– బె దిరించిన సంపత్‌కుమార్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?
– అల్లు అర్జున్ ఇంటి మీద కూడా పోలీసులను పంపి రేవంత్ రెడ్డి హరాస్ చేశారు
– మంత్రి కొండా సురేఖ ఇంటికి మీది కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించా రు .
– జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా?
– అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్టులు చేయడం దుర్మార్గం
– మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం
– హోం శాఖను అడ్డుపెట్టుకుని పోలీసులను రేవంత్ తన ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.
– సజ్జనార్ గారు.. మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోండి
– దళిత జర్నలిస్టుపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చూడటం రేవంత్ వికృత చర్యకు నిదర్శనం
– మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను అడ్డుపెట్టుకుని మీడియా సంస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కానీ, రేవంత్ రెడ్డి నాలుగో స్తంభమైన మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీడియా అంటే ఎందుకో కోపం. జర్నలిస్టులను చూస్తే చెంపలు పగలగొట్టాలనిపిస్తుందని, గతంలో ఆయనే అన్నారు. ఆ కసిని ఇప్పుడు బయటపెట్టుకుంటున్నారు.
పండుగ పూట జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారు. మేము స్వేచ్ఛను ఇస్తున్నాం అని గప్పాలు కొట్టిన రేవంత్, ఇప్పుడు ఎమర్జెన్సీని తలపించేలా నియంతలా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులే మైనా తీవ్రవాదులా? సంఘ విద్రోహ శక్తులా? లేక బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక ఉగ్రవాదులా? అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు?
నోటీసులిచ్చి మర్యాదపూర్వకంగా పిలిచి విచారించవచ్చు కదా? ఘటన జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ లీవ్‌లో ఉండి శబరిమలకు వెళ్లారు. సంబంధం లేని వ్యక్తిని అర్ధరాత్రి ఇంట్లో నుంచి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం. సుధీర్ అనే దళిత జర్నలిస్ట్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు.
సజ్జనార్ గారు.. మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోండి. ఏం మాట్లాడుతున్నారు? మీ ఖాకీ బుక్ ఏం చెబుతోంది? గతంలో కేటీఆర్‌పై మీ మంత్రి అడ్డగోలు కామెంట్స్ చేసినప్పుడు, బాధపడ్డది కూడా ఒక మహిళే కదా? అప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? మీ చట్టం నిద్రపోయిందా? అప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? సిట్ ఎందుకు వేయలేదు?
మంత్రి గారి కంపెనీ పేదవాళ్ళ భూమిని కబ్జా చేస్తే, వారికి రక్షణ కల్పిస్తారు కానీ అరెస్ట్ చేయరు. నిజాయితీగా పనిచేసిన సీఐని మాత్రం బదిలీ చేస్తారు. నేషనల్ హైవే 44 కాంట్రాక్టర్‌ను కాంగ్రెస్ ఏఐసీసీ నాయకుడు సంపత్ కుమార్ డబ్బుల కోసం బెదిరించారు. దీనిపై 9వ తేదీన ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఆయన్ను అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయలేదు?
జర్నలిస్టులు వార్త రాస్తే అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడితే కేసులు ఉండవు. సిద్దిపేటలో నాపై కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు మాట్లాడారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా కేసు నమోదు కాలేదు.
రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి, ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశాడని మంత్రి కూతురు మీడియాకు చెప్పింది. దానిపై ఎందుకు సిట్ వేయలేదు? శనివారాలు, అర్ధరాత్రుల్లో రేవంత్ రెడ్డిలోని అరాచకవాది నిద్రలేస్తాడు.శని, ఆదివారాలు చూసి పేదల ఇళ్ళు కూలగొడతారు.హోంశాఖను దగ్గర పెట్టుకుని పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.
ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష నాయకులను సోషల్ మీడియా వారియర్స్ ఇంటి మీదికి పోలీసులను పంపి అరెస్టు చేస్తారు. . అల్లు అర్జున్ ఇంటి మీద కూడా పోలీసులను పంపి రేవంత్ రెడ్డి హరాస్ చేశాడు. సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి మీది కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించాడు. మహిళా జర్నలిస్టులు అని చూడకుండా రాత్రి 12 తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు.
నిజమైన నేరగాళ్లని వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద పోలీసులను ఉసిగొల్పుతున్నాడు. జర్నలిస్టుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులపైన అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నది.