గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి?
ప్రదక్షిణ అని దేనిని అంటారు??
అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు.
ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణం వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది.
స్కాంద పురాణం ప్రదక్షిణంలో ప్రతీ అక్షరం గురించి చెబుతూ …
ప్ర – అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని,
ద – అంటే కోర్కెలను ఒసగేది అని,
క్షి – అంటే కర్మను క్షయం చేసేది అని,
ణ – అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది…
శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమి?
మొదటి అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని,
రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతుందని,
మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్ర వచనం.
గుడిలోనికి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు. పూర్వం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతడిని ఒక అరగంట ప్రశాంతంగా కూర్చోబెట్టిన తరువాతనే అతడికి బీపీ వంటి ఇతర వైద్యపరీక్షలు నిర్వహించేవారు.
అంటే ఒకరి భౌతిక పరిస్థితి సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాత కానీ అతడి స్థితిని పట్టుకోలేరు, బాగుచెయ్యలేరు అని నిరూపింపబడిన శాస్త్రం.
అలాగే గుడికి వచ్చిన వాడి మానసిక స్థితి సాధారణ స్థితికి రావాలంటే ఆ శక్తి వలయంలో ఒక మూడుసార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలి అని మన వాంగ్మయం చెబుతుంది.
ప్రదక్షిణ చేసేటప్పుడు కుడి నుంచి ఎడమవైపుగా నడుస్తాము, దేవాలయం చుట్టూ మొదట దక్షిణం వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. ఇలా నడవడం వలన ఎప్పుడూ మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది.
కుడి వైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది.
అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్ధిస్తూ ప్రదక్షిణ చేయాలి…
ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది, శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి…
ప్రదక్షిణలు ఎలా ఉండాలి?
ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకుని నడిచినట్టుగా నడవాలి అని శాస్త్రం చెబుతోంది.ఒక వలయం సెంటర్ నుండి సమాంతర దూరం గా ఉన్నట్టు లోనున్న భగవంతుని సెంటర్ గా చేసుకుని జీవుడు ప్రదక్షిణ చేసినట్టు అని అర్ధం.
ఆది శంకరాచార్యులు చెప్పినట్టు ‘1008 విశ్వాలు ఆ పరమాత్ముని చుట్టూ తిరిగినట్టు నువ్వు గుడిచుట్టూ తిరగాలి’ అని అంటారు.
21 ప్రదక్షిణలు చేసిన వారు సకల సంపదలు పొందగలరని స్వయంభూ ఆగమ శాస్త్రం చెబుతుంది.