ఆంధ్రప్రదేశ్ లో మరోమారు అధికారం లోకి రావాలనే ప్రయత్నాలకు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయత్నాలను ఎన్నికల నాటి వరకు నిరంతరాయ కొనసాగింపుకు అవసరమైన అర్ధబలం, అంగబలానికి లోటు లేదు. “ఏదో ఒకటి చేసి ” అధికారం లోకి రావాలనే ఉత్సాహానికి కూడా కొదువ లేదు. లేనిదల్లా…. గత పాలనలో చోటుచేసుకున్న తప్పిదాల పట్ల పశ్చాత్తాపమే!*
2019 ఎన్నికల నాటి నుంచి 2024 ఎన్నికల వరకు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పని చేసిన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయ గోదా లోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. ” ఇంకో సారి జగన్ వస్తే…. వామ్మో!” అనే భయం రాష్ట్రం లో ఇప్పటికే మొదలైంది. అధికారంలోకి వస్తే…. మొదటి రెండు నెలల్లోనే జైల్లో పెట్టాల్సిన వారి జాబితా…. మెడికల్ కాలేజీలలో పెట్టుబడులు పెట్టే వారితో మొదలైంది. పీ పీ పీ విధానం లో మెడికల్ కాలేజలలో పెట్టుబడులు పెట్టే వారిని…. అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపిస్తాము అని ఆయన సగర్వంగా ప్రకటించారు. వచ్చే మూడున్నరేళ్లల్లో ఈ జాబితా ఆంజనేయుడి తోకలా పెరిగినా పెరిగిపోవచ్చు.
నదురు, బెదురు లేకుండా తనకు నచ్చిన రీతిలో రాజకీయాలు చేయడానికి కావలసిన అర్ధబలం, అంగబలం ఆయనకు ఉన్నాయి. వాడ వాడలా వీరాతివీర , అరివీర భయంకర విధేయులకు కూడా లోటులేదు. 40 శాతం ఓటింగ్ షేర్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగ, అధికార గణం లో చెప్పుకోతగిన స్థాయిలో జగన్ కు వీర విధేయులు ఉన్నారు. “ఏ రకం ” రాజకీయం చేయడానికైనా ఈ వనరులు సరిపోతాయి. అయితే, అధికారం లోకి రావడానికి ఇవి సరిపోతాయా? జగనైనా ఆలోచించాలి, జగన్ రాజకీయ వ్యూహకర్తలైనా ఆలోచించాలి. ఢిల్లీ రాజకీయాలకు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ఇచ్చిన ” షాక్ ట్రీట్ మెంట్ ” ను జగన్ బృందం అధ్యయనం చేస్తే ; 2029 లో అధికారం లోకి రావడానికి ఆయనకు దారి కనపడుతుంది.
*కేజ్రీ వాల్ ఒక సివిల్ సర్వెంట్. ఐఆర్ ఎస్ అధికారి.
*అవినీతి కి వ్యతిరేకంగా అన్నా హజారే మొదలుబెట్టిన ఉద్యమం లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
*ఢిల్లీ కి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో “ఆమ్ అద్మీ ” అనే పార్టీ పెట్టుకున్నారు.
*ఢిల్లీ అసెంబ్లీ లో 70 సీట్లు ఉన్నాయి.
*2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది.
*అసెంబ్లీ లో మెజారిటీకి 36 సీట్లు కావాలి. కేజ్రీ వాల్ కు 28 సీట్లే వచ్చాయి.
*కాంగ్రెస్ కు వచ్చిన ఆరేడు సీట్లతో ప్రభుత్వం నడపడానికి కేజ్రీ వాల్ రెడీ అయ్యి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.
*కాంగ్రెస్ వాళ్ళు – కాలికేస్తే చేతికి…. చేతికేస్తే కాలికి వేసే మడత పేచీలు తట్టుకోలేక ; 49 రోజులకే రాజీనామా చేసేసి వెళ్లిపోయారు.
*దానితో, కేజ్రీ వాల్ ఒక రాజకీయ అరాచక వాది అనే విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ని రద్దు చేసి గవర్నర్ (రాష్ట్రపతి )పాలన పెట్టారు.
*కేజ్రీ వాల్ రాజకీయ ప్రయాణం ముగిసింది అని అంతా అనుకున్నారు.
*కానీ, ఢిల్లీ రాజకీయాలకు కేజ్రీ వాల్ 2014 లో – 2015 ఎన్నికలకు ఒక ఏడాది ముందు – ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.
*ముఖ్యమంత్రి పదవికి 2013 లో రాజీనామా చేసి తాను ఘోరమైన తప్పు చేశానని, తనను క్షమించాలంటూ కేజ్రీ వాల్ ప్రకటించారు.
*ఈ ఏకవాక్య ఎజెండాతో ఆయన ఢిల్లీలోని సందు సందు… గొంది గొందు తిరిగారు. వార్డు వార్డు వెళ్లి ఇంటింటికీ తిరిగారు.
*ఒకటే మాట. “తప్పు చేశాను. క్షమించండి..”
*2015 లో ఢిల్లీ అసెంబ్లీ కి ఎన్నికలు వచ్చాయి.
*బీజేపీ తరఫున నరేంద్రమోడీ, అమిత్ షా, మరో డజను మంది మంత్రులు, ఆర్. ఎస్. ఎస్. శ్రేణులు ప్రచారం చేస్తే మూడు సీట్లు ; కేజ్రీ వాల్ కు 70 లో 67 వచ్చాయి.
“క్షమించండి ” అనే పదానికి రాజకీయాల్లో ఉన్న పవర్ అది.
భారత రాజకీయాల్లో…. “తప్పు చేశాను. క్షమించండి….” అనే పదం వినిపించదు. ఆ మాట చెప్పే వాళ్ళు కనిపించరు. మన రాజకీయాల్లో…. అప్పటి జవహరలాల్ నెహ్రు నుంచి – ఇప్పటి కొడాలి నాని, ఆళ్ళ నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు వరకు…. తప్పులు చేయని వారు మనకు ఒక్కరు కూడా కనిపించరు. ఎవరిని పలకరించినా; “నేను నిప్పు ….” అనే వారే . అందుకే , తప్పు చేశాను అని ఎవరూ అంగీకరించరు. అందుకే , ఇంతమందిలో…. ” తప్పు చేశాను, క్షమించండి… ” అంటూ బహిరంగంగా గా ఓటర్ల కు విన్నవించిన వారు కేజ్రీ వాల్ గాకుండా మరొకరు లేకుండా పోయారు .
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా…. తిరిగి అధికారం లోకి రావాలి అనుకుంటే ; ఆయన హయాం లో జరిగిన తప్పొప్పులకు బాధ్యత తీసుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేయాలి. ఆయన రాజకీయానికి చంద్రబాబో… లొకేషో లక్ష్యం కాకూడదు. ప్రజలు, వారి బాగోగులు , రాష్ట్రం లక్ష్యం కావాలి. 2019-2024 మధ్య కాలం లో వైసీపీ నాయకుల పరం గానో…., ప్రభుత్వ పరం గానో ఏమి తప్పులు జరిగాయో ముందు బేరీజు వేసుకోవాలి. అవేమీ రహస్యం గా జరగలేదు . అవి పునరావృతం కావు అనే భరోసా రాష్ట్ర ప్రజలకు కల్పించాలి. ఆ తప్పులు చోటు చేసుకోడానికి కారకులైన వారిని దూరంగా పెట్టాలి. పెట్టడం మాత్రమే గాక, పెట్టినట్టు కూడా ప్రజలకు కనిపించాలి. తన మూలకం గా తప్పులు చోటు చేసుకుని ఉంటే…. జగన్ విచారం వ్యక్తం చేయాలి. ఒకసారి కాదు. వందసార్లు చేయాలి.
ముఖ్యంగా తనను ప్రజలు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో గ్రహించాలి. ఎందుకంత ద్వేషంతో తనను పరాభవం పాలుచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత ఎన్నికలో కూటమి విజయానికి.. జగన్పై ద్వేషమే ఏకైక కారణం తప్ప, మిగిలిన ఎవరూ కాదు. ఏ అంశమూకాదన్నది నిజం. జగన్పై వ్యతిరేకత ఒక్కటే కూటమిని గద్దెకు దగ్గరచేసింది. అలాకాకుండా.. తమ వల్లే కూటమి గెలిచింది. తమ త్యాగాలతూనే గెలించిందని ఎవరైనా భ్రమిస్తే, వారి అమాయకత్వాన్ని ఏమనలేం! ఆ పశ్చాత్తాప వ్యక్తీకరణలో ప్రజలకు జగన్ లోని నిజాయతీ, చిత్త శుద్ధి కనిపించాలి.
నిజానికి, జగన్ తో రాజకీయంగా… కూటమి లోని ఏ ఒక్క పార్టీ కూడా మల్లయుద్ధం లో ఎదురొడ్డి నిలువలేదనే అభిప్రాయం జనం లో ఉంది. అందుకే కూటమి గా ఉన్నాయి. ఒక్క తెలుగు దేశం, జనసేనకే కలిపి 48,49 శాతం ఓట్లు ఉన్నాయి. వారి ఓట్ల శాతం ను అధిగమించి, అధికారం ఛేజిక్కించుకోవడం అసాధ్యం కాకపోయినా, దుర్లభం అయితే కాదు. కొట్టాలి అనుకుంటే ; కూటమి ని బుర్ర తో కొట్టాలి గానీ, నోటితోనో…. భుజ బలం తోనో ….మూక బలం తోనో కాదు. సౌండ్ తక్కువ…. క్రియ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు సౌండ్ తప్ప క్రియ శూన్యం . రోడ్ షో లు, రప్పా రప్పా గ్యాంగులు, జగన్ హెచ్చరికలు అన్నీ… పిల్లలు ఆడుకునే చెక్క గుర్రం లాటివే. దాని మీద కూర్చుని, ఒక గంటసేపు ఊగినా…. అది అంగుళం కూడా ముందుకు కదలదు. ఉన్న చోటునే ఉంటుంది.
చంద్రబాబు, లోకేష్ తో పాటు మొత్తం కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం తప్పు అయిందని… కొందరు కమ్మ ప్రముఖుల సమావేశం లో జగన్ అన్నట్టుగా ఆ మధ్య మీడియా లో వచ్చింది. నిజమో… కాదో తెలియదు. అలాగే, కాపులను జగన్ బాగా దూరం చేసుకున్నారు. లేదా – కాపులే జగన్ కు బాగా దూరం అయ్యారు. ఈ రాష్ట్రం లో కాపుల మద్దతు లేకుండా…. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లోకి రాగలదా?
1983,85 లో కాపులు తెలుగు దేశంను బలపరిచారు. ఎన్ టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. 1989 లో కాంగ్రెస్ ను కాపులు బల పరిచారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. 1994 లో కాపులు మళ్ళీ తెలుగు దేశం ను బలపరిచారు . ఆది అధికారం లోకి వచ్చింది. 1995 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పని తీరుతో…. కాపులు 1999 లో తెలుగుదేశం ను బలపరిచారు. 2004 లో చంద్రబాబు గాడి తప్పారు అనే భావం తో కాపులు కాంగ్రెస్ ను బల పరిచారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాపులను ఆయన వీలైనంత దగ్గరకు తీసుకున్నారు.
ఒక ఉదాహరణగా…. రాజమండ్రి టైగర్ గా పేరొందిన జక్కంపూడి రామమోహన్ రావును ఆయన మంత్రిని చేశారు. రామ్మోహన్ కు మాట, నడక – రెండూ పోయాయి. సైగలే. పోర్టఫోలియో చూస్తే….. రోడ్లు, భవనాల శాఖ. రాజమండ్రి లో ఆయన ఇంటిదగ్గరే అంతా. అయినా, ఆయనను మంత్రి పదవి నుంచి వై. ఎస్. తప్పించలేదు. ఒకరకం గా కాపులు, వై ఎస్ ను ఓన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వై ఎస్ అప్పటి తూర్పు గోదావరి పర్యటనకు వస్తే, వట్టి వసంత కుమార్…. సిఎం గారి కారు డ్రైవర్. అందుకే, 2009 లోనూ కాపులలో అధికులు వై ఎస్ వెంట నడిచారు. అందుకే, చిరంజీవికి 17/18 సీట్లే వచ్చాయి.
రాష్ట్రం విడిపోయాక, కాపుల బలం మరింత సంఘటితం అయింది. అందుకే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం లోకి రాగలిగారు. 2019 వచ్చేసరికి, వైస్సార్సీపీ ని కాపులు గంపగుత్తగా భుజాలపై ఎక్కించుకు ఊరేగారు. అందుకే, జగన్ కు 151 సీట్లు వచ్చాయి. 2024 వచ్చేసరికి కాపులు – జగన్ పరస్పరం వదిలేసుకున్నారు. దానితో, ఆయన 11 సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. అయితే, కమ్మ ; కాకపోతే రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు ఉంటాయి.
వీరిలో ఎవరి వల్ల తమకు ఎక్కువ ఉపయోగం ఉన్నదో బేరీజు వేసుకుని ; కాపులు అటు జై అంటారు. ఈ విషయాన్ని జగన్ గమనం లోకి ఎంతగా తీసుకుంటారో అన్న విషయం మీదనే…. ఆయనకు ఈ సారి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఇలా, 2019-2024 మధ్య జరిగిన సమస్త తప్పొప్పులను నిజాయతీ తోజగన్ బేరీజు వేసుకుని, నష్ట నివారణ చర్యలు ఎంత నిజాయతీగా తీసుకుంటారు అనే అంశంపైనే… ఆయన పునరాగమనం ఆధారపడి ఉంటుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు)