– మంత్రులు, ఎమ్మెల్యేలకు బదులు కార్యకర్తలతో ఇప్పించండి
– ఆ గౌరవం జెండాలు మోసే కార్యకర్తలకు ఇవ్వరా?
– కార్యకర్తలు గౌరవం ఆశించకూడదా?
ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన నెల నెలా 4,000 పెన్షన్ పథకాన్ని ప్రతి నెల డిస్ట్రిబ్యూషన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం.. వారే డిస్ట్రిబ్యూట్ చేయడం ఎబెట్టుగా, ఉందని ప్రజలు భావిస్తున్నారు.
సహజంగా ఏదైనా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం అమలు చేసేటప్పుడు, మొదలుపెట్టడం లో మంత్రులు,ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలి. కానీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వారి బిజీ షెడ్యూల్లో దీనికి సమయం కేటాయించడం, అధికార గణమంతా సామాన్య ప్రజల పనులు గాలికి వదిలేసి.. మొత్తం యంత్రాంగమంతా వారి చుట్టూనే తిరగడం చూసేవారికి బాగాలేదు. ఒక మంత్రి కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే.. వారి డీజిల్ ఖర్చులు, వారి అధికారగణం ఖర్చులు, టి ఏ లు, డి ఏ లు అన్నీ కలిసి ప్రభుత్వానికి ఆర్థిక భారం అయిపోతాయి. అవసరం కూడా లేదు.
దీనివల్ల మంత్రులు మిగతా చేయవలసిన పనులన్నీ కూడా ఆరోజు కుంటుపడతాయి. దీనివలన ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. పెన్షన్లు పంచుటకు దానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసి ఉన్నారు. మిగతా అధికారులు పెన్షన్ పంచుట పూర్తయినదా లేదా అని అజమాయిషి చేయుటకు, లోపాలు లేకుండా, అమలు చేయుటకు ప్రభుత్వ వ్యవస్థ ఎలాగూ ఉంది. ప్రజలలో చైతన్యం పెరిగి ఏ ఒక్కరికి పెన్షన్ రాకపోయినా, ఆందోళన చేసే అవకాశం ఉంది. ప్రజలు ఆ విధంగా తయారయ్యి ఉన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా ప్రజలకు అర్థమయ్యేట్టుగా, దానిని వివరించవలసిన బాధ్యత, ఖచ్చితంగా అధికార యంత్రాగానిది, పాలకులది. ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని చూచుకొనుటకు అధికార గణం ఉంది.
ఈ సంక్షేమ కార్యక్రమంలో మొదటి నెల, రెండో నెలైతే మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనడం హర్షించదగ్గ విషయమే. ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటారు. కానీ పెన్షన్ ఇచ్చినన్ని రోజులు, అమలయ్యే ప్రతి పథకానికి ఎమ్మెల్యేలు, మంత్రులే ఉంటే… పార్టీల కార్యకర్తలు, ప్రజలలో తిరిగి మిమ్మల్ని గెలిపించిన వారి పరిస్థితి ఏమిటి? ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజలకు కనపడేది, వినపడేది సామాన్య కార్యకర్తలే. వారికి కూడా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాము. మా ద్వారా కూడా సంక్షేమ పథకాలు అమలులో మేము కూడా, మా ద్వారా కూడా ఉంటే బాగుంటుంది అని ప్రతి పార్టీ ప్రతి కార్యకర్త భావించే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో పెన్షన్ల వితరణ కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, వారితో పాటుగా వాలంటీర్లు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెన్షన్ పంపిణీకే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, వారిని పార్టీ కార్యకర్తల్లాగా చేశారు. కానీ చివరికి ఏమైంది?
ప్రజలలో సంక్షేమ పథకాలను తమే చేసామని ఎక్కువగా ప్రచారం చేసుకుంటే వ్యతిరేక భావనతో, వికటించే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకం ఇస్తున్న ఏ పార్టీ కూడా, తమ సొంత డబ్బులు పెట్టి ఇవ్వడం లేదనేది జగమెరిగిన సత్యం ఇది వారికి కూడా తెలిసిందే. ప్రజలు కట్టే పన్నుల తో, లేదా రాష్ట్రం పేరుతో అప్పులు చేసి ఇస్తారు కాబట్టి.. అతిగా ప్రవర్తిస్తే ఈ రకమైన భావన వచ్చే అవకాశం ఉంది.
మరి అటువంటి పరిస్థితుల్లో.. ప్రతి నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిన అవసరం లేదనేది ప్రజల అభిప్రాయం ఇప్పటికైనా వారి సమయాన్ని వృధా చేసుకోకుండా.. మూడు పార్టీల కార్యకర్తలు ప్రతి వార్డులో, ప్రతి బూతులో లెక్కకు మించి ఉన్నారు. వారు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలకు నాయకత్వం వహించవలసిన వారే. వారికి కూడా మీరు ఏ విధమైన ప్రజలలో గౌరవ ఆశిస్తున్నారో.. వారు ఆశించడం కూడా అవసరమే.
– కరణం భాస్కర్
రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు
7386128877.