-
జగన్ సర్కారుతో ఒప్పందం రద్దు చేస్తుందా? లేదా?
-
ఆ ఒప్పందం రద్దు కూటమి చిత్తశుద్ధికి పరీక్ష
-
జగన్ సర్కారు ఒప్పందాన్ని రద్దు చేయడం అనివార్యం
-
7 వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కొను’గోల్మాల్’
-
మెగావాట్‌కు 25 లక్షల కమిషన్
-
అప్పట్లో తాడేపల్లిలో జగన్‌తో అదానీ భేటీ
-
కలవలేదని ఖండించిన నాటి జగన్ సర్కార్
-
జగన్‌ను కలిసిన తర్వాతనే ‘సెకీ’ ఒప్పందం
-
అదానీ నుంచి కొన్న పవర్ ఏపీకి ఇవ్వాలని సెకీ నిర్ణయం
-
దానిపై అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసిన నాటి ఎంపి రఘురామరాజు
-
జగన్ సర్కారుకు 1750 కోట్ల లంచాలు
-
1750 కోట్ల లంచం ఇచ్చి సౌరవిద్యుత్ ఒప్పందం
-
ఒడిషా ఒప్పందం కంటే ఏపీ ఒప్పందం లంచాలే ఎక్కువట
-
అమెరికా బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు అభియోగం
-
వాట్సాప్, మెయిల్స్ స్వాధీనంలో తేలిన గుట్టు
-
2019-24 మధ్య జరిగిన కుంభకోణం
-
జగన్ జమానాలోని ఇం‘దన’శాఖ అధికారులే ఇప్పుడు కూడా
-
నాటి ఒప్పందంలో ‘విజయ’వంతంగా డీల్ కుదిర్చిన అధికారికే ఇంకా పగ్గాలు
-
‘డీల్ సెటిల్మెంట్స్’లో ఆయన ‘ఆనందమే’వేరట
-
షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ యవ్వారంలోనూ ఆయనదే పాత్ర
-
కాబోయే సీఎస్ అన్న ప్రచారం
(మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి సర్కారుకు అదానీ రూపంలో తొలి అగ్నిపరీక్ష ఎదురయింది. జగన్ జమానాలో ప్రభుత్వంతో చేసుకున్న సౌరవిద్యుత్ ఒప్పందం రద్దు చేసే అంశం కూటమి సర్కారుకు సవాలుగా మారింది. దీనికి సంబంధించి ఒక్క ఏపీ ప్రభుత్వ అధికారులకే అదానీ 1750 కోట్లు లంచాలు ఇచ్చారంటూ అమెరికా ప్రభుత్వం ఆధారాలతో సహా అక్కడి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. మరోవైపు.. జగన్ జమానాలో ఇం‘ధన’శాఖను వెలిగించి, ఆ డీల్‌లో కీలకపాత్ర పోషించిన ఒక అధికారి.. కూటమి ప్రభుత్వంలోనూ అదే స్థానంలో వెలిగిపోతున్నారు. ఫలితంగా.. అదానీతో జగన్ సర్కారు చేసుకున్న నాటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుందా? లేదా? రద్దు కాకుండా సదరు అధికారి చేసే ప్రయత్నాలను కూటమి సర్కారు ఖాతరు చేస్తుందా? లేదా అన్న చర్చకు తెరలేచింది.
అమెరికా ప్రభుత్వం బిగించిన ఉచ్చులో చిక్కుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ఇప్పుడు ఏపీలో కూటమి మెడకు ఉచ్చు బిగించారు. జగన్ సీఎంగా ఉండగా, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అదానీ నుంచి కొన్న పవర్‌ను కొనుగోలు చేసేలా కుదుర్చుకున్న ‘సెకీ’ ఒప్పందాన్ని, కూటమి సర్కారు రద్దు చేయడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి ఒప్పందాల సందర్భంలో ఉన్న ‘యాంటీకరప్షన్ క్లాజు’ను ఉపయోగించి, ఆ ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మరి కూటమి సర్కారు ఆ క్లాజును అదానీపై అస్త్రంగా సంధిస్తుందా? అన్న ఉత్కంఠ మొదలయింది.
జగన్ సర్కారులో ఒక్కో మెగావాట్‌కు.. 25 లక్షల రూపాయల చొప్పున కమిషన్ ఇచ్చారంటూ, అమెరికా దర్యాప్తు ఏజెన్సీ అక్కడి కోర్టుకు ఆధారాలతో సహా అందించింది. ఆ మేరకు అప్పట్లో వాట్సాప్-ఈ మెయిల్ ద్వారా జరిగిన లావాదేవీలు, సంభాషణలను తన ఆరోపణలకు మద్దతుగా కోర్టుకు సమర్పించింది. దానిపై అక్కడి జడ్జి సంతృప్తి చెంది, జ్యూరీకి అప్పచెబితే.. జ్యూరీకి అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సంస్థలు తమ ఆధారాలు అందిస్తాయి. అప్పుడు జగన్‌తోపాటు, అదానీ కూడా మునగడం ఖాయమని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో.. ఇంత అప్రతిష్ట తమ మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే.. కూటమి ప్రభుత్వం, అదానీతో చేసుకున్న గత ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనివార్యం. మరి కూటమి సర్కారు అంత ధైర్యం చేస్తుందా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే.. పారిశ్రామికవేత్తలపై వేధింపులు తమ సిద్ధాంతం కాదని, వారిని వెనక్కిపంపించటం తమ అభిమతం కాదని తరచూ స్పష్టం చేస్తూనే ఉంది. అందుకే జగన్ బినామీ కంపెనీ అంటూ.. విపక్షంలో ఉండగా తానే ఆరోపించిన, షిర్డిసాయి ఎలక్ట్రానిక్స్ కంపెనీపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రస్తావనార్హం. ఆ కోణంలో చూస్తే.. అదానీ కంపెనీతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తుందా? లేదా? అన్న సందేహం సహజంగానే చర్చకు వస్తోంది. ఎందుకంటే అదానీ ప్రధాని మోదీకి ప్రియమైన మిత్రుడంటూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
జగన్ మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ఇప్పుడు అమెరికా కోర్టు రికార్డు ల వరకు వెళ్ళింది. గౌతమ్ అదానీ పై అమెరికా లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అందులో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, గత వైసీపీ హయాంలో సాగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం గౌతమ్ అదానీ, 2021 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలిసినట్లు, అమెరికా కోర్టు నేరారోపణల్లో ప్రస్తావించింది.
జగన్ సర్కారుతో ఒప్పందం ఇలా..
అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు చేసిన అభియోగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు 200 మిలియన్ డాలర్స్.. అంటే 1680 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. కోర్టు అభియోగాల ప్రకారం చూస్తే.. గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా అప్పటి సీఎం జగన్ ను కలిసి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ తో పాటు, పలు విషయాలపై చర్చించినట్లు ప్రస్తావించారు.
ఒప్పందం ప్రకారం అధికారులకు లంచాలు ఇవ్వటానికి కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ఆ రికార్డు ల్లో పేర్కొన్నారు. ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే.. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబదించిన లంచం చాలా ఎక్కువ మొత్తం అని అందులో పేర్కొన్నారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు ల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెల్లించాల్సిన లంచం మొత్తం 200 మిలియన్ డాలర్స్ గా, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్స్ సంకేతాలు ఇచ్చారు అని తెలిపారు.
అదానీపై అభియోగాలు ఇలా..
అదానీపై రెండు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. ఒకటి అమెరికా న్యాయ విభాగం, రెండోది అమెరికా స్టాక్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్. ఈ రెండు సంస్థలు చేస్తున్న అభియోగాలు ఒకటే కాని భిన్నమైనవి. తమ దేశంలో తప్పుడు సమాచారంతో… వాస్తవాలను మరుగుపర్చి వేల కోట్ల రూపాలను అదానీ కంపెనీ సమీకరించిందనేది రెండు సంస్థల ప్రధాన అభియోగం.
అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో కూడా ముడుపులు, లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేయడం, కాంట్రాక్ట్‌లు పొందడం చట్ట విరుద్ధం. అలాంటి పనులు చేసే కంపెనీ, లంచాలు ఇవ్వడమే కాదు. అందుకోసం తమ దేశ ఫోన్లను, వ్యవస్థలను వాడుకున్నా కేసు పెడతారు. ఇందులో మన దేశంలో మాదిరిగా పోలీసులు ఒత్తిళ్లు, సిఫార్సులకు లొంగరు.
ముందుగా స్టాక్స్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగం ప్రకారం.. గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేష్ అదానీలు కలిసి, అదానీ గ్రీన్ అనే కంపెనీని భారత్‌లో నెలకొల్పారు. కొన్నేళ్ళకు రాజేష్ అదానీ కుమారుడు సాగర్ అదానీ కంపెనీలో చేరాడు. ఈ కంపెనీ తమ వ్యాపార విస్తరణ కోసం అమెరికాలో బాండ్ల జారీ ద్వారా 75 కోట్ల డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ బాండ్స్‌ను నోట్స్ అని కూడా అంటారు.
ఈ నోట్స్‌ను 2021 సెప్టెంబర్‌లో అమ్మారు. దీని కోసం అమెరికాలోని పలు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. సాధారణంగా నిధుల సమీకరణ సమయంలో కంపెనీలు ఈ రోడ్ షోలను నిర్వహించి, ఆసక్తిగత ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తారు. తమ కంపెనీ గొప్పతనం వివరించి నిధులు సమీకరిస్తారు. అలాగే నిధులు సమీకరించింది అదానీ గ్రీన్.
ముడుపులతో అదానీ కాంట్రాక్ట్‌లు..
అయితే అమెరికా అధికారులు జరిపిన దర్యాప్తులో , అదానీలు ముడుపులతో కాంట్రాక్ట్‌లు పొందారని తేల్చారు. అంటే మోసపూరిత మాటలు, వాగ్ధానాలతో తమ ఇన్వెస్టర్లను మోసం చేశారని స్టాక్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. ముడుపులు గురించి పూర్తి వివరాలను తమ అభియోగ పత్రంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అధికారులకు.. విద్యుత్ సరఫరా కాంట్రాక్ట్‌లు పొందారని, అయితే అధిక ధరకు సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లను ఒప్పించారన్నది ప్రధాన ఆరోపణ.
జగన్మోహన్ రెడ్డికి భారీ మొత్తం..
దీని కోసం డిస్కమ్ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారీ మొత్తం అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఏపీ సీఎంకు ఇచ్చిన/ఇవ్వబోయే లంచాల గురించి అదానీ ఎనర్జి, మరో విద్యుత్ కంపెనీ అజూర్ పవర్ మధ్య సాగిన కమ్యూనికేషన్స్‌లో బయటపడిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.
అజూర్ పవర్ కంపెనీ కూడా..
అజూర్ పవర్ కంపెనీ కూడా విద్యుత్ కాంట్రాక్ట్‌ల కోసం లంచాలు ఇచ్చింది. అదానీ కుదర్చిన డీల్స్‌లో వీరికి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మారిషస్ కంపెనీలో కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్స్ పెట్టుబడి పెట్టాయి. పైగా ఈ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయి ఉంది. 2023 నవంబర్ వరకు లిస్టింగ్‌లో ఉన్నట్లు తేలింది. అంటే లిస్టింగ్ కంపెనీ విదేశాల్లో లంచాలు ఇచ్చిందన్నమాట. ఇది కూడా అమెరికా చట్టాలకు విరుద్ధం.
ఇక అమెరికా న్యాయ శాఖ మరో అభియోగ పత్రం దాఖలు చేసింది . ఎఫ్బీఐతో విచారణ జరిపించి… ఆధారాలతో సహా ఈ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి 200 కోట్ల డాలర్లను, బాండ్లను అమ్మి మరో 100 కోట్ల డాలర్లను అదానీ కంపెనీ సేకరించిందని న్యాయ శాఖ ఆరోపించింది. లంచాలు, ముడుపులకు తాము వ్యతిరేకమని చెప్పి, అదానీ కంపెనీ నిధులను సమీకరించిందని అభియోగ పత్రంలో పేర్కొంది. అయితే తాము జరిపిన దర్యాప్తులో అదానీలు రూ. 2000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని తెలిపింది.
అందులో రూ. 1750 కోట్ల లంచం సంబంధించి అప్పటి ఏపీ సీఎంకు, అదానీ మధ్య చర్చలు జరిపినట్లు పేర్కొంది. అదానీ స్వయంగా ఏపీకి వచ్చి డీల్ చేసుకున్నారని, ఆ తరవాత అహ్మదాబాద్‌లో జరిగిన అదానీ గ్రీన్ బోర్డు సమావేశంలో ఈ లంచాల ప్రస్తావన వచ్చిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కంపెనీల అధికారులకు కూడా అదానీలు లంచాలు ఇచ్చారని తెలిపింది.
అయిదు నేరాలు ఎఫ్‌సీపీఏ సహా, మొత్తం అయిదు రకాల నేరాల కింద అదానీలపై కేసులు నమోదు అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నిధులు సమీకరించడం,..రెండోది తమ దేశ ఇన్వెస్టర్లను మోసం చేయడం. మూడో అభియోగం తమ టెలికాం వ్యవస్థను దీని కోసం వాడటం. 2021 144A బాండ్ల జారీ అంశంలో సెక్యూరిటీ యాక్ట్‌ను ఉల్లంఘించడం. చివరి అభియోగం దర్యాప్తుకు విఘాతం కల్గించడం.
నిధుల సమీకరణ విషయంలో అదానీ గ్రూప్ వ్యక్తులు తమ దేశ ఇన్వెస్టర్లను మోసం చేశారన్నది అమెరికా ఆరోపణ. దీని కోసం తమ వ్యవస్థలను ఉపయోగించారని, దీనిపై చర్యల కోసం చార్జిషీటు వేశారు. అయితే తమ ఇన్వెస్టర్లను ఎలా మోసం చేశారో వివరించే క్రమంలో ముడుపులు వ్యవహారాన్నిన్యాయ శాఖ ప్రస్తావించింది . అందులో అప్పటి ఏపీ సీఎం గురించి ప్రస్తావించింది. దానికి సంబంధించిన ఆధారాలను కేసులో ప్రస్తావించింది. నిజంగా జగన్మోహన్రెడ్డి లంచాలు తీసుకున్నారా? తీసుకుంటే ఎలా తీసుకున్నారు? ఆ మొత్తం ఎక్కడ ఉంది? వంటి అంశాలను భారత అధికారులు తేల్చాల్సి ఉంది.
అదానీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన కెన్యా
అమెరికా షాక్ నుంచి అదానీ ఇంకా కోలుకోకముందే కెన్యా మరో షాక్ ఇచ్చింది. తమ దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన అదానీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కెన్యాలో ట్రాన్స్ మిషన్ లైన్లు వేసేందుకు అదానీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు.
70 కోట్ల డాలర్లు అంటే రూ. 6000 కోట్ల కాంట్రాక్ట్ అదానీ చేతి నుంచి చేజారింది. అదానీతో కుదుర్చుకున్న,కుదుర్చుకోనున్న కాంట్రాక్టులను రద్దు చేయాల్సిందిగా ఇంధన వనరుల శాఖ, పెట్రోలియం శాఖతో పాటు రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో.. కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు అదానీతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాల్సి ఉంది. మరి చేస్తుందా? లేదా? అదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.
ఇప్పటికీ ఆ ఇం‘ధన’ అధికారికే అందలం
కాగా జగన్ జమానాలో ఏపీ ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సమయంలో.. ఇంధన శాఖలో కీలకపాత్ర పోషించిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారే, ఇంకా కూటమి సర్కారులోనూ అదే శాఖలో చక్రం తిప్పుతున్నారన్న చర్చ సోషల్‌మీడియాలో జరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఇంధన శాఖలో చక్రం తిప్పే సదరు అధికారి.. అదానీతో ఒప్పందంలోనూ కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. సహజంగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తుంటారు. కానీ ఆయన మాత్రం అదే ఇం‘దన’ శాఖలో ‘ఆనందం’గా కొనసాగడమే విచిత్రం. విద్యుత్ శాఖకు చెందిన కీలక అంశాల్లో మీడియేషన్ చేసి, పైవారిని ‘సంతృపి’్తపరిచి, పాలకుల మెప్పు పొందడమే ఆయన ‘విజయ’రహ్యస్యమన్నది సీనియర్ ఐఏఎస్ అధికారుల ఉవాచ.
తాజాగా జగన్ బినామీ కంపెనీగా విపక్షంలో ఉన్నప్పుడు.. టీడీపీ-బీజేపీ ఆరోపించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థపై, ఇప్పటివరకూ ఈగ కూడా వాలలేదంటే సదరు అధికారి మహత్యమేనన్న ఆరోపణలు లేకపోలేదు. కెనడా కంపెనీకి అమ్మనున్న ఈ కంపెనీ నుంచి రెండువేల కోట్ల రూపాయల ముడుపులు, అందరికీ సర్దుబాటు చేసే బాధ్యతను సదరు అధికారే తీసుకున్నారన్న ప్రచారం, గత కొద్దిరోజుల నుంచి ఇంటా బయట రచ్చగా మారింది. అన్నట్లు ఈ అధికారి ‘విజయ’పరంపరలో భాగంగా.. త్వరలో సీఎస్ కూడా అయ్యేందుకు, రంగం సిద్ధమయింద న్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. మరి అదానీతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన ఈ అధికారిని ఇం‘ధన’శాఖ నుంచి తొలగిస్తారా? లేదా అన్నది చూడాలి.