ద లాస్ట్ యాక్షన్ హీరో అని హాలీవుడ్ లో ఓ సినిమా ఉంటుంది. ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హీరో. దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత కూడా యాక్షన్ సినిమాలు వచ్చాయ్ కానీ యాక్షన్ హీరోలు అయితే రాలేదు. ఆర్నాల్డే లాస్ట్. సిల్వెస్టర్ తో పోటీని పూర్తిగా గెలిచాను అనే కాన్ఫిడెన్స్ వచ్చాక పెట్టినట్టు ఉన్నారు ఆ టైటిల్. అదే తెలుగులో అయితే ద లాస్ట్ మాస్ హీరో, మాసెస్ హీరో బాలయ్యే అనుకోవాలేమో ! డాలస్ లో ర్యాలీలు తీసి గోల పెట్టారంటే, లండన్ లో పోలీసులు వచ్చి వార్నింగులు ఇవ్వాల్సి వచ్చిందంటే, సిడ్నీలో సీట్లు ఎగిరిపడుతున్నాయ్ అంటే ఎందుకు ? మాస్ కుదుపు కుదిపితే అలాగే ఉంటుందా ? అదొక్కటే కాదు అంతకు మించిన కారణాలు చాలానే ఉన్నాయ్.
జనంలో ఓ కసి ఉంది. ఆక్రోశం పెరిగిపోతోంది. తప్పు చేశామనే పశ్చాత్తాపం కొందరిలో, ఎలగైనా బుద్ధి చెప్పాలనే ఎదురుచూపు దాదాపు అందరిలో ! ఇలాంటి టైమ్ లో బాలయ్య వీళ్లందరికీ వాయిస్ ఇచ్చేశాడు. వీళ్ల పీలింగ్స్ నీ ఎమోషన్సునీ సంతృప్తి పరిచే స్థాయిలో ఉతికి ఆరేశాడు. వీళ్లు ఎవరిని, ఎలాంటి వాళ్లని అయితే విలన్ అని తిట్టిపోసుకుంటున్నారో ఇంచుమించు అలాంటి వాళ్లనే ఫుట్ బాల్ ఆడేశాడు అఖండసినిమాలో. అందుకే బాలయ్య సినిమా షో పడగానే, వచ్చేసింది పండగ. బాలయ్య ఉన్నాడు, వచ్చాడు, మోత మోగించాడు అనే సంబరం అందులో కొంతే. మిగతా కొంత… ఈ ఆక్రోశానికి బాలయ్య బలమైన ఆయుధం అయ్యాడు. అందుకే ఎదుటి వాడి మీద వెగటు అఖండను కల్ట్ హిట్ చేసే స్థాయిలో కనిపిస్తోంది. సినిమా హాలు ముందు అభిమానులు కటౌట్లు నిలబెట్టినట్టు… ఇలా సరైన సమయంలో సరైన సినిమా తీసి, జన జీవితంలో సంతోషాన్నీ రిలీఫ్ నీ నింపేవాడికి గుండెల్లో కటౌట్ పెడతారు అభిమానులు. అందుకే బాలయ్య లైఫ్ సైజ్ క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. అఖండ ఖండఖండాంతరాల్లో ఊపేసే స్థాయిలో ఊరేగుతోంది.
బాలయ్య తొడగొడతాడని గేలి చేస్తారు కొందరు. ఈల వేసి ట్రైన్ వెనక్కి పంపాడు అని హేళన ఆడతారు. ఎగరేసి నరికితే ముగ్గురేసి కిందపడతారు వామ్మో అని బుగ్గలు నొక్కుకుంటారు. ఇలాంటివన్నీ ఇంకో రేంజులో అఖండలో కూడా ఉన్నాయ్. కానీ అలాంటి వంకలు మాత్రం ఇప్పుడు పెట్టరు. ఎందుకంటే బాలయ్య ఉతుకుతున్నది, తమ చుట్టూ ఉండి, తమ జీవితాలతో ఆడుకుంటూ, దోచుకుంటున్న ఓ రకం మందని అని జనం ఫీలింగ్. జనం అంటే అభిమాన జనం అనుకున్నా పర్వాలేదు. అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా అనంతపురంలో ఉన్నా విశాఖలో ఉన్నా ఏ మూలున్నా ఎక్కుడున్నా ఇదే ఫీలింగ్. అందుకే ఇప్పుడు కొట్టాలి కొట్టాలి అనుకుంటున్నారు. భలే కొట్టాడు అనుకుంటూ అంత ప్రొలాంగ్ డ్ పైట్స్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మెచ్చుకుంటున్నారు తప్పితే నొచ్చుకోవడం లేదు. ఈ సమయంలో బాలయ్య తప్ప మరే హీరో చేయని, చేయలేని సాహసం ఇది. అందుకే బాలయ్యే ద లాస్ట్ మాస్ హీరో. బహుశా ఈ రేంజులో రిసెప్షన్, హంగామా మరే తెలుగు హీరోకీ ఉండదేమో ముందు ముందు.
బాలయ్యకి వయసు అయిపోయింది. ఏజ్డ్ లుక్ కనిపిస్తోందంటున్నారు కొందరు. నిజమే. బాలయ్య వయసు దాచుకోడు. మనసు అంతకన్నా దాచుకోడు. జనంలో ఉండే సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ అక్కర కనిపిస్తది. అందుకే బాలయ్య ద లాస్ట్ మాస్ హీరో. బాలయ్య కంటే నాలుగైదేళ్లు ఎక్కుఉన్నోళ్లు లైపో అయితే చేయించుగలిగారు కానీ బాలయ్యకున్నంత జోష్ ఎక్కడి నుంచి తెచ్చుకోగలరు ? అధికారం చెలాయిస్తున్నవారి సామాజిక వర్గం పేరుతో సినిమా తీసి… లంచులకెళ్లి అవార్డుల కోసం రిక్వెస్టు చేసి తెచ్చుకోగలరు కానీ, అరాచకాన్ని తెర మీదకు తెచ్చి చూపించగలరా ? దమ్ముందా ? లేదే ! అందుకే బాలయ్య ద బెస్ట్. ద లాస్ట్ మాస్ హీరో. అఖండలో ఎంపీ భరత్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేశాడు అని బాలయ్య కేరెక్టర్ గురించి చెబుతారు. నిజ జీవితంలో బహుశా అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువేమో ! బాలయ్య మాటతో ఎంపీలు అయినవాళ్లు, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులు అయినవాళ్లూ ఎంతో మంది ఉండి ఉండొచ్చు. మరి, ఒక్క కేంద్ర మంత్రి పదవి కోసం 18 లక్షల మంది అభిమానాన్ని అమాంతం అమ్ముకున్నవాళ్లని చూసిన తెలుగు జనానికి బాలయ్య ద లాస్ట్ మాస్ హీరో ఎందుకు కాడు ! అవుతాడు.
అన్నట్టు, ద లాస్ట్ యాక్షన్ హీరో – ఆర్నాల్డ్ సినిమా కథేంటో తెలుసా ! థియేటర్ యజమాని టీనేజ్ కొడుకు సినిమా కథలు చూసీ చూసీ విసుగెత్తి పోయి ఉంటాడు. నిజ జీవితంలో ఇలా ఉంటారా హీరోలు అనుకుంటాడు. అలాంటి టైమ్ లో, రియల్ లైఫ్ లో ఉన్న విలన్ ని, సినిమా హీరో ఆర్నాల్డ్ ఢీ కొట్టి చూపిస్తాడు. అలా ఆ విలన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు హీరోతో ఆ కుర్రాడు కూడా ట్రావెల్ అవుతాడు. కళ్లారా చూస్తాడు. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అంటాడు. అందుకే ఆ టైటిల్. ద లాస్ట్ యాక్షన్ హీరో. ఆ తర్వాత కూడా చాలా యాక్షన్ సినిమాలు వచ్చాయ్. కానీ యాక్షన్ హీరోలు రాలేదు. బాలయ్య కూడా అచ్చం అలాగే. వృత్తి ధర్మంగా సినిమాలు చేస్తూనే, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్థితులపై ఎలా పోరాడాలో చూపిస్తాడు. విసిగెత్తి పోయిన జనానికి వినోదంతోపాటు ఆలోచన కూడా అందిస్తాడు. అందుకే మొన్న, నిన్నటి తరాలకి నేటి తరం కూడా తోడై జై కొడుతోంది. నిజ జీవిత పరిస్థితులపై ఇంతలా కదిలించే హీరో ఇక ముందు ఉండకపోవచ్చు. అఖండలో పేలిన ప్రతీ డైలాగ్, ఎందుకు వచ్చిందో,రాజకీయంతో ఎందుకు సంబంధం ఉన్నదో ఓ ఇరవై పాతికేళ్ల తర్వాత కూడా అప్పటి జమానా అడిగి తెలుసుకుంటుంది కావాలంటే చూడండి ! ఎందుకంటే మనవాళ్లు ఎప్పటికీ ఆనవాళ్ల మర్చిపోరు. ఎలాంటి పరిస్థితుల్ని దాటి ముందుకెళ్లామో రేపటి తరానికి చూపించే టెస్టిమొనీ అఖండ. అందుకే బాలయ్య ద లాస్ట్ మాస్ హీరో.
-Rajesekhar