– రజనీకాంత్‌ను ఒరేయ్ అని పిలిచే మోహన్‌బాబు ఎక్కడ
– రజనీకాంత్‌ను వైసీపీ తిట్టినా చలించని తెలుగు సినీపెద్దలు
– ఇప్పటిదాకా ఒక్కరూ ఖండించని దుస్థితి
– కలత చెందని కళామతల్లి బిడ్డలు
– కళామతల్లి బిడ్డలకు ఏమైంది?
– చివరకు మోహన్‌బాబు కూడా మౌనమేనా?
– మిత్రుడిని సొంత పార్టీ తిట్టినా స్పందించని వైనం
– వేదికలపై రజనీకాంత్‌ను తెగ పొగిడే మోహన్‌బాబు
– సొంత పార్టీ తన మిత్రుడిని తిట్టిపోస్తున్నా స్పందించని మోహన్‌బాబు
– హీరోలకు జగనంటే భయమా?
– విమర్శిస్తే సినిమా రేట్లకు కత్తెర వేస్తారన్న భయమే కారణమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తలైవా రజనీకాంత్‌పై వైసీపీ నేతలు- మంత్రులు- సోషల్‌మీడియా జమిలిగా విమర్శల వర్షం కురిపిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా, రజనీకాంత్ వ్యక్తిత్వ హననం విజయవతంంగా సాగుతోంది. జగనన్న అభిమానుల విమర్శలకు, తమిళనాట ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అక్కడి నుంచి తలైవా అభిమానుల ఎదురుదాడి మొదలయింది. అయినా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో… రజనీకి రక్షణగా గొడుగుపట్టే దిక్కులేకుండా పోవడం, సినిమా అభిమానులకు విస్మయం కలిగిస్తోంది.
దివంగత మహానేత ఎన్టీఆర్‌ను కీర్తించి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పొడిగిన పాపానికి.. సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్, వైసీపీ బృందం నుంచి విమర్శల జడివాన ఎదుర్కొంటున్నారు. అది బూతుల పర్వానికి, వ్యక్తిత్వ హననం దిశగా సాగుతోంది. ఈ పరిణామాలను వైసీపీ నాయకత్వం
ఆనందిస్తున్నట్లు, ఆ పార్టీ పెద్దల వైఖరి స్పష్టం చేస్తోంది. అధినేతకు ఏం చేస్తే ఇష్టమో, ఎలా తిడితే ఆనందపడతారో తెలుసుకున్న నేతలు.. దానిని తూ.చ. తప్పకుండా ఫాలో అవుతున్నట్నున్నారు.
సరే.. కొన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలకు కొందరిని విమర్శిస్తే ఇష్టం. హద్దుదాటి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంకా ఇష్టం. బూతులు మాట్లాడితే మహా ఇష్టం. కాబట్టి.. వాటిని వారి వారి ఇష్టాలకు వదిలేయవచ్చు. కానీ.. తామంతా కళామతల్లి ముద్దుబిడ్డలం. మాలో ఎవరికి కష్టం వచ్చినా కలసి వస్తాం. మాలో మేం లక్ష అనుకుంటాం. కానీ బయటనుంచి ఎవరైనా మమ్మల్ని అంటే సహించం. మాకు కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. అంతా కళామతల్లి బిడ్డలమే అని… వేదికలపై ‘ వాంతులు చేసుకునే’ తెలుగు సినిమా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు వాస్తవంలో అందుకు భిన్నంగా ఉండటం సినిమా అభిమానులను విస్మయపరుస్తోంది.
సాటి నటుడు, సినీరంగంలో లబ్ధప్రతిష్ఠుడైన రజనీకాంత్‌ను, వైసీపీ శ్రేణులు బూతులు తిడుతున్నా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులెవరూ కనీసం ఖండించకపోవడమే ఆశ్చర్యం. ఆలీ, పోసాని వంటి
నటులంటే.. వారికి వైసీపీ రాజ్యంలో ‘ఉపాథి హామీ పథకం ’ లభించినందున, మౌనంగా ఉన్నారంటే దానిని అర్ధం చేసుకోవచ్చు.సరే ఎలాగూ రాంగోపాల్‌వర్మ కూడా , ‘జగనంత కుటుంబంలో’ చేరారు కాబట్టి.. ఆయన నుంచి ఖండన ఆశించడం అత్యాశనే.
ఇక నటి రోజా మంత్రిగా ఉన్నందున, సీఎం జగన్ పట్ల ఆమె స్వామిభక్తి ప్రకటించుకోవడంలో ఆశ్చర్యం లేదు. తప్పు కూడా లేదు. గతంలో చంద్రబాబు నీడలో ఉన్నప్పుడు.. ‘నువ్వు మొగాడివైతే, మీసం ఉంటే’ అని.. వైఎస్‌ను తొడగొట్టిన వైనం ఎవరూ మర్చిపోరు.
అదే రోజా.. ఇప్పుడు అదే వైఎస్ తనయుడి నీడలో సేదదీరి, అదే చంద్రబాబుపై కత్తులు దూయడం పెద్ద విశేషం కాదు. అదే చంద్రబాబును పొగిడినందుకు, రజనీకాంత్‌ను ఆమె విమర్శించడ ంలో కించిత్తు
ఆశ్చర్యమూ లేదు. ఎందుకంటే కళాకారుల్లో కులాభిమానం వేరయా అన్నది సినీ-రాజకీయ పండితుల ఉవాచ.
కానీ.. వేదికలపైనే రజనీకాంత్‌నుద్దేశించి.. వాడు, వీడు, ఒరేయ్ అని సంబోధించే.. సీనియర్ నటుడు మోహన్‌బాబు నోటికి ప్లాస్టర్లు వేసుకోవడమే ఆశ్చర్యం. తాను-రజనీకాంత్ ఒకే తల్లి బిడ్డలం కాకపోయినా, అంతకంటే ఎక్కువేనని మోహన్‌బాబు చెబుతుంటారు. తమ ఇద్దరి మధ్య ఎంత సన్నిహిత
సంబంధాలున్నాయని చెప్పేందుకు,.. రజనీకాంత్‌ను ఉద్దేశించి వాడు, వీడు అని సంబోధిస్తుంటారు. అంటే మా ఇద్దరి మధ్య అంత ఘాటు ప్రేమ ఉందని చెప్పడం మంచు వారి కవి హృదయం.
అసలు నిజానికి మోహన్‌బాబే చొరవ చూపి.. రజనీకాంత్‌ను చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆ విషయాన్ని రజనీకాంత్ కూడా హుందా ఒప్పుకున్నారు. ఎన్టీఆర్‌ను గద్దెదింపే ఎపిసడ్లో..
హైదరాబాద్‌లోని బసంత్ థియేటర్లో నిర్వహించిన, టీడీపీ ఎమ్మెల్యేల సమావేశానికి రజనీకాంత్ హాజరయ్యారు. మోహన్‌బాబే ఆయనను ఆ ఎపిసోడ్లో ప్రవేశపెట్టారు. రజనీకాంత్‌కు ఎన్టీఆర్ అంటే వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటి కీ, మిత్రుడు మోహన్‌బాబు కోసం, చంద్రబాబుకు మద్దతునిచ్చిన వ్యక్తి రజనీకాంత్.
అలాంటి ఆప్తమిత్రుడైన రజనీకాంత్‌ను.. వైసీపీ నేతలు వ్యక్తిత్వహననానికి పాల్పడుతుంటే, మోహన్‌బాబు మౌనంగా ఉండటంపై సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ వివిధ అంశాలపై గళం విప్పే మోహన్‌బాబు.. తన మిత్రుడిని సొంత పార్టీ నేతలు ఇష్టారీతిన విమర్శిస్తున్నా, కనీసం వారించే ప్రయత్నం చేయకపోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీలో చేసిన మోహన్‌బాబు, సీఎం జగన్‌కు స్వయంగా సమీప బంధువు కూడా. ఇక తరచూ అనేక వివాదాస్పద అంశాలపై స్పందించే.. భరద్వాజ, నాగేంద్రబాబు కూడా, రజనీకాంత్‌పై జరుగుతున్న మాట దాడులను ఖండించకపోవడం మరో ఆశ్చర్యం.
ఇక సినీ హీరోలు కూడా రజనీకాంత్‌కు బాసటగా నిలవకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ జగన్‌ను గానీ, వైసీపీని గానీ విమర్శిస్తే… కొత్త సినిమాలకు రేట్లు- షోలు పెంచుకునే అవకాశం ఉండదన్న ముందుచూపే వారి భయానికి కారణమన్నది సినీజీవుల ఉవాచ. నిజం ‘జగన్నా’ధుడికెరుక!