– జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పిచ్చి తుగ్లక్ విధానాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం మార్చలేదా? మార్చే ఉద్ధేశ్యం లేదా
ప్రభుత్వ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఒక్కసారే జరుగుతుంది. ఏదో సినిమాలో డైలాగ్ లాగా “మళ్ళీ మళ్ళీ పెళ్లి” అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఇలా పదోన్నతి పొందిన ప్రతి సందర్భంలో “సర్వీస్ రెగ్యులరైజేషన్”కు దరఖాస్తు చేసుకుని, క్రమబద్ధీకరణ చేయించుకోవాలన్న అసంబద్ధమైన, చట్టవ్యతిరేకమైన ఉత్తర్వులు జారీ చేసిందట!
ఆ జీవో ఎక్కడని అడిగితే అందుబాటులో లేదన్న సమాధానం. కారణమేంటంటే జీవోలను గత ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టలేదు. అంతా గోప్యమే. ట్యూటర్స్ గా ఉద్యోగంలో చేరిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందిన అధ్యాపకులు ఉద్యోగంలో చేరినప్పుడు, అటుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందిన ప్రతిసారీ దరఖాస్తు చేసుకుని వారి సర్వీసును క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సిందే, లేకపోతే రిటైర్మెంట్ సందర్భంలో సమస్యలను ఎదుర్కొంటారన్న భయాన్ని కల్పిస్తున్నారు.
దరఖాస్తుదారులు లంచం ముట్టజెప్పుకొంటేగానీ వారి క్రమబద్ధీకరణ ప్రక్రియను సంబంధిత ఉద్యోగులు/అధికారులు పూర్తి చేయడం లేదు. ఇదీ తంతు. ఇలాంటి వాటినే కదా! పిచ్చి తుగ్లక్ విధానాలంటారు! ఈ తరహా అసంబద్ధ జీవోలను రద్దు చేయడానికి నేటి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది!
ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు 2006 నుండి యూజీసీ వేతనాలను అమలుకితెస్తూ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 2010 సెప్టంబరు 4న జీవో ఎంఎస్ నెం.242 జారీ చేసింది. ఏడవ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా సవరించిన యూజీసీ స్కేల్స్ – 2016ను అమలు చేయడానికి 2014-19 మధ్య కాలంలో ఉన్న మీ ప్రభుత్వం మార్గదర్శకాలను సూచించమని 2019 ఫిబ్రవరి 25న జీవో ఎంఎస్ నెం.138 ద్వారా ఒక కమిటీని నియమించింది.
అటుపై అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా, “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రివైజ్డ్ పే స్కేల్స్ – 2020” అంటూ ఒక కొత్త వేతన విధానాన్ని అమల్లోకి తెస్తూ 2021 మార్చి 1న జీవో ఎంఎస్ నెం.22 జారీ చేసింది. తద్వారా సవరించిన యూజీసీ స్కేల్స్ – 2016ను అమలు చేస్తే 2016 జనవరి 1 నుండి 2021 ఫిబ్రవరి 28 వరకు అంటే ఐదు సంవత్సరాల రెండు నెలలకు సంబంధించిన వేతన బకాయిలు చెల్లించకుండా ఎగగొట్టింది.
దానిపై అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన ఈ దివాళాకోరు విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతనాల చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించడానికి నేటి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది! లేదా! ఈ ప్రభుత్వం ఆ పిచ్చి తుగ్లక్ నిర్ణయం బాగుందన్న ఆలోచనలో ఉందా! అన్న అనుమానం వస్తున్నది.
2014-19 మధ్య కాలంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కదా! రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు సవరించిన యూజీసీ స్కేల్స్ – 2016ను అమలుచేస్తూ 2019 ఫిబ్రవరి 13న ఉన్నత విద్యా శాఖ జీవో ఎంఎస్ నెం.14ను జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు కూడా సవరించిన యూజీసీ స్కేల్స్-2016ను అమలు చేసి, వేతన బకాయిలను కూడా చెల్లించింది కదా! మరి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పిచ్చి తుగ్లక్ విధానాన్ని ఎందుకు రద్దు చేసి, యూజీసీ వేతనాల చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించడం లేదో! ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించాలి.