– పులివెందుల నియామకాల వైఫల్యం రిపోర్ట్‌లో కనిపించలేదా?!
– పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికపై సాక్షి ‘చదువు’ కష్టం- పార్ట్ 2
భాగం-1 (పివోట్):
వైద్య విద్యలో ‘ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించండి’ అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సును సాక్షి మీడియా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, ఇతర మీడియాపై నీతులు చెప్పిన సంగతి చూశాం. తమ పార్టీ రాజకీయాలకు అనుకూలంగా లేని వాస్తవాన్ని ప్రాతివత్య సాక్షి ఎలా పాతరేసిందో అర్థమైంది.
అయితే, నివేదికలోని మరో కీలకమైన, మరింత ప్రమాదకరమైన అంశాన్ని సాక్షి పూర్తిగా పట్టించుకోలేదు. అది… ‘అర్హత కలిగిన అధ్యాపకుల కొరత’ (Shortage of Qualified Faculty). ఈ అంశంపై సాక్షి మౌనం వహించడానికి, ఆ మీడియా అండగా ఉన్న ప్రభుత్వ వైఫల్యాలే కారణం కాబోలు!
నివేదిక చెప్పిన చేదు నిజం – ‘ఘోస్ట్ ఫ్యాకల్టీ’
వైద్య విద్య నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే అతిపెద్ద సమస్యగా కమిటీ ఫ్యాకల్టీ కొరతను గుర్తించింది.
“దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఖాళీలు ఉన్నాయని కమిటీ గమనించింది. అంతేకాకుండా, అధ్యాపకులు కనీస హాజరు నిబంధనలను కూడా పాటించడం లేదని గుర్తించింది. (భయంకరమైన) ‘ఘోస్ట్ ఫ్యాకల్టీ’ (కాగితాలపై మాత్రమే ఉన్న అధ్యాపకులు) వ్యవహారాలు కొనసాగుతున్నాయని నివేదిక తెలిపింది.”
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కమిటీ చేసిన సిఫార్సులు మరింత పదునుగా ఉన్నాయి. క్రమం తప్పకుండా తనిఖీలు, విద్యార్థులే ‘ఘోస్ట్ ఫ్యాకల్టీ’ గురించి ఫిర్యాదు చేసే వ్యవస్థ (Student Reporting System) వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. నాణ్యతను పెంచడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని NMC కి చెప్పింది.
‘గురువుల’ కొరతపై సాక్షి మౌనం వెనుక మర్మం
ప్రైవేట్ పెట్టుబడి గురించి మాట్లాడిన మీడియాను విమర్శించిన సాక్షి, మరి ఈ అత్యంత ముఖ్యమైన ఫ్యాకల్టీ కొరత గురించి ఎందుకు మాట్లాడలేదు? వైద్య విద్యలో నాణ్యత దిగజారిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు కదా! ఎందుకంటే, ఈ నివేదికలోని ఈ లోపాలు తమ పాలనలో ‘గురువుల కొరత’కు అద్దం పడతాయనే భయమేనా?
అరకొరగా నిర్మించిన పులివెందుల వైద్య కళాశాల పరిస్థితి ఏంటి? అక్కడ పోస్టులను భర్తీ చేస్తామని జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరికి ఎందుకు కొలిక్కి రాలేదు? రెగ్యులర్ నియామకాలు చేపట్టడంలో విఫలమై, కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ మార్గాలను అనుసరించినా, అవసరమైనంత మంది అర్హులైన అధ్యాపకులను నియమించలేకపోయామనే చేదు నిజం తమ పత్రికలో వస్తే ఎలా?
ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల లేమి కారణంగానే, కేంద్ర నియంత్రణ సంస్థ అయిన నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొరడా ఝుళిపించింది. అనేక ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని లేదా సీట్లను తగ్గిస్తామని నోటీసులు ఇవ్వడం, ఆఖరికి పులివెందుల కళాశాల విషయంలోనూ ఇదే భయం వెంటాడటం అందరికీ తెలిసిందే. అంటే, జగన్ ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్ఠాత్మక కళాశాలలోనే ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం చెంది, ఆగిపోవడం నిజం కాదా!
కుట్లేసినా.. గుండెపోటు అన్న లెక్కన ఈ సాక్షి కలం పోటు మారదా!
ఎడ్డెం అంటే తెడ్డెం అనే తమ తైతక్కల యజమాని పోకడలకు అనుకూలంగా లేని ‘ప్రైవేట్ పెట్టుబడి’ సిఫార్సును దాచిపెట్టిన సాక్షి… నాటి ప్రభుత్వ వైఫల్యాన్ని, పులివెందుల వంటి చోట్ల నియామకాల లోపాన్ని ఎత్తిచూపే ‘ఫ్యాకల్టీ కొరత’ అంశాన్నైతే అస్సలు పట్టించుకోనేలేదు. సిఫార్సులు చేసిన ఈ కమిటీలో తమ పార్టీ ఎంపీ సభ్యుడిగా ఉండగా ఈ వాస్తవాలను దాచిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఫ్యాకల్టీ కొరత, ఘోస్ట్ ఫ్యాకల్టీల సమస్యపై చర్చ జరగకుండా దాచిపెట్టడం అంటే, ప్రజల ఆరోగ్య భవిష్యత్తును పణంగా పెట్టడమే.
పులివెందులకు ఫ్యాకల్టీగా వెళితే.. గొడ్డలితో నరికేసినా కుట్లేసి గుండెపోటు నివేదక అడగడం, ఫోరెన్సిక్ సైన్స్ బదులు క్రిమినల్ సైన్స్ వాడి ప్రాథమిక సాక్ష్యం లేకుండా తుడిచేసే పనులు చెయ్యిస్తారానే భయం వెంటాడి ఎవరూ చేరడానికి ఆసక్తి చూపలేదన్నది చేదు నిజం. సాక్షి మీడియా… ఇలాంటి నిజాలను దాచినా దాగవు, పక్కనపెట్టి, నివేదికలోని ప్రతి అక్షరాన్ని ‘నిజాయితీ’గా చదవాలి. భారత వైద్య విద్యలో ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించాలన్న సిఫార్సు, మరియు ఫ్యాకల్టీ కొరతపై NMC కొరడా అనేది అక్షర సత్యం! తమ అధినేతకు, సలహాలు ఇచ్చి యావత్తు పార్టీని అభాసుపాలు చేసిన దానికి కవరింగులకు ప్రయత్నిస్తే, ఇలాగే పదేపదే వెంగళాయిలు అవుతారు.

– చాకిరేవు