– సమృద్ధిగా లభ్యం
– వైసీపీవి అసత్య ప్రచారాలు
– వానపల్లి సొసైటీకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట: రాష్ట్రంలో, జిల్లాల్లో, కొత్తపేట నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం వానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. సొసైటీలో యూరియా నిల్వలు గురించి ఆరా తీశారు. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో 4,500 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
మొత్తం నియోజకవర్గంలో 180 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే ఆలమూరు మండలంలో వరి పంటకు ఎరువుల వినియోగం పూర్తయిందని తెలిపారు. వైసీపీ నాయకులు ఏమి చేయాలో తెలియక అసత్య ప్రచారాలతో యూరియా అంశాన్ని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న గత సంవత్సరం ఈ సమయానికి ఎన్ని బస్తాల యూరియా రైతులకు అందిందో అంతకుమించి ఈ సంవత్సరం సరఫరా జరిగిందని అయినా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి నిజా నిజాలను ప్రజలకు తెలియజేయాలని వానపల్లి సొసైటీని సందర్శించినట్టు తెలిపారు. రూ.265 కు యూరియా బస్తా రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఇబ్బందులను తొలగిస్తుందని తెలిపారు. గతంలో మామిడి రైతులకు ఇబ్బంది వచ్చిన సందర్భంలోనూ, పొగాకు రైతులకు ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలోనూ, ఉల్లి రైతులకు ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలోనూ తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించిందని ఎమ్మెల్యే బండారు తెలిపారు.
వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా యూరియా అంశంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫ్రెష్ లలో ఉల్లిపాయలు అమ్ముతున్నారని ఆయన మాట్లాడడం ఇందుకు నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో పల్లి భీమరావు, గనిశెట్టి వీరేష్, పోలాబత్తుల సుబ్రహ్మణ్యం, మాకే నాగభూషణం, దునబోయిన ఏడుకొండలు, అప్పారి శ్రీను, మెడిది వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు