తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణలో అతిపెద్ద కులం దళిత కులం. 75 లక్షల మంది జనాభా దళితులు ఉన్నారు. అందరీ కన్నా తక్కువ భూమి దళితుల వద్ద ఉంది. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే దళితుల వద్ద ఉంది. 9 శాతం మంది ఉన్న గిరిజనుల వద్ద 22 లక్షల ఎకరాల భూమి వద్ద ఉంది. దళితుల వద్ద 13 లక్షల ఎకరాల భూమి కూడా ఉందో లేదో తెలియదు. లెక్క తీస్తే తెలుస్తది. దళితులను బతుకనివ్వలేదు. జనాభా ఎక్కువ ఉన్నది. అవకాశాలు తక్కువ ఉన్నాయి.
అంబేద్కర్ పుణ్యమా అని ఎస్సీలకు రిజర్వేషన్ ఫలాలు అందాయి. అంబేద్కర్ పుణ్యంతో కొంతమంది పిల్లలు చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారు. కొందరు ఎమ్మెల్యేలు అయ్యారు. అట్టడుగు స్థాయిలో ఉన్న వారి కోసం అంబేద్కర్ పోరాటం చేశారు. తెలంగాణ తేవడం ఎంత పెద్ద యజ్ఞమో.. దళిత బంధును విజయవంతం చేయడం అంతే పెద్ద యజ్ఞం అని అన్నాఉరు. ప్రాణం పోయినా దళిత బంధును వదలం. సంవత్సరానికి కొంత మందికి అమలు చేస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వంద మందికి కచ్చితంగా ఈ పథకం అమలు చేస్తాం.
వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఈ ఏడేండ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ ఉటుంది. వచ్చే ఏడేండ్లలో రూ. 1.7 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపాం. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.
మోత్కుపల్లి అణగారిన ప్రజల వాయిస్
టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు. ప్రజా జీవితంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల వాయిస్‌గా ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రులు. నాతో అనేక సంవత్సరాలు కలిసి పని చేశారు. వారి వెంట ఎంతో అభిమానంతో వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. చాలా బాధలు పడ్డాం. చాలా అనుభవించాం. ఒకప్పుడు నర్సింహులు కరెంట్ మంత్రిగా ఉండే. నేను ఆయనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పిండు. ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేసిండు. కరెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడ్డది. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా సేవలందించారు.ఒకానొక దశలో తెలంగాణ సమాజం చెదిరిపోయింది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. అనేక అవమానాలను తెలంగాణ సమాజం ఎదుర్కొన్నది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా అనేక భయభ్రాంతులకు గురి చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ వద్ద మంచినీళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితి. మంచినీల్లు రావు, కరెంట్ సమస్య.. ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
కట్నం అడిగితే దవుడ మీద గుంజికొట్టు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని ములుగులో ఒకాయన డబ్బులు జమ చేసి పెడితే.. ఇల్లు కాలి డబ్బులు కూడా కాలిపోయాయి అని మొర పెట్టుకున్నారు. ఇక నేనే లక్ష రూపాయాలిచ్చి పెళ్లి చేయించాను. ఆ బాధల నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి పథకం. పుట్టింది కానీ మీరు దయచేసి పని చేస్తలేరు. ఇప్పుడు గమ్మత్తు మోపైంది. పెండ్లి అనంగానే కేసీఆరే లక్ష రూపాయాలు ఇస్తుండ్రు.. నీవు ఎంత ఇస్తవు అని అంటుండ్రు. కట్నం ఇంకా ఇస్తుండ్రా అని ఒకాయనను అడిగితే అవున్ సర్ అన్నడు. కట్నం అడిగితే అక్కడనే దవుడ మీద గుంజికొట్టు.. అన్నే పండ్లు రాలిపోతయి అని చెప్పిన.
పేదోళ్లు బాకీల పాలు కావొద్దు.. ఇబ్బంది రావొద్దని చెప్పి, పెళ్లి ఖర్చు అయిపోవాలని పెట్టిన స్కీం కళ్యాణలక్ష్మి. కేసీఆర్ ఇస్తుండు.. నీవేం ఇస్తవో చెప్పు అంటే.. ఇస్త పటు బిడ్డ అని ఇయ్యాలె. ఒకరిద్దరిని ఉతికితే దెబ్బకు అడుగుడు ఆగిపోతది. గరీబోళ్లు, పేదలు లక్ష రూపాయాల లోపే పెళ్లి వొడగొట్టే వాళ్లున్నారు. కానీ ఎక్కువ డబ్బులు అడగడం సమాజంలో మంచిది కాదు. ఇది తప్పురా.. దుర్మార్గుడా అని చెప్పాలి. ఇలాంటి వాటిని తిరస్కరణ చేయాలి. ఇన్‌సల్ట్ చేయాలి. మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఎక్కడివారు అక్కడే కథా నాయకుడైతేనే.. అక్కడ మంచి ఫలితాలు, లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు.
టీఆర్ఎస్‌కు రాజకీయాలంటే ఒక యజ్ఞం
ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్‌కు అట్ల కాదు. టీఆర్ఎస్‌కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నర్సింహులు రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. మోత్కుపల్లికి కరోనా వచ్చినప్పుడు కోటి ఖర్చు అయినా పర్లేదు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని చెప్పాను. మేమిద్దరం మంచి స్నేహితులం. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతం. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారు. దళిత బంధు పథకానికి తోడవుతానని మోత్కుపల్లి తనతో అన్నారు.
దళిత బంధుతో బలహీన వర్గాలను బలోపేతం చేసే యజ్ఞం ఇక్కడితో ఆగదు. గిరిజనులు, బీసీలు, ఈబీసీల్లో కూడా వస్తది. వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఏదో రూపంలో పంచుతాం. అతి ఎక్కువ బాధలో, దుఃఖంలో ఉన్న ప్రజలకు ముందు మేలు చేస్తాం. బలహీన వర్గాలకు వంద శాతం ఆదుకోవాలి. అప్పుడే గొప్పదనం ఉంటుంది. దళిత బంధుకు రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపం. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. కర్ణాటకలోని రాయ్‌చూర్ ప్రజలు కూడా తెలంగాణలో కలుస్తామని అంటున్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు.