Suryaa.co.in

Editorial

బీఆర్‌ఎస్‌ సీట్ల ‘కారు’.. ‘బీఫారం’ వరకూ వెళుతుందా?

– వాళ్ల దగ్గరికే బీ ఫారం వెళుతుందా? యుటర్ను తీసుకుంటుందా?
– కొన్ని మార్పులుంటాయని స్పష్టం చేసిన కేసీఆర్‌
– మల్కాజిగిరిలో మైనంపల్లిని మార్చే చాన్స్‌
– 20 వరకూ మార్పు చేర్పులుంటాయన్న చర్చ
– సీట్లు వచ్చినా సంతోషంగా లేని కొందరు సిట్టింగులు
– గందరగోళానికి తెరదించే వ్యూహంతోనే ముందస్తు ప్రకటన
– కాంగ్రెస్‌ వైపు మళ్లకుండా బీఆర్‌ఎస్‌ అధినేత ముందస్తు ఎత్తుగడ
– బీఆర్‌ఎస్‌ ఎత్తుగడ బూమెరాంగవుతుందా?
– మళ్లీ ఎంతమందిని మారుస్తారన్న ఆందోళనలో సిట్టింగులు
– ఖమ్మంలో మార్పులు తప్పవంటున్న బీఆర్‌ఎస్‌ వర్గాలు
– బీ-ఫారం ఇచ్చేంతవరకూ బీఆర్‌ఎస్‌లో బిక్కు బిక్కే
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏది చేసినా సంచలనమే. ఒకేసారి 115 మందికి టికెట్లు ప్రకటించి, సంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్‌ అధినేత- తెలంగాణ సీఎం కేసీఆర్‌ చల్లనిచూపుతో … సీట్లు దక్కించుకున్న అభ్యర్ధులకు ఆ ఆనందం నిలిచే అవకాశం కనిపించడం లేదు. సీట్లు ప్రకటించిన రోజు.. వారి పెదవులపై కనిపించిన చిరునవ్వు స్థానంలో, ఇప్పుడు వారి ముఖాలు ఆందోళనతో కనిపిస్తున్నాయి. కారణం.. ఈ జాబితాలో కొన్ని మార్పుచేర్పులుంటాయని చివరలో కేసీఆర్‌ చెప్పడమే!

115 మందితో బీఆర్‌ఎస్‌ తొలిజాబితా ప్రకటించిన పార్టీ అధినేత- సీఎం కేసీఆర్‌ వారందరికీ చివరి నిమిషంలో, బీ ఫారం ఇస్తారా? లేదా? అన్న అనుమానాలకు తెరలేచింది. బీఆర్‌ఎస్‌ సీట్ల ‘కారు’.. బీఫారం వరకూ వెళుతుందా? మధ్యలోనే యు టర్న్‌ తీసుకుంటుందా? అన్న బెంగ ఇప్పుడు సీట్లు దక్కించుకున్న వారిలో మొదలయింది. వాటిలో కొన్ని మార్పు చేర్పులుంటాయని కేసీఆర్‌ చెప్పకపోతే, సీట్లు ఖాయమైన అభ్యర్ధులకు ఎలాంటి బెంగ ఉండేది కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మల్కాజిగిరి సీటు ప్రకటించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మైనంపల్లి హన్మంతరావు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తన అనుచరులతో భేటీ అవుతున్న ఆయన, తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్‌లో చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

కొడుకు- తాను కచ్చితంగా పోటీచేసి తీరతామని మైనంపల్లి శపథం చేస్తున్నారు. దీన్ని బట్టి ఆయనపై వేటు ఖాయమైతే, అక్కడ మరొకరిని నిలబెట్టాల్సి ఉంది. ఆ ప్రకారంగా తొలి సీటు మల్కాజిగిరి నుంచే మారనుంది.

పార్టీ పూర్తి మెజారిటీ ఉన్న ఖమ్మంలో అగ్రనేత తుమ్మల నాగేశ్వరరావు పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన పోటీకి దిగితే ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి చివరి నిమిషంలో ఆయనకు సీటు ఇవ్వడం, అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్నం మహేందర్‌రెడ్డి దెబ్బకు, ఏవిధంగా అయితే నాయకత్వం దిగివచ్చిందో, తుమ్మల విషయంలో కూడా దిగిరాక తప్పదంటున్నారు.

ఖమ్మంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన రాములు నాయక్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రభావం, ఆ నియోజకవర్గాల్లో అధికం. మధిరలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రామ్మూర్తి సైతం, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగులో తనను కాదని నాగజ్యోతికి సీటివ్వడంపై, ఇప్పటికే అక్కడ క్యాడర్‌ నిర్మాణం చేసిన డాక్టర్‌ ప్రహ్లాద్‌ నాయకత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా పార్టీ వీడి, సొంతబాట పడుతున్నారు.

నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌పై, సొంత పార్టీలోని అన్ని వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగరువేయడం విశేషం. ఆయనకు సీటు ఇస్తే పనిచేసేదిలేదంటూ, జడ్పీటీసీ, సర్పంచులు కుండబద్దలు కొట్టారు. అక్కడ సీటు ఆశించి భంగపడ్డ సీనియర్‌ నేత కడారి అంజయ్యయాదవ్‌ కూడా, కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వీరంతా గోడదూకేందుకు సిద్ధమవుతున్న క్రమంలో, వారికి చివరి నిమిషంలో సీట్లు ఇవ్వడం అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు సీటి వ్వడంపై, సీనియర్‌ దుర్గాప్రసాద్‌రెడ్డి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్ని ల్లోనే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయన డీపీరెడ్డి..ఈసారి టికెట్‌ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే మళ్లీ కాలేరు పేరు ప్రకటించడంతో.. అయనను వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు, సీనియర్లు భేటీ అయ్యారు. ఆ ప్రకారంగా కొన్ని జిల్లాలో , మళ్లీ చాలామార్పు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈవిధంగా అట్టుడుకుతున్న అసమ్మతి తలనొప్పి, సీట్లు సాధించిన వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ఫలితంగా సీటు వచ్చిన ఆనందం వారిలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సుమారు 20 మందిని, మళ్లీ మార్చే అవకాశాలు లేకపోలేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తును బుజ్జగించి, పదవులు హామీలిస్తున్న నాయకత్వ ఎత్తుగడ ఫలిస్తున్నట్లు లేదు.

గతంలోనే కేసీఆర్‌ను నమ్మి పార్టీలోకి వచ్చామని, పార్టీలో చేరిన తర్వాత తమకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సీనియర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అందుకే వారంతా పార్టీ రాయబారులుగా వచ్చిన వారితో, అసలు మాట్లాడేందుకే ఇష్టడపడటం లేదు. దీన్నిబట్టి పార్టీ సీనియర్లంతా తమ అనుభవాల మేరకు, నాయకత్వ హామీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే.. పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఆత్మస్థైర్యం దె బ్బతినకుండా, టికెట్లు దక్కవని భావించిన వారంతా.. కాంగ్రెస్‌ వైపు చూడకుండా ఉండే ఎత్తుగడతోనే, కేసీఆర్‌ ముందస్తు సీట్ల ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రకారంగా పార్టీలో గందరగోళానికి తెరదింపవచ్చన్నది కేసీఆర్‌ ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది.

కానీ నాయకత్వం నిర్ణయం, దాదాపు 40 నియోజకవర్గాల్లో బెడిసికొట్టే ప్రమాదం కనిపిస్తోంది. అందులో 20-25 నియోజకవర్గాల్లో, పార్టీని దెబ్బతీసే స్థాయిలో నేతలు ఉన్నట్లు బీఆర్‌ఎర్‌ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో ఈ తరహా తలనొప్పి ఎక్కువగా ఉందంటున్నారు.

అందువల్లే.. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉన్నందున, ఆలోగా 20,25 మంది అభ్యర్ధులను మార్చవచ్చని పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈలోగా వారికి సీట్ల భరోసా ఇవ్వవచ్చంటున్నారు. ఇన్ని మలుపుల కారణంగానే.. కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్ధులందరికీ, బీ-ఫారం ఇవ్వడం సందేహమేనంటున్నారు.

LEAVE A RESPONSE