Suryaa.co.in

Telangana

ప్రతిపక్షాల కలలు నిజం కానివ్వం

-ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం
-రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం
-ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
-ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని ఆదేశాలు
-బనిగండ్లపాడు ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

“కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండని
ప్రతిపక్షాలు కోరుకుంటున్న కలలను నిజం కానివ్వం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అధిగమించి ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని” డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ లను పరిశీలించి దరఖాస్తుదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా నిండలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. ప్రజల చేత వాతలు పెట్టుకొని అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకుల మాటలు అధికారాన్ని వదిలిపెట్టకుండా ఉండలేక పోతున్నట్టు ఉన్నాయని” ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పింది చేస్తుందని, గతంలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేశామని, ఇందిరమ్మ ఇండ్లు కట్టించామన్నారు.

పది సంవత్సరాలు పాలన చేసిన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తుందని వెల్లడించారు.

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలను తాకట్టుపెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి గత ప్రభుత్వ ఈ రాష్ట్రాన్ని నెట్టివేసిందని ధ్వజమెత్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారుతాయని ప్రజలు కలలు కన్నారని,. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకొచ్చని, ఇండ్లు, ఇంటి స్థలాలు వస్తాయని ప్రజలు కన్న కలలను గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కల్లలుగా మార్చిందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు. ఈ సంవత్సరపు చివరి త్రైమాసిక నిధులను కూడా ఎన్నికలకు ముందే డ్రా చేసి గత బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిన, రాష్ట్ర ఖజానాను ఊడ్చి వేసిన, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమించి ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఒకటో తారీకు నాడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్ధత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న అధిగమించి సంపద సృష్టిస్తామని, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామని ఇదే కాంగ్రెస్ మాట, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆచరణ అని వివరించారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28 రోజున 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపద ప్రజలకు పంచుతాం. ఇందిరమ్మ రాజ్యంలో సృష్టించిన సంపద దోపిడీ కాకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలను విశ్వసించి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగునంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి, అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణం స్వీకారం చేసిన గంటలోపే అదే ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని తెలిపారు. అదేవిధంగా పేదలకు మెరుగైన వైద్యం అందాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామని వెల్లడించారు.

ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ యువత కన్నటువంటి కలలను ఆశలను నిజం చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు.

” కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అన్నటు వంటి బి ఆర్ ఎస్ కు చెంపపెట్టు లాగా కరెంటు కావాలి. కాంగ్రెస్ కావాలి. అని ప్రజలు తీర్పు ఇచ్చారని” తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్తు ప్లాంట్లను నిర్మాణం చేయడంతో అవి ప్రొడక్షన్ లోకి వచ్చి గత పది సంవత్సరాలుగా తెలంగాణలో కరెంటు కోతలు లేవని, అది తమ గొప్పతనమే అని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అవుట్ డెడ్ టెక్నాలజీతో నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం భారంగా మార్చిందని అన్నారు. దామరచర్లలో నిర్మాణం చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు ప్రారంభం కాకుండా కరెంటును అప్పటి పాలకులు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారని ప్రశ్నించారు. కరెంటు పై మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు.

విద్యుత్తు రంగంపై 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం గత ప్రభుత్వం మోపినప్పటికీ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని వివరించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం మనది. ప్రజలందరిది. ఈ ప్రభుత్వంలో మనందరం వాటాదారులం. రెవెన్యూ పై వచ్చే ప్రతి పైసా పెట్టుబడి పెడతాం. ఆదాయం సృష్టిస్తాం. వచ్చిన లాభాలు అందరికీ పంచడమే ఇందిరమ్మ రాజ్యం. ప్రజాపాలన లక్ష్యమని” వివరించారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రగతిశీల ప్రజాస్వామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తామన్నారు. మానవ వనరుల పై పెట్టుబడి పెట్టాలని ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రతి మండల కేంద్రంలో భూములను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

ఇంటర్నేషనల్ స్కూల్ కు వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడం తో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచీకరణలో పెరిగిన పోటీ తత్వానికి అనుగుణంగా తెలంగాణ బిడ్డలు కూడా ఈ పోటీలో నిలబడే విధంగా తీర్చిదిద్దే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన కళాశాల నిర్మాణానికి, గ్రామంలో రెండు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు.

గ్రామంలో ఉన్న పీహెచ్ సి ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కావలసిన సౌకర్యాలు, వైద్య ఆరోగ్య సిబ్బందిని నియామకం చేస్తామని చెప్పారు. మధిర నియోజకవర్గం ప్రజలు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలు కాపాడడం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం
బనిగండ్లపాడు ప్రజా పాలన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ గౌతం, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేరళ రాష్ట్రానికి చెందిన కథాకళి కళాకారులు మేల తాళాలు, వాయిద్యాలతో వెల్కమ్ చెప్పడం విశేషం. గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి దేవాలయంలో భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు అక్కడినుంచి ర్యాలీగా ప్రజాపాలన కార్యక్రమానికి ప్రత్యేక వాహనంలో వస్తూ మార్గమధ్యంలో ఉన్న అమరజీవి శీలం సిద్ధారెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

LEAVE A RESPONSE