– అక్రమ రవాణా, శాంతిభద్రతలపై సమీక్ష
శ్రీసిటీ/చిత్తూరు:శ్రీసిటీ సమీపంలోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు జిల్లాల పోలీసుల సమావేశం మంగళవారం శ్రీసిటీలో జరిగింది. చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు (తమిళనాడు) జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులు ఇందులో పాల్గొనగా, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ సి.రమేష్ వారికి సాదర స్వాగతం పలికారు. చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పుత్తూరు డీఎస్పీ జస్వంత్, శ్రీసిటీ డీఎస్పీ జగదీశ్ నాయక్, గుమ్మిడిపూండి డీఎస్పీ రీతూ, ఊత్తుకోట డీఎస్పీ సారథి, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీసిటీ డీఎస్పీ జగదీశ్ నాయక్ మాట్లాడుతూ, చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీసిటీ పరిధిలోని సరిహద్దు జిల్లాల పోలీసు సిబ్బంది మధ్య సహకారం, సమన్వయం పెంపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల సమావేశానికి శ్రీసిటీ ఆతిధ్యం ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు చిత్తూరు ఎస్పీకి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సురక్షితమైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇతర దేశాల నుండి పెట్టుబడులు వచ్చే పారిశ్రామికవాడల్లో ఇది చాలా కీలకమన్నారు.
పోలీసుల సహకారం, సమన్వయంపై స్పందించిన ఆయన, అందరూ సమిష్టిగా శాంతి భద్రతల విషయంలో శ్రీసిటీని మోడల్ సిటీగా మార్చే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. శ్రీసిటీ పరిసరాల్లో అనుమతుల్లేని అపార్టుమెంట్ల నిర్మాణాలు, జాతీయ రహదారిపై పార్కింగ్ సమస్యలు, బైక్ యాక్సిడెంట్లు, అక్రమ రవాణాలతో పాటు ఇక్కడ మహిళా ఉద్యోగులు ఎక్కువుగా ఉన్నందున ఆకతాయిలు, రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కాగా, పారిశ్రామికవేత్తలు, కార్మికులకు భద్రత అంశాలపై అవగాహన పెంచడం, సరిహద్దు మరియు అంతర్-రాష్ట్ర నేరాలను నివారించడం, ఇసుక, కంకర, మట్టి, ఎర్రచందనం, మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించడం, రహదారి భద్రతపై చర్యలు పెంచడం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలను ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్ఈబీ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, అక్రమ రవాణా, నేరాల అదుపుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా సరిహద్దు జిల్లాల పోలీసుల మధ్య సహకారం, సమన్వయం చాలా అవసరమన్నారు. ఈ తరహా సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన శ్రీసిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
సత్యవేడు, పుత్తూరు, నగరి, సూళూరుపేట, ఆరంబాక్కం, గుమ్మిడిపూండి, ఊత్తుకోట, తిరుత్తణి, తిరువళ్లూరు తదితర పలు సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్సైలు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.