ఒక్క విషయం నిజాయితీగా మాట్లాడుకొందాం …
అమరావతికి అతి దగ్గర వుండే ప్రాంతం ఏది ?
విజయవాడ! … కదా …!
మరక్కడ ఎందుకీ నిశబ్ధం? వింతైన నిశబ్ధం..!
“అమరావతి vs విశాఖ” అన్నట్లు ఫ్లేవర్ ఇస్తుంటే, విజయవాడ మాట్లాడదేమి?
సచివాలయం నుంచి బెంజ్ సర్కిల్ పది, పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ….అంటే, రాజధాని అమరావతి అని అన్నా, నిజానికి అమరావతి అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఈ పాటికి విజయవాడతో కలిసి పోయుండేది. ఒక అయిదేళ్ల క్రితం ‘తాడేపల్లి’ అంటే అది వారధి అవతల, గుంటూరు జిల్లా బాబూ, అని చెప్పేవారు. అమరావతి ఆపేసిన తర్వాత కూడా తాడేపల్లి విజయవాడలోఎప్పుడో కలిసిపోయింది. అడ్రస్‌లో గుంటూరు మాయం అయింది, తాడేపల్లి , విజయవాడ అయింది. మరి రాజధానికి దగ్గరగా వున్న విజయవాడలో అసలు చిన్న చప్పుడు ఉందా ?
అమరావతి గురించి, అప్పుడెప్పుడో రెండున్నర ఏళ్ల క్రితం పాపం ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక పదిహేను వేల మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు…ఇప్పుడు … అదేదో “అమరావతి vs విశాఖ” అన్నట్లుగా
అవతలి పక్షం వారు చేస్తుంటే, ఇక్కడ ఉలుకు పలుకు లేదేం? అతి నిశ్శబ్దంగా, మాకేమీ సంభంధం లేదు అన్నట్లుగా…. నిజాయితీగా ఒప్పుకోవాలంటే కొంత చిత్రంగానే వుంది. విజయవాడ ప్రవర్తన ఎలా వుంది అంటే, అదేదో ఆ 29 గ్రామాల సమస్య, భూములు వాళ్ళవి. వాళ్ళేదో పాపం కిందా మీదా పడుతున్నారు రాజధాని కోసం. రాజధాని అయితే మనకూ లాభమే …కాకపోతే కూడా మనకొచ్చిన నష్టమేమీ లేదు.
అటు వారధి, ఇటు దుర్గ గుడి మధ్యలో విజయవాడ, మన బెజవాడ మనకుంది … విజయవాడ వాళ్లకి ఇదంతా చదివితే చర్రున కోపం రావచ్చేమో కానీ, దూరంగా వుండి చూసే వాళ్లకు, అచ్చం ఇలాగే అనిపిస్తుంది.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో వుండే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ , ఇటు వైపు గోదావరి జిల్లాలు, ఆ వెనుక ఉత్తర ఆంధ్ర, పక్కనే వున్న గుంటూరు, వీళ్ళందరూ అమరావతికి సపోర్ట్ చెయ్యాలా….. మీరు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంటారా? ఇది ఈ రోజు కొత్తగా అనటం లేదు… అమరావతి సమస్య మొదలైన రోజు నుంచీ చాలా మంది భావన ఇదే. కోపమొచ్చినా, ఇదేంటి, ఇలా అంటున్నారు అని మనసులో తిట్టుకొన్నా కష్టపెట్టుకొన్నా,…నిజం , బయటకు ఇలాగే కనిపిస్తోంది.
అమరావతి ఉద్యమం లో మేము లేమా అనద్దు. ..వున్నారు. ఎంతమంది? ఒక్కసారి గుండె మీద చేయి వేసి అనుకోండి ! గుప్పెడు….అంతే….గుప్పేడే..
కొంత మంది ఉత్సాహవంతులు తుళ్ళూరు పోయి సంఘీభావం తెలుపడం, వీలైతే కొంత సహాయం చెయ్యడం. అంతే. విజయవాడ శక్తి, సామర్ధ్యం, జనం, చైతన్యం, ఉత్సాహం, ఉద్రేకం వుత్తేజాలతో పోలిస్తే, ఈ జరుగుతున్న అమరావతి ఉద్యమం చాలా చిన్నది…! ఇంతకంటే వేరే చెప్పక్కర్లేదు. నిజానికి అమరావతి వలన అతి ఎక్కువ లాభం పొందేది విజయవాడ వారే. రాజధాని మాకొద్దు, దాని వలన మాకేమీ లాభం లేదు లాంటి సన్నాయి నొక్కులు వద్దు. హైదరాబాదులో ‘గచ్చీ బౌలీ’ నుంచి ‘ఉప్పల్’ దాకా దూరం దాదాపు నలభై కిలోమీటర్లు, ఘటకేసర్ అయితే ఎనభై, చౌటుప్పల్ ఎనభై, …దీని మధ్యలో నాలుగైదు జిల్లాల కలుస్తాయ్. హైదరాబాదు గ్రోత్ వలన, బార్డర్ లో వుండే వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో వుండే వాళ్ళ దాకా అందరూ లాభపడ్డారు, ఇకపై లాభం పొందుతారు కూడా. కృష్ణా కరకట్ట నుంచి విజయవాడ దూరం , లేక గన్నవరం దూరం నేను చెప్పనక్కర లేదు…. ఎక్కడో దూరాన వుండే వాళ్ళు మనల్ని సపోర్ట్ చెయ్యాలి అంటే, ముందు మీరు సమస్యపై గళమెత్తాలి కదా… నిశబ్ధం అనేది నిజం.
