– ప్రాంతీయ పార్టీలదే హవా అని మాట మార్చిన కేసీఆర్
– టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చిన వైనం
– జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామన్న ప్రకటనలు
– మహారాష్ట్ర, కర్నాటకలో కేసీఆర్ పర్యటనలు
– మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో కూడా పోటీ
– ఇప్పుడు మళ్లీ ప్రాంతీయ రాగం
– కేసీఆర్ ప్రకటనల వెనుక ఎన్నికల కలవరమే కారణమా?
– గతంలో బాబు భుజంపై పెట్టి కాంగ్రెస్‌ను పేల్చిన కేసీఆర్
– ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో ఏం పని అని సెంటిమెంటు రగిలించిన కేసీఆర్
– కాంగ్రెస్ గెలిస్తే అమరావతి ఆదేశాలు పాటించాలని కేసీఆర్ ప్రచారం
– గత ఎన్నికల్లో పేలిన కేసీఆర్ ఆంధ్రా స్లో‘గన్’
– ఇప్పుడు మళ్లీ వ్యూహాత్మంగా కేటీఆర్ కన్నడ సెంటిమెంటు
– కాంగ్రెస్ గెలిస్తే బెంగళూరు ఆదేశాలు పాటించాలంటూ ప్రచారం
– హైదరాబాద్ కంపెనీలు బెంగళూరుకు పోతాయంటూ కేటీఆర్ ట్వీట్
– ఆ మేరకు ఒక సర్క్యులర్‌ను సోషల్‌మీడియాలో వదిలిన బీఆర్‌ఎస్
– దానిని ఖండించడంతో కిక్కురుమనని బీఆర్‌ఎస్
– నాడు ఆంధ్రా-నేడు కన్నడ సెంటిమెంట్‌తో గ ట్టెక్కే ఎత్తుగడ
– ఏపీ-మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ శాఖలు ప్రకటించిన బీఆర్‌ఎస్
– బీఆర్‌ఎస్ ప్రారంభసభలో జాతీయ భావన కావాలన్న కేసీఆర్
– పార్టీ పేరులో తెలంగాణ తొలగించిన వైనంపై వెల్లువెత్తిన విమర్శలు
-తెలంగాణతో పేరు-పేగు బంధం పోయిందన్న తెలంగాణ ఉద్యమ నేతలు
– మళ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రేపే ఎత్తుగడ
– చేసిన అభివృద్ధి చెప్పుకోలేని బీఆర్‌ఎస్ వైఫల్యం
– సెంటిమెంట్‌పైనే బీఆర్‌ఎస్ ఆధారపడిందా?
– చేసిన అభివృద్ధి చెప్పలేకపోతున్నారా?
– బీఆర్‌ఎస్‌ది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
– తెలంగాణ సెంటిమెంటు పనిచేయదన్న పీసీసీ నేత అయోధ్యరెడ్డి
– రేపటి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ అవినీతిపైనే తీర్పని స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న సామెతను బీఆర్‌ఎస్ అధినేత-తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామంటూ దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలను పిలిచి, సమావేశాల పేరంటాల హడావిడి చేసిన కేసీఆర్.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రాంతీయ రాగం ఆలపిస్తున్నారు.జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఈసారి రైతు రాజ్యం అని మహారాష్ట్రలో నినదించిన కేసీఆర్, తెలంగాణ కార్డును మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. కారణం ఏమిటి? ఎన్నికల కలవరమా? కాంగ్రెస్‌కు పెరుగుతున్న సానుకూల పవనాల ప్రభావమా? లేక పార్టీ జాతీయ పార్టీ స్థాపించి తప్పు చేశానన్న భావనా? ఆమేరకు దాని దిద్దుబాటు చర్యలా?
పదేళ్ల క్రితం తెలంగాణ సెంటిమెంట రగిలించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్, ఆ తర్వాత బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. పార్టీలో తెలంగాణ పేరును అంతర్ధానం చేసి, దాని స్ధానంలో భారత్‌ను చేర్చింది. ఇది రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రంగా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్ పాత తెలంగాణ సెంటిమెంటునే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు భుజంపై తెలంగాణ తుపాకీ పేల్చిన టీఆర్‌ఎస్… ఇప్పుడు డికె శివకుమార్ భుజంపై, మళ్లీ తెలంగాణ తుపాకీ పేల్చే ఎత్తుగడకు తెరలేపింది.
షర్మిల-పవన్.. చివరకు తెలంగాణ ఉద్యమ నిర్మాత కోదండరామ్ సారును కూడా, తెలంగాణ వ్యతిరేకులుగా ఎందుకు ముద్ర వేస్తోంది? తనకు మద్దతునివ్వని పార్టీలను.. ఇతర పార్టీలకు మద్దతునిచ్చే వారిని తెలంగాణ ద్రోహులు-తెలంగాణ వ్యతిరేకులనే ప్రచార అస్త్రాన్ని..కేవలం ఎన్నికల సమయంలోనే బీఆర్‌ఎస్ దేనికి ప్రయోగిస్తోంది? అసలు పార్టీలోనే తెలంగాణ బంధం లేని బీఆర్‌ఎస్, ఏ అర్హతతో మళ్లీ సెంటిమంట రగిలిస్తోంది? అప్పుడు ఆంధ్రా.. ఇప్పుడు కర్నాటక. నినాదం ఒక్కటే. ప్రాంతాలే వేరు. ఫలితంగా ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోలేని నిస్సహాయత.
గతంలో కాంగ్రెస్ గెలిస్తే అమరావతి ఆదేశాలు పాటించాలన్న టీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, బెంగళూరు ఆదేశాలు పాటించాలన్న కొత్త ప్రచారానికి తెరలేపింది. మరి బీఆర్‌ఎస్ జాతీయ విధానం ఏమైంది? మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో ఏ అర్హతతో పోటీ చేసింది?
కేటీఆర్ నుంచి కవిత వరకూ మళ్లీ.. ‘బక్కపలచని కేసీఆర్‌పై దాడి.. ఢిల్లీ నుంచి మిడతలదండులా తెలంగాణకు వస్తున్నారు.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు’ అనే పడికట్టు సెంటిమెంటు పదప్రయోగాలు సంధిస్తోంది. నాలుగున్నరేళ్లు వీటి గురించి మాట్లాడని బీఆర్‌ఎస్.. ఎన్నికల వేళ మళ్లీ పాత ఘట్టాలు గుర్తు చేయడంలో మతలబేమిటి?
ఏపీ-మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అధ్యక్షులను ఎందుకు నియమించింది? అంటే ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీనా? జాతీయ పార్టీనా? ఈ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ కార్డును ఎందుకు ప్రయోగిస్తోంది? అసలు పార్టీలోని తెలంగాణ పదాన్నే తొలగించిన బీఆర్‌ఎస్.. మళ్లీ ఇప్పుడు అవసరార్ధం ఎందుకు తెలంగాణ కార్డు వాడుతోంది? రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలంగాణతో పేగుబంధం-పేరు బంధం తెగిపోయిన బీఆర్‌ఎస్, ఎందుకు మళ్లీ తెలంగాణ కార్డును తెరపైకి సంధిస్తోంది? అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా, ఇంకా కేసీఆర్ అండ్ కో సంధిస్తున్న తెలంగాణ సెంటిమెంటు అస్త్రం ఫలిస్తుందా?.. ఇదీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్!
జాతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్ ఎన్నికల ముందు మళ్లీ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలదే హవా అని ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఖమ్మం జిల్లా వేదికగా కుండబద్దలు కొట్టారు. దానితో ఇక బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ నుంచి, తిరిగి ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరిందన్న సంకేతాలు కేసీఆర్ మాటల్లో స్పష్టమయింది.
అటు కేటీఆర్-హరీష్‌రావు-కవిత సైతం.. ఎన్నికల వేళ మళ్లీ తెలంగాణ కార్డును వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన షర్మిల.. చివరకు కాంగ్రెస్‌కు మద్దతుప్రకటించిన తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్‌ను సైతం, తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసే వ్యూహాలకు తెరలేపడం చర్చనీయాంశమయింది.
అయితే… తెలంగాణ వచ్చేందుకు కారణమైన కోదండరామ్‌ను సైతం, తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయడాన్ని తెలంగాణ సమాజం సహించలేకపోతోంది. తెలంగాణ వచ్చేందుకు అహర్నిశలు కష్టపడి, కాళ్లకు బలపాలు కట్టుకుని తెలంగాణలో పర్యటించి, యావత్ తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించిన కోదండసార్‌ను కూడా తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే వ్యూహం బీఆర్‌ఎస్‌కే బూమెరాంగవుతుందని తెలంగాణ ఉద్యమ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా కోదండరామ్‌ను విమర్శిస్తే తెలంగాణ సమాజం చెప్పుతో కొడుతుందని, రేవంత్ చేసిన హెచ్చరిక చర్చనీయాంశమయింది.
తాజాగా కేటీఆర్ గత కొద్దిరోజుల నుంచి కన్నడ-తెలంగాణ సెంటిమెంటును తెరపైకి తీసుకురావడం ద్వారా.. తెలంగాణ సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, హైదరాబాద్‌లోని కంపెనీలను బెంగుళూరుకు తరలించే కుట్రకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆమేరకు దానికి సంబంధించి కర్నాటక మంత్రి ఒక కంపెనీకి రాసిన లేఖను, సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. అయితే దానిపై ప్రజలు పెద్దగా ఆసక్తిచూపినట్లు కనిపించలేదు.
వెంటనే అసలు తాము ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదంటూ, క ర్నాటక ప్రభుత్వం ఆ ఫేక్ లెటర్‌పై కేసు పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, బెంగళూరు ఆదేశాల కోసం ఎదురుచూడాలన్న కొత్త వాదాన్ని కేటీఆర్ తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సరిగ్గా ఇలాంటి నినాద ఎత్తుగడనే టీడీపీ-కాంగ్రెస్‌పై సంధించి సక్సెస్ అయింది. ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో ఏం పని? కాంగ్రెస్ గెలిస్తే అమరావతి అనుమతి, ఆదేశాల కోసం ఎదురుచూడాలా? అన్న ప్రశ్నలు సంధించి, తెలంగాణ సెంటిమెంటుతో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసింది. ఇప్పుడు ఆంధ్రా బదులు కన్నడ నినాదాన్ని తెరమీదకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి పూర్వ టీఆర్‌ఎస్… తన పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి భారత్‌ను చేర్చిన క్రమంలో, తెలంగాణవాదుల విమర్శలకు గురైంది. తెలంగాణతో ఆపార్టీకి పేరు బంధం-పేగుబంధం తెగిపోయింది. ఇక తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ పితామహుడైన కోదంరామ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ఉద్యమ సంస్థలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడిచేశాయి.
పైగా ఇప్పుడు టీడీపీ కూడా ఎన్నికల బరిలో లేదు. కాబట్టి ఆంధ్రా సెంటిమెంట్‌ను ప్రయోగించే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలపై ఏం మాట్లాడినా, బూమెరాంగయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే వ్యూహం మార్చి, ఈసారి కర్నాటకపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, తెలంగాణ ఎన్నికల బాధ్యతను అక్కడి మంత్రి డికె శివకుమార్ పర్యవేక్షిస్తుడటంతో.. కేసీఆర్ కుటుంబం దృష్టి కర్నాటక వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. అయితే గతంలో ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంటు మాదిరిగా, ఈసారికర్నాటక-తెలంగాణ సెంటిమెంటు అస్త్రాన్ని, తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
అయితే.. కేసీఆర్ గత పదేళ్లలో సాధించిన ప్రగతి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం బదులు.. మళ్లీ సెంటిమెంట్‌ను రగిల్చే ఎత్తుగడకు తెరలేపడంపైనే విస్మయం వ్యక్తమవుతోంది. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే, పార్టీకే నష్టమని బీఆర్‌ఎస్ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా, ఇంకా తెలంగాణవాదాన్ని వినిపిస్తే ప్రజలు నమ్మరు-పట్టించుకోరని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ‘సెంటిమెంటు రగిలించకపోతే, బీఆర్‌ఎస్ గెలవలేదన్న భావన’ ప్రజల్లో ఉందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా తెలంగాణ ఉద్యమకారులంతా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీల్లో చేరిన విషయాన్ని విస్మరించకూడదంటున్నారు. నిజానికి రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నామని, వాటి గురించి ప్రచారం చేస్తేనే సానుకూల ఫలితాలుంటాయని స్పష్టం చేస్తున్నారు.
కాగా బీఆర్‌ఎస్ సెంటిమెంటు రాజకీయాలపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ‘ మొన్నటివరకూ జాతీయవాదం, జాతీయ భావన అంటూ మేధావి కబుర్లు చెప్పి, దేశంలోని ప్రాంతీయ పార్టీలనేతలు పిలిచిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ ప్రాంతీయపార్టీ పాట పాడుతున్నారు. అంటే ఆయనకు కాంగ్రెస్ అంటే ఏ స్థాయిలో వణుకు పుడుతుందో అర్ధమవుతుంది. ఎన్నికల్లో మేనిఫెస్టో-పథకాల ప్రాతిపదికన చర్చించి-ప్రచారం చేసుకునే దమ్ము కేసీఆర్‌కు లేదని మళ్లీ రుజువైంద’ని పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి విమర్శించారు.
ఆంధ్రా కార్డు-కర్నాటక కార్డు వాడితే తప్ప గెలిచే దిక్కు లేదని తాజా వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి. కేసీఆర్‌కు తెలిసిందల్లా సెంటిమెంటు రగిలించి బతకడమే. కానీ తెలంగాణ సమాజం తెలివైనది. పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించిన కేసీఆర్‌కు ఇక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కులేదు. కేసీఆర్ ఫ్యామిలీకి దమ్ముంటే ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి-అవినీతిపై చర్చకు రావాల’ని పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి సవాల్ చేశారు.
కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక వైపు చూడాలంటున్న కేటీఆర్.. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఆదేశాల కోసం ఎదురుచూడటం లేదా? ఢిల్లీ నుంచి కాంగ్రెస్ మిడతల దండు వస్తోందంటున్న బీఆర్‌ఎస్.. కేసీఆర్ ఫ్యామిలీ మిడతలదండుగా తెలంగాణపై పడి ప్రచారం చేయడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీ తెరపైకి తెస్తున్న సెంటిమెంటు రాజకీయం ఫలించదు. రేపటి ఎన్నికలు కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు- ప్రజాస్వామ్యానికి మధ్య జరిగేవి. అందులో ప్రజలే విజేతలు అని స్పష్టం చేశారు.
‘ ఇంతకూ బీఆర్‌ఎస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీ అయితే మహారాష్ట్ర, ఆంధ్రాలో పార్టీ అధ్యక్షులను ఎందుకు నియమించారు? జాతీయ పార్టీ అయితే కర్నాటక రాష్ట్రాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో దమ్ముంటే చెప్పాలి. అసలు కేసీఆర్‌ది ప్రాంతీయ వాదమా? జాతీయ వాదమా? స్పష్టం చేయాల’ని అయోధ్యరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది అవకాశవాదమేనని స్పష్టం చేశారు.