Suryaa.co.in

Editorial

ఎవరు సిగ్గుపడాలి నాయకా?

* పోటాపోటీ ధర్నాల వల్ల ఏమిటీ ఫాయిదా?
* ఒకే సమస్యపై టీఆర్‌ఎస్-బీజేపీ పంచాయితీ
* పరిష్కరించాల్సిన వారే పోరాడుతున్న వైచిత్రి
* మరి ధాన్యం కొనేదెవరు?
* నడుమ నలుగుతున్న రైతన్న
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మేం ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే, దానికి పోటీగా బీజేపీ హైదరాబాద్‌లో పోటీ ధర్నా చేయడానికి సిగ్గుండాలి’
– ఢిల్లీలో దీక్ష చేసిన సీఎం కేసీఆర్ కన్నెర్ర
‘‘ఐదారువేల కోట్లతో రైతుపంటను కొనలేని అసమర్ధ సీఎం కేసీఆర్. ధాన్యం కొనకపోతే కేసీఆర్ గద్దె దిగాలి. పాలన వదిలేసి దద్దమ్మ మాదిరిగా ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలి. రైతు పంటలు కొననందుకు కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలి’’
– ఇందిరాపార్కు వద్ద ధర్నాలో బీజేపీ దళపతి బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్
ts-1
’’ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరిస్తాం. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే సంతకం చేసింది. ధాన్యం సేకరణ, సంచులపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రణాళిక అందలేదు. పంజాబ్ నుంచి కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదు’’
– కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వివరణ
‘‘తెలంగాణ ఇకపై బాయిల్డ్‌రైస్ ఇవ్వదరి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా లేదా? ఆమేరకు సంతకం చేసిందా లేదా? కేసీఆరే లేఖ ఇచ్చి ఆయనే ధర్నా చేస్తే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లా? ఒకడు ఢిల్లీలో, ఒకడు గల్లీలో నడుపుతున్న సిల్లీ డ్రామాలతో రైతు సమిథ అవుతున్నాడు’’
– టీఆర్‌ఎస్-బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్
‘‘అన్ని వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, కేంద్రం ఇచ్చిన డాక్యుమెంట్లను చదవకుండా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా సంతకం చేశాడు? సోయలేకుండా సంతకం చేస్తాడా? పోగాలం దాపురించిన సర్కారుకు రైతులు సమాధి కట్టాలి’’
– వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల

ఇదీ.. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ. ఈ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్రంలోకి టీఆర్‌ఎస్ సర్కారు-కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటల మంటలు మండిస్తున్నాయి. తామే రైతుబాంధవులమని ప్రకటించుకునేందుకు పరుగులు తీస్తున్నాయి. ఇద్దరూ ఒకే సమస్యపై సమరశంఖం పూరిస్తున్నారు. మరి పరిష్కరించేదెవరు? దిగాలుపడ్డ రైతన్నకు ధైర్యం
Former చెప్పేదెవరు? అసలు కేసీఆర్-బండి సంజయ్-రేవంత్‌రెడ్డి విసురుకుంటున్న ‘సిగ్గులేని’తనానికి బాధ్యులెవరు? ఇంతకూ ఎవరు సిగ్గుపడాలి? టీఆర్‌ఎస్సా? బీజేపీనా? ఎవరి వాదన ప్రకారం వారిదే రైటు. మరి తప్పెవరిది? రైతు పండించిన ధాన్యం కొనని పాలకులదా? పండించిన రైతులదా? అసలు ఆంధ్ర-మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఎందుకొచ్చింది? ఇదీ తెలంగాణలో పుట్టెడు విషాదంలో కూరుకున్న రైతన్న ఎదుట బాహుబలిలా నిలిచిన సమాధానం లేని ప్రశ్న.

రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఇచ్చిన లెక్కల ప్రకారమే కేంద్రప్రభుత్వం ధాన్యం సేకరిస్తుంది. తమకు ఎంత అవసరం ఉంటుందో కేంద్రం అంతమేరకే సేకరిస్తుంది. దానికి మించి ఒక గింజ కూడా సేకరించదు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా పాటించే విధానం. దానికి పార్టీలతో సంబంధం లేదు. ఇది జాతీయ విధానం! ఇప్పటివరకూ తెలంగాణ నుంచి గత ఐదేళ్లలో ఏడురెట్ల ధాన్యం కేంద్రం సేకరించింది. ఖరీఫ్‌లో 68.7 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరించింది. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) వద్ద ఇప్పటికే 88.37 ఎల్‌ఎంటీ పారా బాయిల్డ్ రైస్ అందుబాటులో ఉంది. ఇందులో తెలంగాణ వాటా 40కి పైనే. ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వ అధికారులు సంతకం చేసి మరీ స్పష్టం చేశారు. కానీ బీజేపీ నేతలు ధాన్యం కొంటామని ప్రకటలు చేశారు. టీఆర్‌ఎస్ సర్కారు ఒక దశలో వరి వేయవ ద్దని చెప్పింది. అంతకుముందు అదే ప్రభుత్వం వరి వేయమని చెప్పింది. అందరి మాటలు నమ్మి రైతు మళ్లీ వరి వేశాడు. ఇదీ అసలు నిజం.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పార్టీల మాటలు నమ్మి రైతు ధాన్యం పండించాడు. ఇప్పుడు అది కొనేవాడు లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారే కొనాలని రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ సర్కారు.. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కొనాలని ప్రతిపక్ష బీజేపీ.. ఇలా ఒకరిపై మరొకరు ఒత్తిడి రాజకీయం, డిమాండ్ల పర్వానికి తెరలేపారు. ధాన్యం మాత్రం కళ్లాలనే ఉంది. ఇప్పుడు దానిని ఎవరు కొంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అసలు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని టీఆర్‌ఎస్ సర్కారు సంతకం చేయకపోతే ఈ సమస్యే వచ్చేది కాదని బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు… రైతులను రెచ్చగొట్టి, వరి పండించేలా చేసినందుకు ఈ పాపం వారిద్దరిదేనని టీఆర్‌ఎస్ దాడి-ఎదురుదాడికి దిగుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి మురళీధరన్.. గత ఏడేళ్ల నుంచి తెలంగాణ రైతుల కోసం, కేంద్రం లక్షకోట్లు ఖర్చు పెట్టిందని ప్రకటించారు. మిల్లర్లతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం వల్లే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదన్నది టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణ. కానీ రైతుకు గుదిబండలా మారిన ఈ సమస్యకు మాత్రం ఎవరూ పరిష్కారం చూపించడం లేదు. ఇదే ఇప్పుడు అసలు సమస్య.

కేంద్రం-రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల సవాళ్లు-ప్రతి సవాళ్ల పర్వంలో రైతు నలిగిపోతున్నాడు. ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతే క్వింటాకు 1300 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న అనివార్య పరిస్థితి. దీనితో రైతు ఎకరాకు దాదాపు 12 వేల రూపాయలు నష్టపోతున్న దుస్థితి. కొనుగోళ్లపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గత్యంతరం లేక రైతులు.. తక్కువ ధరకు మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న అనివార్యపరిస్థితి ఏర్పడింది.

సూటిగా చెప్పాలంటే మద్దతుధర కంటే సుమారు 600 రూపాయల తక్కువ ధ రకు దళారులకు అమ్ముకుంటున్న దయనీయం. దీనితో విసిగివే సారిన రైతులు ధాన్యాన్ని తగులపెడుతున్న హృదయవిదాకర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల సూర్యాపేటలో ఇదే జరిగింది. వరికి కనీస మద్దతుధర 1960 రూపాయలుంటే, మిల్లర్లు 1300 రూపాయలకు మాత్రమే కొంటున్న దారుణం. కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో రైతుల పరిస్థితి మరింత విషాదంగా మారింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా రైస్‌మిల్లరు 3 లక్షల టన్నుల ధాన్యం కొన్నారట. అంటే దీన్నిబట్టి తెగని కేంద్రప్రభుత్వ పంచాయతీ వల్ల.. తెలంగాణ రైతు ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నాడో, తలచుకుంటే గుండె బరువెక్కకమానదు. బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణమాఫీ చేస్తే పాలకులు, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మాత్రం కొనలేకపోతున్నారు. ఇంతకూ ఈ పాపం ఎవరిది?

LEAVE A RESPONSE