– మెగా కృష్ణారెడ్డి కంపెనీ బిల్లుల మాటేమిటి?
– గతంలో నవయుగ నుంచి పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ
– రివర్స్ టెండర్‌లో నష్టం జరిగిందన్న నాటి విపక్షనేత చంద్రబాబు
– టీడీపీని ఉతికేసిన టీవీ9,ఎన్టీవీలో మెగా భాగస్వామి
– ఇప్పుడు 1458 కోట్ల పోలవరం బిల్లు పెండింగ్
– ఆగమేఘాలపై సీఎంఓకు పంపిన ఆర్ధికశాఖ అధికారిణి
– గతంలో చేసిన ఆరోపణలపై విచారణ జరిపిస్తుందా?
– బిల్లులు మంజూరు చేస్తారా? పెండింగ్‌లో పెడతారా?
– లోకేష్ రెడ్‌బుక్ ‘మేఘా’తో మొదలవుతుందా?
– అందరి చూపూ మేఘా బిల్లుల వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయనవి ‘మెగా’ మెరుపులు. ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన కత్తికి ఎదురుండదు. కాంట్రాక్టు పనులు పంచకల్యాణి గుర్రంలా పరిగెడుతుంటాయి. ఏ ప్రభుత్వంలో ఉన్నా అన్ని కాంట్రాక్టులు, వాటంతట అవే పరుగులు తీసి పువ్వులో పెట్టి అప్పగిస్తుంటాయి. విపక్షంలో ఉన్న పార్టీలు ఆయన కంపెనీ పనులపై విరుచుకుపడతాయి. మళ్లీ అవే పార్టీలు అధికారంలోకి వస్తే, విచిత్రంగా ఆయన కంపెనీకే కాంట్రాక్టులు ఇచ్చేస్తాయి. ఆయన లేకపోతే పాలకులకు నిమిషం జరగదు మరి.
ఎలక్టోరల్ బాండ్స్ అప్పగింతల ద్వారా తన అభిమానం చాటుకుంటుంటారు. ఆ విధంగా ఆ కంపెనీ గత ఎన్నికల ముందు ‘కేవలం 966 కోట్లు’, తను ముచ్చట పడ్డ పార్టీలకు విరాళంగా ఇచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన వెస్టర్స్ యుపి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరో 220 కోట్లు చదివించుకుంది. రైల్వే- టన్నెళ్లు-లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో చేయి తిరిగిన ఈ కంపెనీ.. హిమాలయాల్లో జోజిల్లా రోడ్డు టన్నెల్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలా ఆయన ‘అందరివాడు’. ఆ కంపెనీ అందరిదీ. పైగా చేతిలో రెండు పవర్‌ఫుల్ న్యూస్ చానెళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన కంపెనీ ఏ మూలకూర్చున్నా కావలసినవన్నీ దగ్గరుండి మరీ వడ్డించేస్తుంటారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్‌కే, బతకనేర్చే జీవితపాఠాలు చెప్పేంత గొప్ప కంపెనీ అది.
ఇప్పుడు ఆ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ఏపీ సర్కారు ఇవ్వాల్సిన 1458 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు వ్యవహారం, సీఎంఓకు చేరినట్లు సమాచారం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలవరం ప్రాజెక్టును నవయుగ నుంచి రివర్స్‌టెండర్ ద్వారా దక్కించుకున్న మేఘా కంపెనీకి, ప్రభుత్వం 1458 కోట్లు బకాయి పడింది. దానిని ఆగస్టులోగా ఇచ్చేస్తామని నాటి జగన్‌బాబు హామీ ఇచ్చినప్పటికీ, ఖజానాలో కాసులు లేక పెండింగ్‌లో పెట్టేశారట. ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ కూడా మెగా వారి మాదిరిగానే ‘అందరివాడు’ అయినప్పటికీ, ఖజానాలో కాసులు లేక బిల్లులలు సర్దుబాటు చేయలేకపోయారట.
తనకు మేళ్లు చేసిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. మెగా కంపెనీ బిల్లులు ఆగిపోతాయని, వైసీపీ సహా టీడీపీ-జనసేన-వైసీపీ-మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే.. గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలకు జగన్ సర్కారు బిల్లులు నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ సర్కారు కూడా అదేవిధానం పాటిస్తుందన్న అంచనా వ్యక్తమవుతోంది.పైగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని బాబు-లోకేష్‌ను అప్రతిష్ఠపాల్జేసిన టీవీ9-ఎన్టీవీలో మేఘా భాగస్వామి కాబట్టి.. ‘లోకేష్ రెడ్‌బుక్’ మేఘా నుంచే అమలవుతుందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది.
పైగా ఐదేళ్ల జగన్ జమానాలో టీడీపీని రాజకీయంగా.. చంద్రబాబునాయుడు-లోకేష్‌పై వ్యక్తిగతంగా బురదచల్లి, జగన్ కళ్లలో ఆనందం చూసిన టీవీ9- ఎన్టీవీ సంస్థల్లో మెగా కంపెనీ భాగస్వామి కాబట్టి.. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారం.. ఇక ఆ కంపెనీకి కష్టకాలం తప్పదన్న భావన అటు పార్టీ వర్లాల్లో కూడా కనిపిస్తోంది. అంటే ఒప్పందం ఉల్లంఘించిన మేఘా కాంట్రాక్టు రద్దు చేస్తారన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది.
ఈ నేపథ్యంలో శనివారం సెలవుదినం అయినప్పటికీ, మెగా కంపెనీకి చెల్లించాల్సిన 1458 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లు వ్యవహారం, ఆగమేఘాలపై సీఎంఓకు వెళ్లడంపై ఆర్ధికశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 400 కోట్ల రూపాయల చొప్పున, మొత్తం బిల్లుల ఫైలు సీఎంకు చేరినట్లు తెలుస్తోంది.
దీనితో మెగా కంపెనీ బిల్లులు వెంటనే చెల్లిస్తారా? పెండింగ్‌లో పెడతారా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల నుంచి, నత్తనడక పనుల వరకూ ప్రశ్నల వర్షం కురిపించిన టీడీపీనే, ఇప్పుడు అధికారంలో ఉన్నందున.. ఆ బిల్లుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొనడం సహజం.
పైగా.. మే నాటికి 7,380 కోట్ల సీలేరు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుచ్చక్తి ప్రాజెక్టును కూడా ఆ కంపెనీకే ఇచ్చారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాలపరిమితిని, మరో 36 నెలలపాటు పొడిగించాలని ఎన్నికల ముందు వరకూ జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం, ఆ మేరకు జగన్ జమానాలో సీఎంఓలో ఒక వెలుగువెలిగిన ఓ కడప రెడ్డి గారు జెన్కోపై ఒత్తిడి తీసుకురావటం అప్పట్లోనే మీడియా వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
సీలేరు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుచ్చక్తి ప్రాజెక్టు- పోలవరం హైడల్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా, 10,180 కోట్ల ఆర్ధిక ప్రయోజనం పొందేలా.. ఇంధనశాఖపై నాటి సీఎంఓ జగన్‌భక్త బృందం, ఒత్తిడి పెంచిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించిన విషయం బహిరంగమే.
నిజానికి రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. మేఘా కంపెనీ 2019 నవంబర్‌లో 1558.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు దక్కించుకుంది. అయితే, చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. అదే ఊపులో 3,270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. పోలవరం విద్యుదుత్పత్తి ప్లాంటును, 2024 నాటికి పూర్తి చేస్తానని జెన్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అక్కడా అదే పరిస్థితి.
ఫలితంగా ఒప్పంద కాలపరిమితి ముగిసింది. నిబంధనల ప్రకారమైతే.. కాలపరిమితి లోపు, ప్రాజెక్టు పూర్తి చేయనందుకు కంపెనీకి జరిమానా లేదా.. 60 సీ నిబంధనల కింద కాంట్రాక్టు రద్దు చేయాలి. కానీ విచిత్రంగా తమ గడువు పెంచాలని మేఘా కంపెనీ కోరడం, దానిని జెన్కోలో చర్చకు పెట్టడం వాయువేగంతో జరిగిపోయింది. సీఎంఓలో చక్రం తిప్పిన కడప రెడ్డిగారు, దానికోసం చాలా శ్రమదానం చేశారన్న విమర్శలు అప్పట్లోనే వినిపించిన సంగతి తెలిసిందే.
సాగునీటి ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయితేగానీ విద్యుదుత్పత్తి ప్లాంటును పూర్తి చేయడం కుదరదని, పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2026లో పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించిందంటూ.. జెన్కోకు మేఘా కంపెనీ ఒక లేఖ రాసింది. కాగా మే నెలలో జరిగిన జెన్కో బోర్డు సమావేశంలో, మేఘా లేఖను అజెండాగా చేర్చారు. అయితే దానిని తిరస్కరించిన బోర్డు.. దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దానితో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూడక తప్పని పరిస్థితి.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం.. మేఘా కంపెనీకి పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు కాలపరిమితి పెంచుతుందా? సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయనందున 60 సీ నిబంధనల కింద కాంట్రాక్టు రద్దు చేస్తుందా? లేక జరిమానాతో విడిచిపెడుతుందా? సీలేరు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుచ్చక్తి ప్రాజెక్టు- పోలవరం హైడల్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా, 10,180 కోట్ల ఆర్ధిక ప్రయోజనం పొందేందుకు సహకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.