Suryaa.co.in

Andhra Pradesh

నేపాల్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పవన్ ఇప్పుడు మాట్లాడరేం?

– అటవీశాఖ మంత్రిగా ఏం చర్యలు తీసుకున్నారు?
– అప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడెందుకు మౌనం?
– కర్నూలు జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత స్మగ్లర్‌
– ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాతగా ఎదిగాడు
– తాను పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ కూడా స్మగ్లర్‌
– ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆమె పట్టుబడింది
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లోనే పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దండుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదే.

నాడు చంద్రబాబు హయాంలో కొందరు టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లుగా మారి పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా చాగల్లు మండల పరిషత్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలీ, అప్పటి ప్రభుత్వంలోని పర్యాటక శాఖ మంత్రికి ముఖ్య అనుచరుడు. ఆయన పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ ఆర్జించిన సొమ్ముతో తరువాత సినిమా నిర్మాతగా మారాడు. తన సినిమాలో నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఆమె కూడా అదే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో భాగస్వామిగా మారి పట్టుబడింది. ఇదీ టీడీపీ నేతలకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఉన్న అనుబంధానికి ప్రత్యక్ష నిదర్శనం.

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని నేపాల్‌కు ఎర్రచందనం తరిలిపోయిందని ఆరోపించారు. మరి అటవీశాఖను కూడా నిర్వహిస్తున్న మంత్రిగా ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? నిజంగా నేపాల్‌కు తరలిపోతే ఎందుకు దానిపై కేసులు నమోదు చేయలేదు?. అందుకే, ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం ఇదంతా.. అని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు.

LEAVE A RESPONSE