– లేకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తి ఉండదు
– ఏ ఒక్కరికైనా ఇల్లు, స్థలం ఇవ్వకుంటే ఓటు వేయొద్దు
– వైఎస్సార్ ఇచ్చిన 77 ఎకరాల్లో 8,912 టిడ్కో ఇళ్ళ నిర్మాణం
– రూ.23 కోట్లతో గుడివాడలో బస్టాండ్ను నిర్మిస్తున్నాం
– రూ.13 కోట్లతో ప్రభుత్వాసుపత్రిలో భవన నిర్మాణం
– రూ.340 కోట్లతో భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్లపై ఫ్లైఓవర్
– రూ.30 కోట్ల మయిపాలెం రైల్వేగేటుపై మరో ఫ్లైఓవర్
– రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని కాలనీల్లో రోడ్ల నిర్మాణం
– కనీవినీ ఎరుగని రీతిలో గుడివాడను అభివృద్ధి చేస్తా
– గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, మే 11: గుడివాడ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. లేకుంటే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తి ఉండదన్నారు. ఏ ఒక్కరికైనా ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వకుంటే తనకు ఓటు వేయొద్దని ఆయన చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని 22 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపారు. మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం కొడాలి నాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్న ఏకైక నియోజకవర్గం గుడివాడ అని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన 77 ఎకరాల భూమిని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్ళ నిర్మాణాలను సీఎం జగన్మోహనరెడ్డి సహకారంతో పూర్తి చేయిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షలకు పైగా ఇళ్ళను పేదప్రజలకు నిర్మిస్తున్నామన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డిలు లేకుంటే గుడివాడ పట్టణంలో 16 వేల మంది నిరుపేదలు ఇళ్ళు లేకుండా అల్లాడుతూ ఉండేవారన్నారు.
అర్హులైన పేదలందరికీ కేటాయించిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేసి అప్పగిస్తామన్నారు. 2024 ఎన్నికల నాటికి గుడివాడ పట్టణంలో అర్హత కలిగి టిడ్కో గృహం లేక ఇంటి పట్టా రాలేదని చెప్పినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో 20 ఏళ్ళు పాలించిన 420 వ్యక్తులు, చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా తనను గెలిపించారని, మూడుసార్లు అధికారంలో లేనని తెలిపారు. ఈసారి ఐదేళ్ళు అధికారం ఇచ్చారని, వచ్చే రెండేళ్ళలో గుడివాడ నియోజకవర్గంలో 22 వేల మందికి టిడ్కో ఇళ్ళు, ఇళ్ళపట్టాలను అందజేసి లబ్ధిదారులందరూ సొంత ఇళ్ళలో నివశించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.
రాష్ట్రంలో 1983 లో టీడీపీ పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1985 నుండి మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రిచౌదరి, ఆయన కుమారులు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారన్నారు. వీరిని గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ కట్టవద్దని ఎవరైనా ఆపారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.23 కోట్లు ప్రభుత్వ నిధులతో గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల లోగా నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ఈ భవనం స్థానంలో కొత్త భవనాన్ని రూ.13 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. మరో రూ.5 కోట్లతో డయాలసిస్ యూనిట్లు వంటి మౌలిక వసతులను కూడా కల్పిస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏరియా ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఎన్టీఆర్ హయాంలోనే గుడివాడలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్లై ఓవర్ కూడా నిర్మించలేదన్నారు. గుడివాడ – పామర్రు రోడ్డులో ఉన్న భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్ల దగ్గర ఫ్రై ఓవర్లను నిర్మించాల్సి ఉందన్నారు. రూ.340 కోట్లతో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు వరకు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందన్నారు. భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్ల దగ్గర సబ్ వేలను కూడా నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం రైల్వే గేటు దగ్గర రూ.30 కోట్లతో మరో ఫ్లైఓవర్ ను నిర్మిస్తామన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని మందపాడు, ధనియాలపేట, వాంబేకాలనీ, ఇందిరానగర్ కాలనీలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో ఏర్పడ్డాయన్నారు. ఈ కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహనరెడ్డి రూ. 50 కోట్లు కేటాయించారన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఆరు నెలల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, విద్యుత్, తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తామన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోందని, ఈ సందర్భంగా ప్రజలను కలుస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అధికారులు, పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రాధాన్యతా క్రమంలో అన్ని సమస్యలనూ పరిష్కరించడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్ళ పాలనలో గుడివాడ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు పాలడుగు రాంప్రసాద్, పసలాది ఏసుబాబు, పసలాది శేఖర్, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని, తోట రాజేష్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.