Suryaa.co.in

Editorial

వారి ‘కలెక్టర్ల కల’ ఇప్పుడైనా నిజమయ్యేనా?

– ఇప్పటివరకూ కలెక్టర్ల పోస్టింగులు రాని ఐఏఎస్‌ల దయనీయం
– కలెక్టర్లు కాకుండానే రిటైరయిన ఐఏఎస్‌లు ఏడుగురు
– జగన్ హయాంలోనయినా నెరవేరేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రతి ఐఏఎస్‌కూ చీఫ్ సెక్రటరీ కావాలన్నది ఓ కల. అంతకంటే ముందు జిల్లా కలెక్టర్ కావాలన్నది తొలి కోరిక. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ కావాలన్న కోరిక దేవుడెరుగు. కలెక్టర్ల పోస్టింగులే దిక్కులేని దయనీయ పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హయాంలోనయినా ఆ సంప్రదాయం మారుతుందో లేదోనన్న ఉత్కంఠ అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

నేడో, రేపో కలెక్టర్ల బదిలీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఏళ్ల తరబడి కలెక్టర్ పోస్టింగులు రాని ఐఏఎస్‌లకు, ఈసారయినా మోక్షం కలుగుతుందా? లేదా అన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. జాయింట్ కలెక్టర్లు, కార్పొరేషన్ ఎండీలు, సీసీఎల్‌ఏ వరకూ పరిమితమైన వీరి పోస్టింగులు, కలెక్టర్ల వద్దకు వచ్చేసరికి నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా పెద్దగా చొరవ చూపించకపోవడంతో, ఇప్పటిదాకా ఏడుగురు ఐఏఎస్‌లు కలెక్టర్లు కాకుండానే రిటైరవాల్సిన విచిత్రకర పరిస్థితి ఏర్పడింది.

సీనియర్ ఐఏఎస్ రేఖారాణి, చక్రవర్తి, కన్నబాబు, బసంత్, సి.శ్రీధర్, అశోక్, శారదాదేవి, సి.శ్రీధర్, నాగరాణి వంటి ఐఏఎస్‌లకు ఇప్పటివరకూ కలెక్టర్ పోస్టింగులు ఇవ్వకపోవడం
ias-1ప్రస్తావనార్హం. వీరంతా 2001 నుంచి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారులే. వీరిలో ఒక సీనియర్ ఐఏఎస్‌పై, అప్పటి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ఒక వార్త ఆధారంగా ఆయన అవకాశాలు దెబ్బతీశారన్న ప్రచారం అధికారవర్గాల్లో జరిగింది. ఇక కన్నబాబు తనకు కలెక్టర్ పోస్టింగ్ వద్దని చెబుతున్నట్లు సమాచారం. మిగిలిన ఐఏఎస్‌లు కనీసం కొత్త జిల్లాలు ఏర్పడే సందర్భంలోనయినా, తమకు కలెక్టరు పోస్టింగు రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

కాగా ఐఏఎస్‌లకు కలెక్టర్ పోస్టింగులు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులదే. ఆయనే వారి అర్హతలు, పనితీరు, ఏసీఆర్ నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టరు పోస్టింగులు ఇవ్వాలని ముఖ్యమంత్రులకు సిఫార్సు చేస్తుంటారు. లేకపోతే ఐఏఎస్ అధికారుల సంఘమే చొరవ తీసుకుని, సీఎస్‌లతో చర్చలు జరుపుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విధంగా డాక్టర్ విజయకుమార్, హరీష్‌కు కలెక్టర్ల పోస్టింగులు ఇవ్వని సందర్భంలో.. అప్పటి ఐఏఎస్ అధికారుల సంఘం చొరవ తీసుకుని, నాటి సీఎస్ కాకి మాధవరావుతో చర్చలు జరిపింది. ప్రతి ఐఏఎస్‌కు కలెక్టర్ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. అందుకు ఆయన అంగీకరించి, నాటి సీఎంకు వారిద్దరి పోస్టింగు అవసరాన్ని వివరించి కలెక్టర్ పోస్టింగ్ ఇప్పించడం జరిగింది.

కలెక్టర్ల పోస్టింగులు సీఎం విచక్షణాధికారమే అయినప్పటికీ, సీఎస్‌ల సిఫార్సు పాత్ర కూడా ఉంటుంది. జగన్ సీఎం అయిన తొలిరోజుల్లో నాటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సలహాదారు అజయ్ కల్లం సూచించిన వారికే కలెక్టర్ల పోస్టింగులు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఎవరి ప్రమేయం లేకుండా, జగన్మోహన్‌రెడ్డే పోస్టింగుల వ్యవహారం నిర్ణయిస్తున్నారని అధికార వర్గాల కథనం. ఒకప్పుడు ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కలసి ఫలానా ఐఏఎస్ తమ జిల్లా కలెక్టర్‌గా నియమించాలని, సీఎం వద్దకు వెళ్లి సిఫార్సు చేసే సంప్రదాయం ఉండేది.

ఇప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం అంత బలంగా లేకపోవడంతో, ఐఏఎస్‌లే సీఎస్‌ల వద్దకు వెళ్లి తమ పోస్టింగ్ కోసం అభ్యర్ధించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. నిజానికి కేంద్రానికి డెప్యుటేషన్‌కు వెళ్లే సందర్భంలోగానీ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లినప్పుడు గానీ, సదరు అధికారి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారా లేదా అన్న అంశానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ప్రతి ఐఏఎస్ జిల్లా కలెక్టర్ కావాలని తొలుత కలలు కంటారు.

మరికొద్దిరోజుల్లో ఏపీలో అధికారుల బదిలీలు భారీ స్థాయిలో ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడయినా అవకాశాలు రాని ఐఏఎస్‌లకు కలెక్టర్ పోస్టింగులు ఇస్తారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు వరకూ ఏ ముఖ్యమంత్రి ఈ ఐఏఎస్‌లకు కలెక్టర్ పోస్టింగులు ఇవ్వని నేపధ్యంలో, జగన్మోహన్‌రెడ్డి హయాంలోనయినా వీరికి మోక్షం లభిస్తుందా? లేక కలెక్టర్ల పోస్టింగులు రాకుండానే రిటైరయిన ఏడుగురు ఐఏఎస్‌ల జాబితాలోనే వీరూ చేరతారా అన్నది చూడాలి.

LEAVE A RESPONSE