Suryaa.co.in

Editorial

ఎవడ్రా..జగనన్నకు కుల-మత పిచ్చి ఉందని వాగింది?

– ఆ పాటి పదవులిస్తే తప్పేంటీ?
– సొంత వారికి ‘రెడ్డి’ కార్పెట్ వేయకూడదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగనన్నకు రెడ్డి కుల-క్రిస్టియన్ మత పిచ్చి ఉందని పేలుతుంది ఎవడ్రా?
అన్ని పదవులూ రెడ్లకే ఇస్తున్నారని వసపిట్టలా వాగుతోంది ఎవడ్రా?
జగన్ వచ్చిన తర్వాత క్రైస్తవం విస్తరించిందని పేలుతుంది ఎవడ్రా?
సర్కారు సొమ్ముతో చర్చిలు కడుతున్నారని వాగుతోంది ఎవడ్రా?
జగనన్నకు కుల పిచ్చి లేదు. మత పిచ్చిలేదు. ఆయనకు అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే. కులం చూడం.. మతం చూడం అని ప్రచారంలో చెప్పలే? మర్చిపోయినారా ఏమీ?.. ఆ యప్ప చెప్పిండంటే చేస్తాడు. ములాదే లేదు! జగనన్న కుటుంబం దశాబ్దాల నుంచి బైబిల్ చదువుతూ,క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తున్నప్పటికీ.. పుష్కరస్నానం చేసి హిందూమతం ఆచరించిన పునీతుడు. కావాలంటే విశాఖ స్వామి వారిని అడగండి! ఆయన పక్కా హిందువు. నమ్మకం లేకపోతే నందమూరి లక్ష్మీపార్వతమ్మను అడగండి. దానికి ఆమెనే సాక్షి! జగనన్నకు హిందూమతంపై ఎంత నమ్మకం లేకపోతే.. టీటీడీకి 80 మంది మెంబర్లను వేస్తారు? వెంకన్నపై ఎంత నమ్మకం లేకపోతే.. దర్శనం టికెట్టును 300 రూపాయలకు పెంచుతారు? హిందూ ఆలయాలపై ఎంత నమ్మకం లేకపోతే.. ఆలయాల భూములు వేలం వేయిస్తారు? బ్రాహ్మణులపై ఎంత అభిమానం లేకపోతే.. ఆ కులం కార్పొరేషన్‌ను బీసీ శాఖలో విలీనం చేస్తారు? ఇవన్నీ ఆయనకు హిందూమతంపై ఉన్న అవ్యాజానురాగ.. అంతులేని భక్తిప్రపత్తులు, అత్యంత విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం కాదా? మరి జగనన్న క్రైస్తవుడని మత పిచ్చి ముద్ర వేస్తారేంటీ? నాన్సెన్స్ కాకపోతే?!.. ఇదీ జగన్ వైసీపీ భక్తజనసేవామండలి, సినిమాసెల్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కవి హృదయం.
తప్పు లేదు. పోసాని భావావేశాన్ని తప్పుపట్టనవసరం లేదు. తాను పులివెందులకు వెళ్లినప్పుడు జగనన్న కుటుంబం భక్తితో బైబిల్ చదవడాన్ని చూశానని, వాళ్ల పేర్లు కూడా జార్జిరెడ్డి వంటి క్రిస్టియన్ల పేర్లే ఉంటాయని చెప్పిన పోసాని, సునిశిత దృష్టిని మెచ్చుకోవలసిందే. మీడియాలో కూడా ఆయన ఎక్కడా దాచకుండా అదే మాట చెప్పారు. ఏదైనా ఆయన ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొడతారంతే! అందుకే ఆయన అభిమానులు ‘ఐలవ్‌యు రాజా’ అంటుంటారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం, ఆంధ్రాలో సినిమా ఫాన్స్ గొడవ విపరీతంగా ఉండేది. ఎన్టీఆర్-కృష్ణ, కృష్ణ-శోభన్‌బాబు, కృష్ణ-చిరంజీవి అభిమాన సంఘాల మధ్య కరపత్రాల యుద్ధం జరిగేది. బూతు సాహిత్యం కూడా దొర్లేది. ఒక్కోసారి అది గోలీ సోడాలతో కొట్లాటల వరకూ వెళ్లేవి. ఆ తర్వాత రాను రాను వారి పిచ్చి హీరోలను దాటి, కులాల కొట్లాటగా మారింది. పోసాని ప్రెస్‌మీట్ చూసిన తర్వాత ఎందుకో ఆ రోజులు గుర్తుకొచ్చాయి. అలాగని పోసాని రెడ్డి కాదండోయ్.. పదహారణాల కమ్మ! మరి కమ్మయి ఉండీ ఈ పిచ్చిగోలేంటనుకుంటున్నారా? దాని సంగతి తర్వాత చూద్దాం.
సరే.. కౌంటర్‌కు ఎక్కడయినా ఎన్‌కౌంటర్ ఉంటుంది. కట్టలు తెగిన పోసాని ‘జగనన్న భక్తిపారవస్యం’ చూసిన, యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎక్కడో కాలినట్టుంది. మరి ఆయన కూడా ఊరుకోరుగా? అందులోనూ రోజూ రచ్చబండలో చాకిరేవు పెడుతున్నారాయె! జగనన్నకు కుల-మత పిచ్చి లేదన్న పోసాని ప్రేలాపనకు.. రాజు గారు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి, చాంతాడంత ‘రెడ్ల జాబితా’ను రిలీజు చేసి.. మరి ఈ కులపిచ్చి సంగతేమిటి రాజా? అని ప్రశ్నించే సరికి కృష్ణమురళీకి నిజంగానే మెంటలెక్కి ఉండాలి. రాజు గారు కూడా సెటైర్ల మాస్టరే కాబట్టి, మెంటల్‌కృష్ణకు సరైనోడు దొరికాడన్నది టీవీ చానెళ్లు చూసే వారి కామెంట్.
అయితే.. న్యాయం అనేది ముందు తన ఇంటి నుంచే మొదలుపెట్టాలని పెదరాయుడులో మోహన్‌బాబు చెప్పినట్లు.. తన కులం వారికి, తన మతం వారికి మేళ్లు చేయనివారు మిగిలినవారికేం న్యాయం చేస్తారని జనం అనుకోరూ? అందుకే ‘రెడ్డివారే బహు దొడ్డవార’ని అప్పుడెప్పుడో ‘పచ్చపార్టీ’లో ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం చెప్పినట్లు… జగనన్న రెడ్డిగార్లకు పెద్దపీట వేస్తే తప్పేంటీ? కేవలం 900 పదవులకే ఇంత గాయగత్తర చేస్తే ఎలా? జగనన్న మంచోడు కాబట్టి మిగిలినవి వదిలేశాడు. అంతవరకూ సంతోషించండి. ఆ మాటకొస్తే పచ్చ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మవారికి విస్తరి వేయలేదా? అన్నది పోసాని కవి హృదయం.
ఆ కమలం కమలం ‘పువ్వు పార్టీ’ కూడా ఈమధ్య ఓవరాక్షన్ చేస్తోంది. సర్కారు సొమ్ముతో చర్చిలు కడుతున్నారని, ‘యమగోల’ చేస్తు చిరాకుపెడుతోంది. అక్కడికీ పాపం పువ్వు పార్టీ సదర్ సోము వీర్రాజన్న సర్కారుపై చూసీ చూడనట్లు పోతున్నా, మిగిలిన నాయకులు ఓవరాక్షన్ చేయడం ఏమిటి? ఏం.. ఆ మాత్రం సర్కారు డబ్బుతో నాలుగైదు చర్చిలు కట్టిస్తే పువ్వు పార్టీ ముల్లేంపోతుంది? వారికే పుణ్యం కదా? కమలం పార్టీని కరుణామయుడు కరుణిస్తాడు కదా? ఏదో నాలుగయిదు చర్చిలకు సర్కారు డబ్బులిచ్చినంత మాత్రాన, జగనన్న క్రిస్టియన్లకు మేలు చేసినట్టేనా ఏంటీ? హిందువులకంటే దేవదాయ శాఖ ఉంది కాబట్టి గుళ్లు కడుతున్నారు. మరి క్రైస్తవులకు ‘చర్చాదాయశాఖ’ లేదు కాబట్టి, సర్కారు సొమ్ముతో చర్చిలు కట్టిస్తే తప్పేంటీ అంట? అసలు ఈ సెక్యులర్.. డెమోక్రసీ.. కానిస్టిట్యూషన్.. జ్యుడిషియరీ.. ఇల్లీగల్.. రూల్స్ వంటి పదాలంటనే మా జగనన్నకు చెడ్డ చిరాకాయె! అదుగో అవన్నీ.. వివరంగా చెబుతామని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు వస్తేనే, పవనన్నయ్య ఫ్యాన్సు పోసానిని తన్ని తరిమేశారు. లేకపోతే కృష్ణమురళీ అన్నయ్య ఇవన్నీ చెప్పేసేవారే. అన్యాయం కదూ!?

LEAVE A RESPONSE