ఈరోజు ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా రాగానే, కాశ్మీరీ పండిట్ల కోసం కన్నీళ్ళు కారుస్తూ, జబ్బలు చరుచుకుంటూ బట్టలు చించుకుంటున్న భాజపాలు కాశ్మీరులో హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు ఏం చేసారన్నది (లేదా ఏం చేయలేదన్నది) చర్చించి తీరాల్సిన విషయం.
కాశ్మీరులో హిందువుల ఊచకోత 1947లో జరిగింది కాదు. 1989-90లలో జరిగింది. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. భాజపాలు ఎవరినైతే కుహానా లౌకికవాదులుగా గేలిచేస్తారో వాళ్ళ కొమ్ము కాస్తున్న రోజులు. జమ్ము-కాశ్మీరులో గవర్నరుగా ఉన్నది ఆరెస్సెస్ వ్యక్తి.
భాజపాలు ఆ కుహానా లౌకిక ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఉపసంహరించారు? కిడ్నాప్ అయిన కేంద్రమంత్రి కూతురి కోసం అయిదుగురు తీవ్రవాదులను వదిలిపెట్టినందుకు కాదు. వేలాది హిందువులను కాశ్మీరు తీవ్రవాదులు చంపినందుకు కాదు.2-3 లక్షల మంది హిందువులను కాశ్మీరు నుండి గెంటివేసినందుకు కాదు. మండల్ నివేదిక అమలు అస్సలు కారణం కానే కాదు. రామరథ యాత్రకు వీపీసింగ్ ససేమిరా కాదన్నాడని ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు.
బాబరీ మసీదు విధ్వంసానికి చూపించిన తాపత్రయంలో అర శాతం కూడా కాశ్మీరు పండితుల మీద చూపించలేదు. శ్రీరాముడి గుడి గురించి రాజకీయాలు చేసారే కానీ, కొన్ని తరాలుగా ఉన్న ఇళ్ళన్ని వదులుకొని పారిపోవాల్సిన దుర్గతి పట్టిన లక్షలాది కాశ్మీరు హిందువుల కోసం ఆలోచనే చేయలేదు
ప్రత్యక్ష చర్య (Direct Action) అంటూ హిందువులని చంపమని బహిరంగంగా ప్రకటన చేసిన జిన్నాని నెత్తిన పెట్టుకున్న జాతి భాజపాలు. వీరి దృష్టిలో కాశ్మీరు హిందువులు చివరికి గొడ్డుమాంసం విలువ కూడా చేయరన్నది సుస్పష్టం.
సరే ప్రభుత్వంలో లేరు కాబట్టి ఏమీ చేయలేకపోయారనుకోటానికీ వీలులేదు. 2003లో ప్రధానిగా ఉన్న వాజ్పేయి కాశ్మీరు హిందువులకు పునరావాసం కల్పించే విధానాలు రూపొందిస్తామని, ఆర్ధికసాయం చేస్తామని అన్నాడే కానీ, మీకు రక్షణగా మేమున్నాం, కాశ్మీరు వెళ్ళండి అని భరోసా ఇవ్వలేదు.
ఏదేమైనా, భాజపాల దృష్టిలో హిందువులు ఒక ఓటుబ్యాంకు మాత్రమే. హిందువులు భయపడితేనే భాజపాల మనుగడ సాధ్యం. కాబట్టి హిందువులకు సంబంధించిన ఏ సమస్యనైనా కోతిపుండు బ్రహ్మరాక్షసిగా చేస్తారే కానీ పరిష్కరించరు. భాజపాలతో విబేధించే ప్రతిఒక్కరినీ హిందువుల శత్రువులుగా చిత్రీకరిస్తారు.
మతాల మధ్య వైషమ్యాలు రగిలించారు. కులాల మధ్య చిచ్చు పెట్టారు. ప్రజల రంగుల మధ్య తారతమ్యాలు చూపించారు. ఈ దుర్మార్గుల మాయలో పడొద్దు. ఈ దగాకొరుల మాటలవలల్లో చిక్కుకోవద్దు. పీవీలాంటి దమ్మున్న ధీశాలీ ఎప్పటికైనా వస్తాడు కాశ్మీరు హిందువుల సమస్య పరిష్కరిస్తాడు. భాజపాలు మాత్రం ఆ పని చేయరు.
మరో ముఖ్య విషయం. ఈ సినిమాని ఒక సినిమాగానే చూడండి. ఒక నిజాన్ని చూపించిన సినిమాగానే చూడండి. ధన, మాన, ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఒక కన్నీటి చుక్క కార్చండి. వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే భాజపాల బానిసలుగా మాత్రం మారకండి.
( ఈ వ్యాసంలోని అంశాలు రచయిన వ్యక్తిగతమైనవి)
– రాజేంద్ర