Suryaa.co.in

Andhra Pradesh

పొత్తులతోనే వెళతాం!

– ఢిల్లీ టూర్‌లో బీజేపీతో ఇదే మాట్లాడా
– మా బలాన్ని దృష్టిలో పెట్టుకునే సీట్లు పోటీ చేస్తాం
-మా గౌరవానికి భంగం లేకుంటే పొత్తులు
-మన బలం చూపి పదవి తీసుకోవాలి
-కండిషన్లు పెడితే కుదరదు
-వైసీపీని గద్దె దింపడమే లక్ష్యం
-నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగను
-నా సత్తా ఏంటో చూపించి అడుగుతా
-జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ

-పొత్తులపై జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ

అనుకున్నదే అయింది. ఊహించిందే జరుగుతోంది. పొత్తులపై జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ మరింత స్పష్టత ఇచ్చారు.తన ఢిల్లీ పర్యటనలో కూడా బీజేపీ వర్గాలతో అదే మాట్లాడానని చెప్పారు. పొత్తులు ఉంటాయి. ఒప్పిస్తామని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో పొత్తులతో వెళతామని విస్పష్టంగా ప్రకటించి, గందరగోళానికి తెరదింపారు. తమ పార్టీ బలం మేరకే సీట్లు అడుగుతామని చెప్పేశారు. పార్టీ బలం చూపి సీట్లు తీసుకోవాలని, కండిషన్లు కుదరవని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల కంటే తమ బలం రెట్టింపయిందని పవన్‌ స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులు ఉంటాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఢిల్లీ టూర్‌లో ఇదే అంశంపై చర్చలు జరిగాయని తెలిపారు. వైసీపీ దాష్టీకాన్ని ఎదుర్కొంటామని, తమ బలాన్ని దృష్టిలో పెట్టుకుని పోటీ చేస్తామని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలను గౌరవిస్తామని, ఎన్నికలను ప్రభావితం చేసే పార్టీలు కలవాలని ఆకాంక్షించారు.

పొత్తులపై పవన్‌ ఇంకా ఏమన్నారంటే…
కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం, ఒప్పిస్తాం. ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయం చర్చించాను. 2019లో మేము 137 స్థానాల్లో పోటీ చేశాం. మేము కనీసం కొన్ని స్థానాల్లో గెలిచి ఉంటే మేము నేడు బలంగా ఉండేవాళ్లం. 30-40 స్థానాలు వచ్చి ఉంటే కర్నాటక తరహాలో పరిస్థితి ఉండేది. పొత్తులనేవి కులానికి సంబంధించినవి కాదు, రాష్ట్రానికి సంబంధించినది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే పొత్తుల గురించి నేను మాట్లాడాను. ఎర్లీ ఎలక్షన్స్ అని చెబుతున్నారు. జూన్ నుంచి ఇక్కడే ఉంటాను.

మా బలాన్ని బట్టే సీట్లు అడుగుతాం. బీజేపీ, బీఆర్ ఎస్ కూడా పొత్తుల వల్లే బలపడ్డాయి. మా గౌరవానికి భంగం లేకుంటే పొత్తుల విషయంలో ముందుకెళ్తాం. మాకు పట్టున్న ప్రాంతాల్లో 30 పర్సెంట్ ఉంది. యావరేజ్ తీసుకుంటే అది 18 నుంచి 19 ఉంటుంది. గత ఎన్నికల కంటే మా బలం డబుల్ అయింది.

2019లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాం. వ్యక్తిగత అవసరాల కోసం నేను పార్టీ ఏర్పాటు చేయలేదు. సినిమాల్లో సూపర్ స్టార్ హోదా నేను తెచ్చుకున్నాను. మన బలం చూపి పదవన్నది తీసుకోవాలి. కండిషన్స్ పెడితే కుదరదు. వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి. ప్రజలకు అధికారం అప్పగించాలి. ఇదే మా లక్ష్యం.

సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు
ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు.. లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేశాను.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసి వైసీపీపై పోరాటం చేయాలనే నాకుంది. కానీ, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నాం.

నేను సంపూర్ణమైన రైతును కాను.. కానీ, కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని.. అన్నీ తెలుసు అంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు. సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగను.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతాను.

కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుంది.. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది.

LEAVE A RESPONSE