకు ఇన్ని లక్షలు ఇస్తే అది మీదేనంటూ బేరాలకు దిగినఐనం పరిశీలిస్తే, కీలకమైన ఆర్దిక శాఖపై మంత్రికి పట్టు ఉందా లేదా అన్నది స్పష్టమవుతుంది. ఇప్పటికే బిల్లుల్లో కొందరు కమిషన్లు తీసుకుంటున్నారని, పై నుంచి కింది స్థాయి వరకూ జరుగుతున్న ఈ వ్యవహారంపై సచివాలయం కోడై కూస్తోంది. అసలు సచివాలయం క్యాంటీన్లలోనే కాంట్రాక్టర్లతో, ‘మాటముచ్చట్లు’ పూర్తవుతున్నాయన్నది మరో చర్చ. నిజం కేశవుడికెరుక?
కార్మికశాఖలోనూ ఇదే తీరు!
కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలోనూ ఈ- ఆఫీసు కాకుండా, హార్డ్‌కాపీలతో ఆర్డర్లు ఇస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా ఉన్న అధికారి.. ఒకరు చిన్నారావు అనే ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీర్‌గా ఉన్న చిన్నారావును, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా, ఈ- ఆఫీసు ద్వారా కాకుండా హార్డ్‌కాపీ ద్వారా ఆదేశాలిచ్చిన వైనం దుమారం రేపింది. ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఆరోపణపై, చిన్నారావును ఆ డైరక్టర్ సస్పెండ్ చేశారు. అయితే విచిత్రంగా ఆ ఫిర్యాదులో సదరు డైరక్టర్‌పైనా ఆరోపణలు ఉండటం విశేషం.
అయినా తనను మినహాయించుకున్న సదరు డైరక్టర్.. తన కింది స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమేయం-సమాచారం లేకుండా సస్పెన్షన్ అమలు చేయడం చకచకా జరిగిపోయింది. అసలు చిన్నారావు అనే అధికారి సస్పెన్షన్ చె ల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినా, దానిని అమలు చేయకుండా, ఆయన స్థానంలో మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన కోర్టు ధిక్కారం విమర్శల పాలయింది. ప్రభుత్వ సేవలు వేగవంతం కోసం, ఉత్తర్వుల అమలు ఆలస్యం లేకుండా ఉండేందుకే ఈ-ఆఫీసు వ్యవస్థ ఏర్పాటుచేసింది. అయినా శాఖాధిపతులే ఆ వ్యవస్థను వెక్కిరించడం బట్టి, పాలన ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంది.
1 COMMENTS