Suryaa.co.in

Political News

గడ్కరీ ఎందుకు లేడు ?

కారం లేని ఆవకాయ లాగా నాగ్ పూర్ లేని బీజేపీ పార్లమెంటరీ బోర్డు అనమాట. ముమ్మాటికీ ఇది నితిన్ గడ్కరీ స్వయంకృతం. చేజేతులా చేసుకున్నాడు. ఇపుడు ఉన్నత నిర్ణాయక మండలిలో చోటు పోగొట్టుకున్నాడు. ఎవ్వరైనా ఇంతే కదా మూల్యం చెల్లించక తప్పదు !
దేనికి మూల్యం ?
రాజకీయాల్లో విలువల్లేవు, అధికారం కోసం ఎంతకైనా తెగబడే పరిస్థితి విచారకరం అంటాడా ! అదీ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వాన్ని కూల్చిన నాల్రోజులకి ! విలువల గురించి మాట్లాడే హక్కు గడ్కరీకి ఎవరిచ్చారు ?
ప్రత్యర్థుల్ని సంహరించాలనుకోవడం క్రూర రాజకీయం. మనసుల గెలవాలనుకోవడం ఆధునికత అంటూ హద్దు మీరి మాట్లాడతాడా !
రోడ్డు రవాణా వల్ల ఎనర్జీ, ఖర్చు ఎక్కువ. అదే పోర్టులను ఆధునీకరిస్తే… భారీ డ్రెడ్జింగ్ కి అవకాశం ఉన్న పోర్టులను ప్రపంచస్థాయికి తీసుకెళితే ఆసియాలో సింగపూర్ ను ఢీ కొట్టి… మనమే సరుకు రవాణాకు కేంద్ర బిందువు అవ్వొచ్చు అంటూ భారీ ప్రణాళిక వేస్తాడా ! నాన్సెన్స్ !
స్వర్ణచతుర్భుజి ఐడియా ఉన్నదని ఓ 40 ఏళ్ల యువకుడు ముందుకొస్తే, ఉత్సాహపరిచి అమలు చేసిన వాజ్ పేయి అనుకున్నాడా ? కత్తెర పడతది కచ్చితంగా !
ఇథనాల్ వాడకం అంటాడు, ఇన్ ఫ్రాలో యూరోపియన్ ట్రెండును మించే మోడ్రనైజేషన్ గురించి చెబుతాడు. ఎందుకు ఇదంతా ?
దేశం ఎలాగూ ఇంకో పాతికేళ్ల పాటు అభివృద్ధి కాదు అని అధికారికంగా ప్రకటించాక గడ్కరీ ఎందుకు ? తెలివున్నోడు మన పరువు తీయడానికి కాకపోతే !
ప్రజాకర్షణ వ్యూహచతురత , అందరినీ కలుపుకొని పోయే స్టేచర్ , వాక్చాతుర్యంతో అమోఘమైన అద్భుతాలు చేసే శక్తి సామర్థ్యాలు , పరిపాలనను కొత్త పుంతలు తొక్కించే ప్రబుద్ధులతో పార్లమెంటరీ బోర్డు నిండిపోయింది.
ఇక గడ్కరీకి చోటెక్కడుంది ? ఇపుడు పార్లమెంటరీ బోర్డులో చోటు పోయింది. ఇక త్వరలో కేబినెట్ బెర్త్ కు కూడా ఎర్త్ పెట్టాల్సిందే ! నాగ్ పూర్ కి ఈ శాస్తి జరగాల్సిందే ! సమర్థతకు రివార్డు ఇచ్చి తీరాల్సిందే.

– రాజనీతి

LEAVE A RESPONSE