– ఇండిగో ఆగిపోతే ఇండియా విమాన రంగం కుదేలు
– ఇది ప్రధాని- విమాన శాఖ మంత్రి వైఫల్యం కాదా?
(ఎస్. సూర్యనారాయణ మూర్తి)
సుమారు 2 సంవత్సరాలు ముందుగా ఆదేశాలు ఇస్తే, అది అడ్డగోలు ఆదేశా లిచ్చినట్లా? ఇండిగో అమలు చేయలేదు, దానికి కారణాలు వేరు.

రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా
రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా, సుమారు 20 యేళ్ళ క్రితం ప్రారంభించిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) ప్రారంభం లో మానేజ్మెంట్ విషయం లో భాగస్వాముల మధ్య స్పర్ధలతో కొంత ఇబ్బంది పడ్డారు. తరువాత రాకేష్ గంగ్వాల్, భారతీయ అమెరికన్ (అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఎగ్జిక్యూటివ్) నిష్క్రమించారు. గత 10 ఏళ్ళలో ఈ షేరు రూ.600 నుంచి రూ.6000 పైచిలుకుకు వెళ్ళింది.
తర్వాతి రోజులలో దేశీయ విమానయానంలో ఇండిగో బాగా నిలదొక్కు కుంది. మహానగరాలతో పాటు రెండో శ్రేణి నగరాలకు కూడా సర్వీసులు ప్రారంభించడం ఒక కారణం అయితే, తక్కువ ఖర్చులతో – జీతాలు వగైరా – ఎక్కువ పనిని రాబట్టుకోవడం వీరి విధానం. గ్రౌండ్ స్టాఫ్ కి తక్కువ వేతనం ఇస్తూ, వారినుంచి 3రెట్లు పనిని తీసుకుంటున్నారని ఒక కెప్టెన్ అన్నారు. ప్రయాణంలో ప్రయాణీకులకు ఏవిధ మైన రిఫ్రెష్ మెంట్స్ ఇవ్వకుండా, ధరలను తక్కువలో వుంచుతున్నారు.
దీనికితోడు ప్రభుత్వంవారు ఇండియన్ఎయిర్ లైన్స్ ని సరిగా నడపకపోవడం,( ఇప్పుడిది టాటా వారికి వెళ్ళిపోయింది), ఒక కారణం అయితే, మిగతా ఎయిర్ లైన్స్ ఒకటొకటిగా విఫలం కావడం మరొక కారణంగా చెప్పొచ్చు. కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్ వేస్, గో ఫస్ట్, స్పైస్ జెట్ వంటి ఎయిర్ లైన్స్ కొన్ని మూతపడ్డాయి, కొన్ని కుంటుతున్నాయి.
“India is not a land of failed airlines, but the system has engineered the airlines to fail” అని చదివాను. విమాన ఇంధనం పై అలవి కాని పన్నులు, విమానాశ్రయాల లోని సేవలకు అసంబద్ధమైన చార్జీలు, ధరలకు విపరీతంగా స్పందించే భారతీయ మార్కెట్లు, బొటాబొటీ ఆర్థిక సామర్థ్యం వల్ల మొదటి సంవత్సరం నుంచే నష్టాలు చూపే ఆస్తిఅప్పుల పట్టీలు, ప్రభుత్వ నియంత్రణ అధికారుల యొక్క ఎయిర్లైన్స్ కంపెనీల పీక నొక్కే పద్ధతులు….. చివరిగా చాలా ముఖ్యమైనది – ఖర్చులు డాలర్లలో, ఆదాయం రూపాయిల్లో.
ప్రభుత్వ మార్గ నిర్దేశకాలు ఏమిటి ?
FDTL – Flight Duty Time Limitations. ఇవి పైలెట్లు కి విశ్రాంతిని కలిగించ డానికి, తద్వారా ప్రమాదాలు జరగకుండా వుండ డానికి ఉద్దేశించినవి. దానివలన ప్రయాణీకులకు కూడా భద్రత చేకూరుతుంది కదా.
అందులో ముఖ్యమైనవి:
*పైలట్లు రోజుకి 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకి 125 గంటలు మాత్రమే పని చేయాలి.
*అలాగే రాత్రిపూట లాండింగ్స్ 2కి మాత్రమే పరిమితం చెయ్యాలి.
*ఒకరోజు పని గంటలకు తర్వాత రెండు రెట్ల విశ్రాంతి సమయాన్ని ఇవ్వాలి.
సమస్య పరిష్కారంకోసం చర్యలు చేపట్టలేదు ఎందుకు?
అజమాయిషి చేయడంలో ప్రభుత్వం వారు కొంచెం తడబడి నట్టుగానే కనిపిస్తోంది. కాని ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందుల కు గురికావడానికి దృష్టిలో పెట్టుకుని, విమానయానశాఖ వారు తాత్కాలికంగా ఈ నిబంధనల్ని ఉపసంహరించు కున్నారు. ఇంకా…. రిఫండ్, రీబుకింగ్, బ్యాగేజీ అప్పగింత, మిగతా ఎయిర్ లైన్స్ వారి ధరలపై పరిమితి విధింపు చేశారు. ఇప్పటివరకు రిఫండ్ 99%, బ్యాగేజీ అప్పగింత 90% పూర్తి అయింది.
ఇండిగో ఏకఛత్రాధిపత్యాన్ని అధిగమించ డానికి స్టార్ ఎయిర్, ఎయిర్ కేరళ, శంఖేర్ అనే 3 కొత్తసంస్థల కు అనుమతి ఇచ్చారు.
ఈరోజు 09/12/25 ఇండిగో సీఈఓ ‘పీటర్ ఎల్బర్స్’ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ని కలిసి మాట్లాడారు. వారికి ఇండిగో విమానాల ఫిబ్రవరి షెడ్యూళ్లలో 10% కోత విధించడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత చర్య లుంటాయన్నారు.
అధ్యక్షా..సంక్షోభానికి కారణం వారే అవుతారా లేదా ?
ముందు చెప్పినట్టుగా 2 సంవత్సరాల ముందే నిబంధనలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 1 న కేంద్ర మంత్రితో సమావేశం ఐనప్పుడు FDTL అమలు చేయడం లో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని (Compliance) కంపెనీవారు చెప్పారు! డిసెంబర్ 1 గడువు ముగిసిన తర్వాతనే, 3 నుంచి అసలు విషయం బయటపడింది. అప్పుడు సంక్షోభానికి కారణం వారెలా అవుతారు అధ్యక్షా?
My take on this:
దేశంలోని విమానయానం వ్యాపారంలో 63% ఇండిగో ది. 37% మాత్రం మిగతా కంపెనీలు నిర్వహిస్తున్నాయి. మిగతా వారందరూ సరిపడా స్టాప్ తో తక్కువ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి.
ఇండిగో ఖర్చులు నియంత్రణలో ఉంచుకునేందుకు మొదటి నుంచి కూడా తక్కువ సిబ్బందితో, ఒకేరోజులో ఒక విమానాన్ని సాధ్యమైనన్ని ఎక్కువ ట్రిప్పులకు పనిచేయిస్తు న్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు పైలెట్లు రోజుకి రాత్రి 2 కంటే ఎక్కువ ల్యాండింగ్స్ కూడా చేసేవారట.
ఈ విధివిధానాలు వచ్చి సుమారు 2 సంవత్సరాలు ఐంది. ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ దీనిపై కొత్తగా సిబ్బందిని నియమించు కోవాలనే సలహా ఇచ్చి ఉంటారనేది నా అభిప్రాయం. “అప్పుడు చూద్దాం” అనే ఒక నిర్లిప్త ధోరణిలో ఉంది మేనేజ్మెంట్. ఇప్పుడు పైలెట్ లందరూ కూడా విధి విధానాలను అనుసరించే పని చేస్తాం అనడం వలన ఈ సమస్య కేవలం ఇండిగో వరకే పరిమితమైంది. ఐతే దేశం లోని ఎక్కువ భాగం విమానయానం వీరి ఆధ్వర్యంలో ఉన్నందువల్ల ప్రయాణికులు చాలాతీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ఇండిగో ఇప్పుడు కొత్తగా 500 మంది కెప్టెన్లను నియమించు కోవాలిట. కొత్త విమాన కెప్టెన్ లు ఇలా చిటిక వేస్తే ఒక రోజులో రాలేరు. కనీసం సంవత్సరం పడుతుంది. అందువలన కొంతవరకు పరిస్థితి నెమ్మదించినప్పటికీ, ఈ సమస్య మరి కొంతకాలం పాటు ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
బయట మార్కెట్లో రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి.
*కంపెనీలో తమ వాటాలను యజమానులు ఏనాడో అమ్మేసుకున్నారని (గూగులమ్మ ఇది నిజమేనని చెప్పింది)…. అందువల్ల వ్యాపారం ఎలాగున్నా యజమానులు నష్టపోయేది లేదని!
*దీనిని ముందు నష్టాల కంపెనీ గా తయారుచేసి, తర్వాత ఆదాని గ్రూపువారు దీనిని కొనుగోలు చేస్తారని మరో వదంతి.
*దీనిలో భారత్ ఎదుగుదల ఇష్టంలేని ఐరోపా దేశాల కుట్ర ఉందని మరో వదంతి. కమిటీ నివేదిక రాకుండా మనం ఏమీ చెప్పలేం. కానీ దీనివలన ఇండిగో కే నష్టం. ముందుగా ఇండిగో కి దీటైన మరో కంపెనీ పోటీ తయారీపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో టాటా వారి ఇండియన్ ఎయిర్ లైన్స్ ను ప్రోత్సహిస్తే ఇండిగో మోనోపలీ తగ్గే అవకాశం ఉంటుంది.
దుబాయ్, ఖతార్, సింగపూర్ విమానాశ్రయాలు ఆదేశాల ఆర్థికాభివృద్ధికి ఇతోదికంగా దోహదం చేస్తున్నాయి. మన ప్రభుత్వ విధానాలు కూడా విమానసేవల కంపెనీల సమస్యల్ని పరిష్కరించే విధంగా నిర్ణయాలు ఉంటే ఉభయతారకంగా ఉండి, దేశానికి మేలు చేకూరుతుంది. ఈ వదంతులను మనం నమ్మాల్సిన పనిలేదు; కొట్టివేయనక్కర్లేదు కూడా. నా అభిప్రాయంలో ఇండిగో నెమ్మదిగా నిలదొక్కు కుంటుంది.