– అచ్యుతాపురం ఎసెన్షియా కెమికల్స్‌లో పేలుడు జరిగి ఏడాది
– 17 మంది మృతి.. 21 మందికి గాయాలు.. 18 మంది వికలాంగులయిన దారుణ విషాదం
– కంపెనీలో తనిఖీలు చేయకపోవడమే కారణమని నివేదిక
– డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ తనిఖీలు చేయలేదని విస్పష్టంగా తేలిన వైనం
– ఎల్జీపాలిమర్స్, సింబియో, వసంత్ కెమికల్స్, సినర్జిన్ కంపెనీలనూ తనిఖీ చేయకపోవడం వల్లే వాటిలో మరణాలు
– అన్నింటికీ ఒకే అధికారి వైఫల్యమని స్పష్టం చేస్తున్న సెంట్రల్ ఇన్సెపెక్షన్ సిస్టమ్
– అయినా ఇప్పటిదాకా చర్యల కొరడా ఝళిపించని ప్రభుత్వం
– పైగా సదరు అధికారికి కీలక జోన్లో పోస్టింగ్ ఇచ్చిన కార్మికశాఖ ప్రముఖుడు
– సస్పెండ్ అయిన మరో ఉన్నతాధికారికీ నెలలోనే పోస్టింగ్
– కార్మికశాఖ పేషీ అడ్డాగా చక్రం తిప్పుతున్న సూత్రధారులు
– మీడియాలో వరస కథనాలు వచ్చినా చర్యలు శూన్యం
-ఎసెన్షియా ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం
– అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రెస్మీట్లో హామీ
– వసుధామిశ్రాతో కమిటీ ఏర్పాటు.. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
– డిసెంబర్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నా.. విచారణకు 9 నెలలు సమయం తీసుకున్న వైచిత్రి
– సీఎస్‌కు మేలో నివేదిక ఇచ్చిన వసుధామిశ్రా కమిటీ
– నిందితులెవరు? కమిటీ సిఫార్సులేమిటన్నది ఇంకా బ్రహ్మరహస్యమే
– వసుధామిశ్రా కమిటీ రిపోర్టును అమలుచేయరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇటీవలే హైదరాబాద్‌కు సమీపంలోని సిగాచీ కెమికల్స్‌లో జరిగిన పేలుళ్లకు ఇప్పటివరకూ 44 మంది మృతి చెందారు. మరో ఐదారుగురి పరిస్థితి విషమంగానే ఉంది. దానికి కారణం.. కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు అధికారులు తనిఖీలను అటకెక్కించి, కంపెనీలిచ్చే కాసులకు కక్కుర్తిపడి వారితో కుమ్మక్కవడం! తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ భారీ విషాదం మునుపెన్నడూ చోటు చేసుకోలేదు.
మరి ఈ మరణ మృదంగం నుంచి ఏపీ సర్కారు గుణపాఠాలు నేర్చుకుంటుందా? పాఠాలు ప్రతిసారీ గుణపాఠాలవుతున్నా.. కంపెనీల వైఫల్యాలపై గురిపెట్టని అధికారులను శిక్షించకుండా, ‘మంచి ప్రభుత్వం’ కాబట్టి వదిలేస్తుందా? సిగాచీ కంటే ఏడాది క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన ఎసెన్షియా కెమికల్స్‌లో జరిగిన పేలుళ్లకు బలైన 17 మంది అమాయకుల మరణమృదంగం.. సర్కారును మేల్కొపుతుందా? లేక సిఫార్సులు సమాధి చేస్తుందా? అసలు దానిపై వేసిన వసుధా మిశ్రా కమిటీ సిఫార్సులను అమలుచేస్తుందా? లేక పారిశ్రామిక దిగ్గజాలకు భయపడి, కోల్డ్‌స్టోరేజీలో పెడుతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
అది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్..
ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ కంపెనీ అది
గత ఏడాది ఆగస్టు 21…
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆ కెమికల్ ఫ్యాక్టరీలో గుండె పగిలేంత విస్పోటనం..
ఆకాశాన్నంటుతున్న అగ్నికీలలు.. పొగలు.. సెగలు.. హాహాకారాలు
అగ్నికీలల మధ్య ఆహుతవుతున్న కార్మికుల ఆర్తనాదాలు
గంటల్లోనే శ్మశానంగా మారిన విషాద దృశ్యమది!
మరి అది సహజంగా జరిగిన ప్రమాదమా? కాదు.. నిస్సందేహంగా మానవ తప్పిదం.. ఇంకా సూటిగా చెప్పాలంటే.. కార్మికశాఖ అధీనంలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఫలితంగా 17 మంది మృతి చెంది.. 18 మంది వికలాంగులుగా మారి.. 21 మంది గాయపడ్డ సందర్శనం!
మరి ఈ చావుకు కారకులెవరన్న దానిపై విచారణ జరిగిందా? జరిగితే ఆ విచారణలో ఏం తేల్చారు? ఎవరిని బాధ్యులుగా తేల్చారు? ఇంతకూ ఆ మరణమృదంగానికి ప్రత్యక్షంగా-పరోక్షంగా కారకులయిన వారు ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆ చావులు.. అలాంటి చావులు జరగకుండా ఉండేందుకు, రిటైర్డ్ ఐఏఎస్సమ్మతో సర్కారు వేసిన కమిటీ సిఫార్సు నివేదికకు ఎన్ని టన్నుల బూజు పట్టింది?
గత ఏడాది ఆగస్టు 21న అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ కంపెనీలో జరిగిన దారుణ మరణాలకు ఏడాదవుతోంది. ఆనాడు దానిపై స్వయంగా స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు జరిగిన విషాదానికి విచారం వ్యక్తం చేశారు. జరిగిన విషాదానికి కారణమయిన అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రెస్మీట్లో ప్రకటించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు రిటైర్డ్ ఏఐఎస్ అధికారి వసుధామిశ్రా చైర్మ్గా ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటుచేశారు.
ఆ కమిటీలో సభ్యులుగా పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ డిపార్టుమెంట్ సెక్రటరీ, లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డిపార్ట్మెంట్; విఎస్ఈజడ్ డెవలప్మెంట్ కమిషనర్, ఫైర్ సర్వీస్ డైరక్టర్ జనరల్, ఏపి పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు మెంబర్ సెక్రటరీ, డైరక్టర్ ఆఫ్ బాలయిలర్స్, ఏపిఐఐసి ఎండి, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సభ్యులుగా హైలెవల్ కమిటీని ఏర్పాటుచేస్తూ, 13-9-2024న ప్రభుత్వ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ 3 నెలల్లో తన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
అయితే.. హైలెవల్ కమిటీ సెప్టెంబర్ 28న విశాఖలో ఒక సమావేశం నిర్వహించి, దానికి కార్మిక, పీసీబీ, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఆ ప్రకారంగా కమిటీ తనకు నిర్దేశించిన మూడునెలల కాలవ్యవధిలో, తన సిఫార్సు నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ విచిత్రంగా అందుకు 9 నెలల సమయం తీసుకుంది. మరి అంత సుదీర్ఘ పరిశీలన-పరిశోధన ఏం చేసిందో తెలియదు.
అంటే దానిని మేలో సీఎస్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారు. కమిటీ సభ్యులంతా తమకు వచ్చిన డ్రాఫ్టుపై సంతకం చేసిన తర్వాత, ఫైనల్ రిపోర్టును సీఎస్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ నివేదికలో కమిటీ ఏమి సిఫార్సు చేసింది? ఎసెన్షియా కెమికల్స్‌లో పేలుడు ఘటనకు కారణాలు కనిపెట్టిందా? వైఫల్యానికి కారుకులెవర న్నదీ తేల్చిందా? అసలు ఆ కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు? అన్నవి బ్రహ్మరహస్యంగా మిగిలిపోయాయి.
కంపెనీలలో తనిఖీ పద్ధతి ఇదీ!
నిజానికి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రతి ఏడాది ఒకసారి తమ పరిథిలోని కంపెనీలను విధిగా తనిఖీ చేసి, నివేదికలివ్వాలి. ప్రమాదం ఎక్కువగా ఉండే కంపెనీలను ప్రతి ఏడాది, దానికంటే తక్కువ ప్రమాదం ఉన్న కంపెనీలను రెండేళ్లకోసారి, ఇంకా తక్కువ ప్రమాదం ఉన్న కంపెనీలను మూడేళ్లకోసారి తనిఖీ చేయాలని సెంట్రల్ ఇన్సెపెక్షన్ సిస్టమ్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎందుకంటే అధికారులు ఎప్పుడంటే అప్పుడు తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడితే, పరిశ్రమలు వెనక్కి వెళతాయన్న ముందుచూపుతో, ఏడాదికోసారి తనిఖీలు రూపొందించింది. ఆ మేరకు అధికారుల తనిఖీ వివరాలు ఆన్లైన్లో ఆప్డేట్ చేస్తుంటారు.
అంటే ఉదాహరణకు ఒక డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ఒక కంపెనీలో తనిఖీ చేయాలని ఆదేశిస్తారు. సదరు అధికారి తనిఖీలకు వెళితే డన్ అని, లేకపోతే నాట్ డన్ అని రిమార్కు ఇస్తారు. ఇదంతా ఆన్లైన్లో కనిపించే ప్రక్రియనే. అయితే ఇందులో పారదర్శకత కోసం జంబ్లింగ్ విధానం కూడా రూపొందించారు. అంటే ఒక ఏడాది ఒక కంపెనీని తనిఖీ చేసిన అధికారినే, మళ్లీ వచ్చే ఏడాది తనిఖీలకు పంపించరు. ఆ జోన్‌లోని మరొక అధికారిని పంపిస్తుంటారు. ఇదే జంబ్లింగ్ విధానం!
తనిఖీలన్నీ ఒకే అధికారికి ఎలా ఇచ్చారు?
మీకు గుర్తుందా.. 2017 అక్టోబర్‌లో.. జగన్ సీఎంగా ఉండగా విశాఖ పాలిమర్స్‌లో జరిగిన లీకేజీ కారణంగా 12 మంది బయటవ్యక్తులు మృతి చెందారు. మీకు గుర్తుందా.. డిసెంబర్ 2023లో అచ్యుతాపురం లోని సింబియో జనరిక్స్‌లో ఇద్దరు మృతి చెందారు. మీకు గుర్తుందా.. డిసెంబర్ 2023లో అచ్యుతాపురం సెజ్‌లోని వసంత్ కెమికల్స్‌లో ఒక కార్మికుడు చనిపోయారు. మీకు గుర్తుందా.. డిసెంబర్ 2023లో అనకాపల్లిలోని సినర్జిన్ యాక్టివ్ ఫార్మాకంపెనీలో 4 చనిపోయారు. మీకు గుర్తుందా.. అక్టోబర్ 2024లో పరవాడలోని టాగూర్ లాబరేటరీస్‌లో ఇద్దరు చనిపోయి 23 మంది గాయపడ్డారు.
నిజానికి ఈ కంపెనీలను నాటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ అనే అధికారి తనిఖీ చేయాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ కంపెనీలను తనిఖీ చేయడానికి ఆయననే అలాట్ చేశారు కాబట్టి! కానీ సదరు అధికారి అక్కడ తనిఖీలు నిర్వహించలేదని, సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఆన్లైన్ చార్ట్ విస్పష్టంగా చూపించడం విశేషం. జంబ్లింగ్ పద్ధతిలోనూ అన్ని కంపెనీల తనిఖీ బాధ్యత ఆయనకే రావడం మరో విచిత్రం.
అసలు తనిఖీలు నిర్వహించడమే వారి ఉద్యోగమైనప్పుడు.. అందుకు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నప్పుడు వారి విధినిర్వహణకు దూరంగా ఉండటం బాధ్యతారాహిత్యం కాదా? అసలు ఈ ధిక్కారంపై డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేయకుండా ఉన్నారంటే.. మరి ఆ నిర్లక్ష్యాన్ని చూసి కూడా వదిలేసిన డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌పై చర్య తీసుకునేదెవరన్నది ప్రశ్న.
నిజానికి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కంపెనీలను తనిఖీ చేసిన తర్వాత వాటి లోపాలపై నివేదిక ఇవ్వాలి. ఒకవేళ అది కార్మికులకు, పరిసర ప్రాంతాలకు ప్రమాదం కలిగించేలా ఉంటే మూసివేయించవచ్చు. దీనిని ప్రొహిబిటరీ ఆర్డర్స్ అంటారు. లేదా షోకాజ్ నోటీసు ఇచ్చి, కోర్టుకు వెళ్లవచ్చు. వీటిలో నాటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ ఏ ఒక్క మార్గం అనుసరించకుండా.. అసలు తనిఖీలకు వెళ్లకపోవడమే ఆశ్చర్యం.
మరి అలాంటి అధికారిని సస్పెండ్ చేయాల్సిన డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఆయనకు ఎంచక్కా.. మంచి ఆదాయ వనరులున్న కాకినాడకు బదిలీ చేయడమే వింతల్లో వింత. అసలు ఇన్ని వైఫల్యాల రికార్డు ఉన్న ఆయనను కాకినాడకు బదిలీ చేయడంలో చక్రం తిప్పిందెవరు? ఎవరి ఆదేశాలతో ఆయనను అక్కడికి బదిలీ చేశారు? ఎవరి ఆదేశాలతో ఆయన సస్పెన్షన్ ఆగిపోయింది? కార్మికమంత్రి పేషీ కేంద్రంగా డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ప్రభావితం చేసిన వారెవరన్నదే ప్రశ్న.
ఇటీవలి బదిలీల్లో జరిగిన ఇంకో చిత్రం కూడా చూద్దాం. కడపలో సస్పెన్షన్‌కు గురై.. మళ్లీ నెలలోనే బాగా ఆదాయ వనరులున్న ఏలూరుకు బదిలీ చేసిన వైనం పరిశీలిస్తే.. కార్మిక శాఖలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో బాగా ఆదాయవనరులున్న ఉభయ గోదావరి, ఉమ్మడి విశాఖను ఏ స్థాయిలో తమ గుప్పిట్లో పెట్టుకుని.. తెరవెనక దందాలు చేస్తున్నారో మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
Constitution of High Level Committee GO Ms No 51_0001
