( మార్తి సుబ్రహ్మణ్యం)
విక్రమార్కుడు పంజాగుట్ట శ్మశానవాటికలో శవాన్ని భుజం మీద వేసుకుని భారంగా అడుగులేస్తున్నాడు. యధాప్రకారంగా ప్రశ్నలతో సతాయించే భేతాళుడు నోరు విప్పాడు. రాజా.. కాసేపు నన్ను దించి, పక్కనే ఉన్న కల్లు తాగి కాస్త రిలీఫ్ అవు. ఈలోగా నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే, నీ తల వేయి ముక్కలయిపోతుందన్న శాపాలేవీ ఇవ్వను. రోటీన్‌కు భిన్నంగా ఇకపై నేనే నిన్ను మోస్తా. ఎందుకంటే ఇది పొలిటికల్ స్టోరీ. దట్సాల్! అని కథ చెప్పడం స్టార్ట్ చేశాడు.
అనగనగా ఓ పువ్వు పార్టీ. దానికి ఆంధ్రాలో ఒక స్ట్రాటజీ. తెలంగాణలో ఒక స్ట్రాటజీ. ఆంధ్రాలో జగనన్నతో ఒక రకం దోస్తానా. తెలంగాణలో కేసీఆర్‌తో మరో రకం దోస్తానా. అంటే ‘నెగటివ్‌లో పాజిటివ్’ అన్నమాట. లాస్ట్‌వీక్‌లో తనను రాత్రి పూట కలసిన జగనన్నతో అమిత్‌షా, వైజాగ్ వెళ్లి జగనన్నను తిట్టిపోశారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. కోట్లు దిగమింగుతున్నారని సర్ఫుతో క్లీన్‌గా కడిగేశారు. సిగ్గుపడాలి అన్నంత పెద్ద మాటలతో తలంటు పోశారు. అంతకు రెండురోజుల ముందు నద్దాభాయ్ కూడా, జగన్నను చెడుగుడు ఆడారు.
దానితో మాజీ మంత్రి పేర్ని నానికి బోలెడంత కోపమొచ్చి, నద్దా భాయ్ భారీకాయాన్ని ఆయన ఎగతాళి చేశారు. సీన్ కట్ చేస్తే, మరుసటి రోజు జగనన్న పెట్టిన సభలో.. తనను బద్నామ్ చేసిన అమిత్‌షాను గానీ, నద్దాను గానీ పల్లెత్తు మాట అనలేదు. జగనన్నపై ఈగ వాలితే కత్తులూ, కటార్లతో దాడికి వచ్చే మంత్రులు కూడా, అమిత్‌షాను కించిత్తు మాట అనలేదు. మరుసటిరోజు కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి, జగనన్న ఇంటికి వెళ్లి సన్మానం చేయించుకున్నారు.
ఇప్పుడు చెప్పు! నద్దాభాయ్‌పై ఎటాక్ చేసిన పేర్ని నాని బాబాయ్, మరి అమిత్‌షాను ఎందుకు తిట్టలేదు? అసలు తనను, తన ప్రభుత్వాన్ని పొట్టుపొట్టున తిట్టిన వారిద్దరిపై, జగనన్న ఎందుకు ఎదురుదాడి చేయలేదు? తనకు బీజేపీ ప్రభుత్వ అండ లేదన్న జగనన్నకు, మరి అదే బీజేపీపై యుద్ధం చేయడానికి మొహమాటం ఎందుకు? అవినీతి సర్కారని విమర్శించిన అమిత్‌భాయ్, మరి అన్నీ తెలిసి ఇప్పటిదాకా చర్యలు తీసుకోకుండా, జగనన్నతో రాత్రి భేటీలు ఎందుకు వేస్తున్నట్లు? అడిగినన్ని అప్పులు ఎందుకు ఇస్తున్నట్లు? జగన్ తమ దత్తపుత్రుడని కేంద్రమంత్రి నిర్మలమ్మ ఎందుకు ప్రకటించిన్నట్లు?
ఇక తెలంగాణకొస్తే.. కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో పెడతామన్న సంజయన్న, ఇప్పటిదాకా ఎందుకు ఆ పని చేయించలేకపోయారు? కవితక్క ఢిల్లీ లిక్కర్ కేసు కంచికి చేరినా, సంజయుడు ఎందుకు ఆమె అరెస్టుకు డిమాండ్ చేయడం లేదు? నిన్నటి వరకూ పువ్వు పార్టీని పొట్టు పొట్టు తిట్టిన కేసీఆర్, ఇప్పుడు రూటు మార్చి, కాంగ్రెస్‌పై యుద్ధం ఎందుకు ప్రకటించారు? కేసీఆర్ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పే సంజయ్‌బాబు, వాటి ఆధారాలతో రేవంత్‌రెడ్డి మాదిరిగా కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?
రాజా.. నా ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? లేదా? నీళ్లు నమలకుండా, గుటకలు మింగకుండా, ముక్కుసూటిగా సమాధానం ఇస్తే, నేను నా దారిన వెళ్లిపోతా. అవతల మెట్రో రైల్ వచ్చే టైమయిపోయింది.
* * *
భేతాళుడు సంధించే ప్రశ్నాస్త్రాలకు.. ఎప్పుడూ సులభంగా సమాధానాలు చెప్పే అంతలావు విక్రమార్కుడూ, ఆ ప్రశ్నలు విని సమాధానం లేక తలపట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల పాలిటిక్సు, పువ్వుపార్టీ తెలివితేటలు ఈ రేంజ్‌లో ఉంటాయా అని నోరెళ్లబెట్టాడు. రిలీఫ్ కోసం పక్కనే ఉన్న ఇంకో కల్లు సీసా లాగించేశాడు. పరిస్థితి అర్ధమయిన భేతాళుడు, అక్కడి నుంచి మాయమై.. షేరింగ్ ఆటోలో బయలుదేరి, మెట్రోరైల్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు.
* * *
గత వారంలోనే ఏపీ సీఎం జగన న్నతో భేటీ అయిన అమిత్‌షా.. రెండురోజుల క్రితం వైజాగ్‌లో ప్రత్యక్షమై, జగనన్న సర్కారును ఉతికి ఆరేశారు. ఇంత అవినీతి సర్కారును ఎక్కడా చూడలేదన్నారు. వైసీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన 10 లక్షల కోట్లకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన అంతా అవినీతే. పేదల బియ్యం అమ్ముకుంటున్నారు. రైతు ఆత్మహత్యలో ఏపీది మూడో స్థానం. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారంటూ, జగనన్న పాలనను అమిత్‌షా దునుమాడారు. బాగుంది. రెండు వేర్వేరు పార్టీలు విమర్శించుకోవడం, ఆరోపించుకోవడం సహజం.
కానీ జగనన్న ప్రభుత్వం అవినీతితో కుళ్లిపోయిందని ఆరోపిస్తున్న అమిత్‌షాజీ… మరి నాలుగేళ్ల నుంచి, అదే జగనన్నకు ఎలా అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు? జగనన్న ఇస్తున్న వెంకటేశ్వరస్వామి బొమ్మ, తిరుమల ప్రసాదం, శాలువ ఎందుకు తీసుకుంటున్నట్లు? కేంద్ర బిల్లులకు జగన్ పార్టీ మద్దతు ఎందుకు తీసుకుంటున్నట్లు? అవినాష్‌రెడ్డి కేసు తేల్చకుండా, తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా ఎలా సాగుతోంది?
స్వయంగా జగనన్నకు కోర్టుకు హాజరుకాకుండా, మినహాయింపు ఎలా వస్తుంది? జగనన్న సర్కారుకు వ్యతిరేక తీర్పులిస్తున్న జస్టిస్ భట్టు దేవానంద్, హటాత్తుగా పక్క రాష్ట్రానికి ఎందుకు బదిలీ అయినట్లు? కోడికత్తి శీను ఎన్‌ఐఏ కేసు ఎందుకు తేల్చడం లేదు? జగనన్న సర్కారు అడిగినన్ని అప్పులు ఎలా ఇస్తున్నారు? అన్నవి బుద్ధిజీవుల సందేహం.
తనపై- తన పాలనపై అటు అమిత్‌షా, ఇటు నద్దా అస్త్రశస్త్రాలు సంధించినా, వాటిని తిప్పికొట్టకుండా, జగన్ గమ్మున కూర్చోవడం మరో ఆశ్చర్యం. తనకు బీజేపీ అండ లేదన్న జగనన్న అమాయకపు మాటలు నిజమైతే, మరి అదే సభలో ఆ ఇద్దరిపై ఎందుకు ఎదురుదాడి చేయలేదు? దమ్ముంటే వాటిని నిరూపించాలని ఎందుకు సవాల్ చేయలేదు? బియ్యం అమ్ముకుంటున్నామని నిరూపిస్తే, రాజీనామా చేస్తానని ఎందుకు కన్నెర్ర చేయలేదు? మా రాష్ట్రానికి మీరేం చేశారని ఎందుకు నిలదీయలేదు? నాలాంటి నీతి నిజాయితీపరుడిని అంతలేసి మాటలంటారా అని ఎందుకు కడిగేయలేదు?
ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు వెంటనే అమలుచేయలేదని ఎందుకు గర్జించలేదు? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖ స్టీల్ అమ్ముతున్నారని పేర్నినాని నిలదీసినంత ధైర్యంగా .. కేంద్రంపై ఎందుకు సింహనాదం చేయలేదన్నది, మరికొందరు అమాయకజీవుల సందేహం. చంద్రబాబునాయుడు- పవన్- గిట్టని మీడియాపై చేసే విమర్శల్లో.. తనను తిట్టిపోసిన అమిత్‌షా-నద్దాపై ఐదోవంతు ఎదురుదాడి చేసినా, జగనన్న మాటలు ‘నమ్మవచ్చన్న నమ్మకం’ చిక్కేది. ఇదీ రాజకీయ విశ్లేషకుల ఉవాచ.
మొత్తానికి అంతదూరం నుంచి వచ్చిన అమిత్‌షా-నద్దాజీ తమలపాకు యుద్ధమో, బంతిపూల యుద్ధమో.. ఏదో ఒకటి చేశామనిపించుకున్నారు. మళ్లీ జగనన్న అడిగినవెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చి, ఆయనిచ్చే వెంకన్న విగ్రహం-ప్రసాదం తీసుకుని, శాలువా కప్పించుకుంటే అది నిజంగా ‘పువ్వా’టే అవుతుంది.
ఇటు తెలంగాణలో ‘పువ్వా’ట.. భారాస నుంచి కాంగ్రెస్ వైపు ఎందుకు మళ్లింది? మొన్నటి వరకూ బీజేపీపై మూడోకాలితో లేచిన కేసీఆర్, ఇప్పుడు బీజేపీని దయతలచి, కాంగ్రెస్‌పై కారాలు మిరియాలు నూరడంలో మతలబేమిటన్న ప్రశ్నలకు జవాబులే దొరకవు. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన తర్వాత, కథ మొత్తం అడ్డం తిరిగిందన్నది సందేహపరుల డౌటనుమానం.
‘కేసీఆర్ బిడ్డ జైలుకెళ్లడం ఖాయం. తర్వాత కేసీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయం’ అని, ఇప్పటికి వందలసార్లు చెప్పిన.. బండి సంజయ్ చిలకజోస్యం ఇంకా ఎందుకు ఫలించడం లేదు? ఆయన తన దగ్గర వారి అవినీతి చిట్టాను, సీబీఐ లేదా ఈడీ లేదా ఐటికి ఇవ్వకుండా ఎందుకు ఊరిస్తునట్లు?
ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్ అయిన తర్వాత.. ఇక ఏపీలో అవినాష్‌రెడ్డి, తెలంగాణలో కవితక్క సేఫ్ అన్న అనుమానాలకు, పువ్వు పార్టీ తన చర్యల ద్వారా తెరదించకపోవడం మరో వింత. కమలం పేరు వింటేనే వారికి కంపరం పుట్టేలా మాట్లాడే కేసీఆర్ అండ్ అదర్స్.. అసలిప్పుడు పువ్వును పట్టుకోవాలంటేనే ఎందుకు పరేషానవుతున్నట్లు?