– చొరబాటుదారుల మీద మీకు ఇంత అనురాగం ఎందుకు?
– వాళ్ల ఓట్లు తీసేస్తే మీకు ఇబ్బంది ఏంటి..?
– రాజ్యాంగాన్ని కాలరాసిన వ్యక్తి ఇందిరా గాంధీ
– గతంలో బిజెపి కి 163 సీట్లు మాత్రమే వచ్చాయి
– ఈరోజు ఇప్పటికే 600కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిచింది
– మూడో విడత ఎన్నికల్లోనూ మరిన్ని స్థానాల్లో గెలుస్తాం
– ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్‌ను కూడా వాళ్లే నియమించుకున్నారు
– భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గౌతం రావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రారెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ , బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి & మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ , తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ….. సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాపు 560కి పైగా చిన్న చిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి, ఒక మహత్తరమైన భారతదేశాన్ని నిర్మించిన మహానుభావుడు. ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంతో పాటు కొన్ని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కలిసిన ప్రాంతం.
ఆ ప్రాంతమంతా భారతదేశంలో భాగమై, ఈ రోజు మనం గర్వంగా భారతీయులమని చెప్పుకుంటున్నామంటే… దానికి కారణం సర్దార్ వల్లభాయి పటేల్ గారే. ఆ సమయంలో నిజాం హైదరాబాద్ స్టేట్‌ను పాకిస్తాన్లో కలపాలని, లేదా ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని, ప్రయత్నాలు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ పోలో ద్వారా నిజాంను తలవంచేలా చేసి, హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ .
ఆ రోజుల్లో భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ని జవహర్లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారు. రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే “అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టొచ్చు అనే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత కాలంలో ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని ప్రకటించారు.
నెహ్రూ ని ఎదిరించి, రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢమైన వైఖరితో నిలబడిన నాయకుడు సర్దార్ వల్లభాయి పటేల్ . అయితే, అలాంటి మహానాయకుడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మర్చిపోయింది. ఎవరైతే రాజ్యాంగాన్ని అవహేళన చేశారో, ఎవరైతే రాజ్యాంగాన్ని కాలరాశారో, అలాంటి వారినే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని కాలరాసిన వ్యక్తి ఇందిరా గాంధీ . ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్‌ను కూడా వాళ్లే నియమించుకున్నారు.
ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ నియామకాలపై పార్లమెంట్లో ఎల్.కె. అద్వాణీ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాల్లో అపోజిషన్ పాత్ర ఉండాలా? లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు అవకాశం ఇవ్వాలా? అని అడిగితే, అవసరం లేదని కాంగ్రెస్ చెప్పింది. ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై మాట్లాడటం చాలా హాస్యాస్పదమైన విషయం.
నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ‘ఓట్ చోరీ’ అంటూ మాట్లాడారు. ప్రియాంకా గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బెదిరించే స్థాయికి వెళ్లారు. వాళ్ల పేర్లు తీసుకుని మరీ బెదిరించారు. గతంలో ప్రజలను కాల్చేస్తామని, కాల్చేయాలని కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇదేనా వారి రాజ్యాంగబద్ధమైన ఆలోచన?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ, మీ అధికారం పోతుంది, మీ ఓట్లు పోతాయి, ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుందంటూ బెదిరించారు. ఓట్లు పోయేది ఎవరివి? భారతీయులవి మాత్రం కాదు. అయితే పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద ఇంత ప్రేమ ఎందుకు? చొరబాటుదారుల మీద మీకు ఇంత అనురాగం ఎందుకు? వాళ్ల ఓట్లు తీసేస్తే మీకు ఇబ్బంది ఏంటి..?
రాజ్యాంగంలో ఎక్కడా భారతీయులు కాని వారికి ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండాలనే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ విషయానికి పూర్తిగా కట్టుబడి ఉంది. భారతదేశంలో ఉన్న నిజమైన భారతీయుల పేర్లే ఓటర్ లిస్ట్‌లో ఉండాలి. అర్హులైన వారి పేర్లు ఎప్పటికీ తొలగించబడవు. ఈ రోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, అదేవిధంగా మైనారిటీలు అందరూ కూడా మోదీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక, ఎన్నికల్లో ఓడిపోయి, ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద రాజకీయాలు చేస్తోంది. అందుకే ఇలాంటి రాజకీయాలు బంద్ చేయాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం.
రాజ్యాంగాన్ని గౌరవించి అమలు చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యాంగం సురక్షితంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే రాజ్యాంగాన్ని కాలరాశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీనే.
ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఎవరి బొంద పెట్టారో ఈ దేశం చూస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు రాష్ట్రాలే మిగిలాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ను బొందపెట్టే సమయం వచ్చింది. ఈ భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. మిగిలిన రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్ని గెలిచాం.. ఇన్ని గెలిచామని లెక్కలేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరింపులతో గెలిచి ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. గతంలో బిజెపి కి 163 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈరోజు ఇప్పటికే 600కి పైగా సర్పంచ్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇంకో దశ ఎన్నికలు ఉన్నాయి. దాదాపు 45 వేల మందికి పైగా వార్డ్ మెంబర్లు బిజెపి తరఫున గెలిచారు. రానున్న మూడో విడత ఎన్నికల్లోనూ మరిన్ని స్థానాల్లో గెలుస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 300కి పైగా సీట్లు పెరుగుతాయని విశ్వసిస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భారతీయ జనతా పార్టీపై నమ్మకం పెట్టి వార్డ్ మెంబర్లు, సర్పంచులుగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.