Suryaa.co.in

Editorial

వెంకన్న భక్తుల ప్రాణాలు గాలిలో దీపమేనా?

– తిరుమల కొండపై జరిగిన హత్యకు కారకులెవరు?
– విజిలెన్స్ చీఫ్‌పై చర్యలు తీసుకోలేదెందుకు?
– హతుడు వీపీఐ అయితే టీటీడీ ఇలాగే స్పందిస్తుందా?
– తిరుమల కొండపై నిఘా నిద్ర పోతోందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

Tirumala-Murderతిరుమల కొండపై నిద్రిస్తున్న ఒక వ్యక్తిని బండారాయితో కొట్టి చంపారు. హతుడు, హంతకుడు ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారే. వారిద్దరూ తిరుమలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడే అనధికారికంగా జీవిస్తున్నారు. 2019, 2020లో వీరిద్దరినీ తిరుపతికి తరలించారు. అయినా మళ్లీ తిరుమల కొండపైనే ఉంటున్నారు. అర్ధరాత్రి నిద్రపోతున్న శరవణన్‌ను భాస్కర్ అనే వ్యక్తి రాయితో కొట్టి చంపాడు.
– ఇదీ కుప్లంగా వార్త సారాంశం.

ఇది మున్నెన్నడూ వినిపించని వార్త. కోట్లాది వెంకన్న భక్తులను కలవరపరిచే వార్త. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే తిరుమలలో హత్య జరిగింది. నిద్రిస్తున్న ఓ భక్తుడిని దారుణంగా హతమార్చిన వైనం భక్తలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో భద్రత ఉండే తిరుమల కొండపై, ఈవిధంగా హత్య జరగడం అక్కడి భద్రతావ్యవస్థను వెక్కిరించింది. ఇప్పటివరకూ ఈవిధంగా తిరుమల కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి. భక్తులను కాపాడే వెంకన్న ఆలయంలోనే హత్య జరిగిందంటే…. హత్యల సంస్కృతి తిరుమల వరకూ పాకిందన్న వార్తనే భక్తలోకానికి నిద్రకు దూరం చేస్తోంది.

మృతిచెందింది ఒక సాధారణ కార్మికుడే కావచ్చు. ప్రభుత్వం-మీడియా దృష్టిలో వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవచ్చు. వారికోసం ఎవరూ ఆందోళన చేయకపోవచ్చు. అందుకు తగినట్లే.. ఏ రాజకీయ పార్టీ గానీ, ఏ న్యూస్‌చానెల్ గానీ ఈ హత్యపై చర్చించలేదు. మృతుడు పక్క రాష్ట్రానికి చెందిన సామాన్య కూలీ కాబట్టి, హత్య తీవ్రతను గుర్తించకపోవచ్చు. చంద్రబాబు హయాంలో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ల సమయంలో రెచ్చిపోయిన ఇదే మీడియా, ఇప్పుడు నవరంధ్రాలూ మూసుకుని మౌనవ్రతం పాటించవచ్చు. దానికీ, దీనికీ పెద్ద తేడా లేదు. అప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు చంపితే, ఇప్పుడు ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపాడు. నేపథ్యమంతా తిరుమల, దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతమే.

అదే మృతుడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడో.. ఏ వ్యాపారస్తుడో, సెలబ్రిటీనో, ఫలానా కులనాయకుడో అయి ఉంటే, ఈపాటికి మీడియా హత్యవార్తలోనే మునిగి, దానితో చలికాచుకునేది. టీఆర్పీ రేటింగుల కోసం డిబేట్ల పేరంటం పెట్టేది. తిరుమల క్యూ లైన్లలో హత్యకు గురైంది సామాన్యుడు కాబట్టే, ఈ మౌనం. కదా?

అయినప్పటికీ, సంఘటనా స్థలం మాత్రం పవిత్ర పుణ్యక్షేత్రం పరిథిలోనే అన్న విషయాన్ని విస్మరించకూడదు. అంటే నిస్సందేహంగా ఈ ఘటన టీటీడీ పాలకవర్గం వైఫల్యమే. అసలు హతుడు, హంతకుడు అంత కాలం నుంచి తిరుమలలో అనధికారంగా నివసిస్తున్నారంటున్న పోలీసులు, వారిని అంతకాలం అక్కడ ఎలా ఉండనిచ్చారన్నది భక్తుల ప్రశ్న.

తాజాగా జరిగిన హత్యను విశ్లేషిస్తే.. భవిష్యత్తులో కూడా అక్కడ భక్తులకు ఎలాంటి భద్రత లేదన్నది తేలిపోయింది. భక్తుల ప్రాణాలు గాలిలోదీపమేనని స్పష్టమయింది. గతంలో తిరుమల కొండపైకి మద్యం, మాంసం తీసుకువెళ్లారన్న ఆరోపణలు మాత్రమే ఉండేవి. క్యూలైన్లలో కుప్పకూలిపోవడమో, గుండెపోటు రావడమో జరిగేది. లేదా మార్గమధ్యంలో వాహన ప్రమాదాలు జరిగేవి. కానీ ఇప్పుడు హత్యల స్థాయికి విస్తరిస్తే, ఇక సామాన్య భక్తుల భద్రతకు దిక్కేది?

తిరుపతి విజిలెన్స్ చాలా పవర్‌ఫుల్ పోస్టింగు. అక్కడ పోస్టింగు కోసం భారీ స్థాయిలో పైరవీలు జరుగుతుంటాయన్నది బహిరంగ రహస్యం. అలాగే కట్టుదిట్టమైన భద్రతకు టీటీడీ విజిలెన్స్ మారుపేరు. కొండపైన, కింద అత్యాధునిక తనిఖీ పరికరాలు ఉంటాయి కాబట్టి, ఏ వస్తువూ ఆ యంత్రాల నుంచి తప్పించుకోలేవు. అంతకుమించి అడుగడుగునా సిసి టీవీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఇక సౌకర్యాల కల్పనలో టీటీడీ తర్వాతనే ఏ సంస్థయినా. కానీ గత వేసవిలో భక్తులు అల్లాడిపోయి, బారకేడ్లను తోసుకువెళ్లిన ఘటనలో డజన్ల మంది గాయపడ్డారు. వారికి మంచినీళ్చిచ్చిన దిక్కులేదు.

మళ్లీ ఇప్పుడు సాక్షాత్తూ వెంకన్న సన్నిథిలోనే హత్య. ఇది చాలదా? వెంకన్న ప్రతిష్ఠను అంతా కలసి దెబ్బతీస్తున్నారని చెప్పడానికి? పైగా జరిగిన దారుణం క్యూలైన్ల వద్ద. హత్య ఘటన జరిగి ఇన్ని రోజులయినా, ఇప్పటిదాకా వైఫల్యానికి కారణమయిన విజిలెన్స్ అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే భక్తుల ప్రాణాల పట్ల టీటీడీ పాలకవర్గానికి ఎంత శ్రద్ధ ఉందో అర్ధం కావడం లేదూ?!

భద్రత ఇలాగేనా?

కాగా తాజా హత్య ఘటనపై భక్తజనం నుంచి ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల కొండ నుంచి కిందకు వెళ్లేవరకూ ప్రాణాలకు గ్యారంటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకన్న దర్శనానికి ఎవరూ రాకుండా ఉండేందుకు, ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ హత్య జరిగినట్లు కనిపిస్తోందని ఏపీ బ్రాహ్మణ చైతన్యవేదిక కన్వీనర్, బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ డైరక్టర్ సిరిపురపు శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

‘ఇది తిరుమల చరిత్రలో చీకటిరోజు. దుర్దినం. ఎప్పుడూ ఇలా కొండపైన హత్యలు జరగలేదు. జరిగినదానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి సిగ్గుతో తలదించుకుని రాజీనామా చేయాలి. ప్రత్యేక సేవల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న శ్రద్ధలో, భక్తుల భద్రతకు ఇవ్వడంలేదు. అసలు ఆ డబ్బంతా ఎటు వె ళుతోంది? ఇప్పటివరకూ టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? నిరంతరం పహారా కాయాల్సిన పోలీసులు ఎందుకు నిద్రపోతున్నారు? ఆలయంలో పనిచేసే అన్యమతస్థులను ఇంతవరకూ గుర్తించలేదు. స్వయంగా క్యూలైన్ల వద్దనే హత్య జరిగితే, రేపు క్యూలైన్లలో నిలబడేందుకు ఏ భక్తుడయినా ఆసక్తి చూపిస్తారా? పైగా సీనియర్ సిటిజన్లు భయపడరా’ అని శ్రీధర్‌శర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన వీడియో ఇప్పుడు హిందూ సమాజంలో చర్చనీయాంశమయింది.

బీజేపీ నోరు మెదపదేం?

హిందువులు, దేవుళ్లపై పేటెంట్ హక్కులున్నట్లు మాట్లాడే బీజేపీ.. దాని అనుబంధ సంస్థలు ఈ ఘటనపై నోరుమెదపకపోవడం హిందూ సమాజాన్ని విస్మయపరుస్తోంది. టీటీడీలో ఏం జరిగినా భారీ బిల్డప్పులిచ్చే లోకల్ బీజేపీ లీడర్లు ఇప్పటివరకూ ఈ ఘటనపై స్పందించింది లేదు. భద్రతా వైఫల్యానికి కారణమయిన విజిలెన్స్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన బీజేపీ ప్రముఖులకు, ఎప్పుడంటే అప్పుడు, ప్రజల్లో తప్ప మీడియాలో మాత్రమే బాగా కనిపించే ఓ స్థానిక బీజేపీ నేత దర్శనం చేయించిన వైనం చూస్తే, బీజేపీ మొహమాటానికి కారణమేమిటో అర్ధమవుతుంది.

LEAVE A RESPONSE