Suryaa.co.in

Editorial

రోడ్డు లేక..పాపకు జన్మనిచ్చి.. ప్రాణం వదిలిన బాలింత

– చింతపల్లి ఏజెన్సీ రోడ్ల చింత తీర్చేదెవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయితీ మారుమూల గ్రామమయిన ఎదురుపల్లి గ్రామం. ఆ పల్లెకు ప్రభుత్వ పధకాలు, హామీలే కాదు. రోడ్డు కూడా దూరమే. బెజవాడలో పాలకులు ప్రతిరోజూ వినిపించే సంక్షేమ మంత్రాలేవీ అక్కడ వినిపించవు. సచివులు, అధికారులు జమిలిగా టీవీల ముందు వినిపించే.. అభివృద్ధి-సంక్షేమ లెక్కలేవీ అక్కడ భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. మేం ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకునే సర్కారు లెక్కల్లో, ఎదురుపల్లి గ్రామం దుర్భిణీ వేసి వెతికినా కనిపించదు. కారణం.. అక్కడ అసలు రోడ్లే లేవు కాబట్టి. ఉన్న మట్టిరోడ్లే వారికి స్వర్ణచతుర్భుజి. వర్షం వస్తే ఆ కాస్త మట్టిరోడ్డు కూడా నీళ్లపాలువుతుంటుంది. ఈ సమస్యలే ఆ గిరిజనులకు సహవాసం.
మరి రోగం, రొష్ఠు వస్తే వాళ్ల గతేం కాను? అన్న ఆలోచన బుద్ధిజీవులకు రావచ్చు. అవును. ఆ గిరిజనులకు రోగం వస్తే, ఆ రోగాన్ని పట్టుకునే కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి వెళ్లొస్తారు. మరి.. సర్కారు లక్షలు పోసి కొన్న అంబులెన్సులున్నాయి కదా? అవి పనిచేయవా ? అన్న డౌటనుమానం రావచ్చు. యస్. మండల కేంద్రంలో అంబులెన్సు ఉంది. కానీ అక్కడి నుంచి రోడ్డులేని ఎదురుపల్లికి అది వెళ్లడం మహా కష్టం. కాబట్టి ఫోన్ చేసినా అంబులెన్సుకు వినిపించదు.
ఇలాంటి కష్టాల కడలిలో ‘బతికుంటే అదే పదివేలన్నట్లు’.. చావలేక బతుకున్న ఎదురుపల్లి గ్రామంలో, తాజాగా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లే వెసులుబాటు లేదు. అంబులెన్సుకు ఫోను చేసినా రోడ్డు లేనందున మేం వచ్చేది లేదన్నారు. అటు చూస్తే చిన్నా చితనా ఆర్‌ఎంపీ డాక్టరూ ఆ ఊరిలో లేడు. ఆ పురిటినొప్పులతోనే మృత్యువుతో పొరాడిన గెమ్మిల బాబూరావు భార్య, 27 ఏళ్ల దివ్య ఓ పాపకు జన్మనిచ్చింది. అక్కడికి చేరిన మహిళలంతా హమ్మయ్య అని


దేవుడికి దండం పెట్టారు. ఆ గూడెం వారి ఆనందం అంతా ఇంతా కాదు. తమ మధ్యలోకి త్వరలో మరో అమ్మి రాబోతోందన్నది వారి సంబరం. కానీ.. పాపకు జన్మనిచ్చి, పేగుతెంచుకుని పుట్టిన తన బిడ్డను ముద్దుచేయకుండానే మృత్యువు ఒడిలోకి ఒరిగిపోయింది ఆ తల్లి. ఇలాంటి విషాదఘటనలు అప్పుడప్పుడు

వెలుగుచూసే ప్రపంచానికి మాత్రమే కొత్త. ఒక వింత! కానీ ఎదురుపల్లి వంటి వందల గ్రామాల ఆడబిడ్డలకు ఇది అలవాటయిన నిత్యనరక మృత్యుక్రీడ!! ఇంతకూ తప్పెవరిది? రోడ్లు వేయని రోడ్ల శాఖదా? రోడ్లు లేవన్న కారణంతో అంబులెన్సు పంపని వైద్యశాఖదా? అసలు ఇలాంటి రోడ్లు లేని వందల గ్రామాలపై దృష్టి సారించని పాలకులదా? ఎవరిది తప్పు?! తప్పెవరిదయినా చేయని తప్పున కు శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అమాయక గిరిజనులేన న్నది ‘మనం మనషులం’ అన్నంత నిజం.

LEAVE A RESPONSE