– రూ.1500 కోట్ల విలువైన భూమి రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు?
– ఒక్క ఉద్యోగం ఇవ్వలేని రియల్ ఎస్టేట్ సంస్థకి ఇన్ని రాయితీలా?
– సత్వా సంస్థ నిర్మాణ ఖర్చుల్లో 50 శాతం ప్రభుత్వ రాయితీ
– సగం విస్తీర్ణం రెసిడెన్షియల్‌గా వాడుకునే వెసులుబాటు
– కిక్‌బ్యాక్‌ల కోసమే ఆ కంపెనీకి ఈ బంపర్ ఆఫర్లు
– అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ, విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
పైగా ఆ రూ.45 కోట్లు కూడా గత నవంబరు 1 నాటికి డిపాజిట్ చేయకపోయినా.. రెండు నెలల గడువు ఇచ్చారని, ఆ వ్యవధికి కనీసం వడ్డీ కూడా వసూలు చేయబోవడం లేదని ఆయన గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సత్వాకి అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు.
ఇంకా ఆ సంస్థకు వరుసగా ఇస్తున్న రాయితీలు చూస్తుంటే ప్రభుత్వ పెద్దల్లో భారీగా కిక్‌బ్యాక్‌లు ముడుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.
అదే సంస్థ గతంలో పొరుగున తెలంగాణలో రూ.600 కోట్లతో 20 ఎకరాల భూమి కొన్నదని, కానీ ఏపీలో మాత్రం ఎకరా రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. అలాగే ఆ సంస్థ నిర్మాణంలో సగం రెసిడెన్షియల్ కోసం వాడుకోవచ్చన్న ఆఫర్, అవినీతికి దారులు వేయడమే అని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
పెట్టుబడుల పేరుతో పెద్ద ఐటీ కంపెనీలను ముందు పెట్టి వాటి వెనుక ఊరూ పేరూ లేని ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు పందేరం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ పనిగా మారింది. కమీషన్ల కోసం విలువైన ప్రభుత్వ భూ సంపదను సీఎం చంద్రబాబు సత్వా వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు. ఆ సంస్థకు ఈ ప్రభుత్వం, విశాఖలోని రుషికొండ హిల్ నెం:4 లో ఆగస్టు 1న ఎకరం కేవలం రూ.1.50 కోట్ల చొప్పున 30 ఎకరాలు ఏపీఐఐసీ లెక్కల ప్రకారమే, ఆ భూమి విలువ ఎకరా రూ.14 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంది.
అంటే రూ.1500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ధారాదత్తం చేస్తున్నారు. సత్శా సంస్థ రాష్ట్రంలో రూ.1200 కోట్ల పెట్టుబడి పెడుతుందని జీఓలో వెల్లడించారు. మరి ఆ సంస్థ మార్కెట్లో భూమి కొనుగోలు చేయలేదా? అంతే కాకుండా ఆ సంస్థ నిర్మాణాల వ్యయంలో 50 శాతం రీఫండ్ చేసేలా, ప్రభుత్వం సత్వాతో ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు జీవో నెం:27 జారీ చేశారు. ఇదిలా ఉండగా, కేటాయించిన భూమికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 90 రోజుల్లో ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం చేసిన సమయానికి బ్యాంక్ రేటు ప్రకారం వడ్డీ చెల్లించాలి.
కానీ, ఇక్కడ సత్వాపై అసాధారణ ప్రేమ చూపుతున్న ప్రభుత్వం, ఆ సంస్థ ఒక్క పైసా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఏకంగా రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ మేరకు జీఓ నెం:250 జారీ చేశారు. ఇంకా ఆ 30 ఎకరాల్లో కోటి చదరపు అడుగుల నిర్మాణం జరిగితే అందులో సగం మేర రెసిడెన్షియల్ కోసం వినియోగించుకోవచ్చని సత్వాకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వీటన్నింటి వెనక భారీ అవినీతి ఉందని మా పార్టీ తొలి నుంచి ఆరోపిస్తోంది.
సత్వా సంస్థకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఉదారంగా ఏదీ ఇవ్వలేదు. ఇదే సత్వా సంస్థ 2020లో హైదరాబాద్‌లోని కోకాపేటలో 20 ఎకరాల భూమిని రూ.600 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకా ఇటీవల అదే హైదరాబాద్‌లోని రాయదుర్గంలో భూమికి వేలం నిర్వహిస్తే ఎకరం రూ.150 కోట్లకు కొనుగోలు చేశారు. నిజంగా ఇది గొప్ప సంస్థ అయి ఉంటే, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇచ్చేవి కదా?. కానీ ఇక్కడ చంద్రబాబుకి మాత్రమే సత్వా మీద ఎందుకంత ప్రేమ?.
పెట్టుబడుల పేరుతో విశాఖలో జరుగుతున్న భూదోపిడీ వెనుక మతలబులన్నీ త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాం.