Suryaa.co.in

Andhra Pradesh

అవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ పై పోలీసుల చర్యలేవీ?

-ఆనాడు కోడికత్తి-నేడు రాయి డ్రామా
-మరొక అమాయకుడు బలికాబోతున్నాడా?
-షర్మిల కూడా జాగ్రత్తగా ఉండాలి
-వెల్లంపల్లి మహా నటుడు
-వెల్లంపల్లి శ్రీనివాస్ తన కన్ను జాగ్రత్తగా చూసుకోవాలి
-జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాల్ని రక్షించుకోజూసినట్లు జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఛలోక్తులు విసిరారు.

ప్రజలు జగన్ ను గద్దె దించుతున్నారని అతనికి తెలుసు
నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఏది దొరికితే అది పట్టుకొని బ్రతికి బయట పడాలనుకున్నట్లు ఈనాడు జగన్ పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు జగన్ ని గద్దె దించుతున్నారనే విషయాన్ని జగన్ తెలుసుకున్నాడు. ఎన్ని జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజల్ని భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని జగన్ తాపత్రయపడుతున్నాడు. అందులో భాగమే ముఖ్యమంత్రిపై రాయి దాడి.

ఐదు సంవత్సరాల క్రితం కోడికత్తి డ్రామా ఆడి లబ్ది పొందిన జగన్ నేడు ఈ రాయి డ్రామా ఆడుతున్నాడు. వేలాదిమంది పోలీసులుండగా ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నించే సాహసం ఎవరైనా చేస్తారా? అదీ ఒక చిన్న రాయితో. ఎక్కడైనా రాయి తగిలి జారి కింద పడుతుందిగానీ, పక్కవాడికి కూడా తగలడం విచిత్రంగా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ తన కన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే జగన్ ఆడుతున్న ఈ డ్రామాలో నిజంగా కన్ను పోయే ప్రమాదముంది.

అవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ పై పోలీసుల చర్యలేవీ?
నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందని అవుతు శ్రీధర్ రెడ్డి అనే నేరస్థుడు ట్వీట్ చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అతను చెప్పినట్లే జగన్ పై ‘‘హత్యా యత్నం’’ అనే సంచలనాత్మకమైన డ్రామా జరిగింది. ఇది నారా రూప రాక్షసుడి పని అని చంద్రబాబుకు అంటగడుతున్నారు. సంఘటన జరిగిన 10 నిమిషాల్లో నారా రూప రాక్షసుడి పని అని ప్లకార్డులతో ధర్నా చేశారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అని అర్థమౌతోంది. ఇది వైసీపీ డ్రామా కాదా? రాయి డ్రామా ఆడబోతున్నారని జగన్ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందికి ముందే తెలుసు. అందుకే రాయి వచ్చేటప్పుడు భద్రతా సిబ్బందితో పాటు అందరూ కూర్చున్నారు.

కోడికత్తి శీనులా మరొక అమాయకుడు బలికాబోతున్నాడా?
ముఖ్యమంత్రిపై హత్యా యత్నం చేసింది వీడే అని ఒక అమాయకుడిని చూపించి.. అతన్ని కోడికత్తి శీనులా జైల్లో మగ్గబెడతారేమో? వెంటనే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల అధికారి మీనా వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయనున్నాం. సీబీఐ దర్యాప్తు చేస్తేనే జగన్, వారి బృందం ఆడిన ‘రాయితో హత్యాయత్నం’ అనే డ్రామా బయటపడుతుంది. ముఖ్యమంత్రి ఒక్కడినే పైన నిలబెట్టి, చీకట్లో సెక్యురిటి ఆఫీసర్లు ఎవరైనా కూర్చుంటారా? ఇదంతా డ్రామా కాదా? షర్మిల కూడా జాగ్రత్తగా ఉండాలి అని నా అభిప్రాయం. ఆనాడు బాబాయినే వేసేశారు… ఇప్పుడు షర్మిలను కూడా వేసేస్తారేమో. ఎంతకాలం మీరు రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతారు, మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారూ!

జగన్ అధికార దాహానికి కోడికత్తి శీను బలయ్యాడు, ఇప్పుడు రాయి కేసులో మరో అమాయకుడు బలికాబోతున్న విషయం వాస్తవం కాదా? ఇది హత్యా యత్నం కాదు, ముఖ్యమంత్రిని గాయపరచాలన్న ఉద్దేశం ఎవరికి లేదు, ఇది కేవలం ఆయన ఆడిన డ్రామా మాత్రమే.

ఎవరైనా చంపాలనుకుంటే చిన్న రాయి విసురుతారా?
ఎవరైనా చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడా? ఇదెక్కడైనా సాధ్యమా? అంత పెద్ద రక్షణలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రిపై ఓ చిన్న రాయి వచ్చి పడితే అది హత్యాయత్నం అవుతుందా? నాకు దర్యాప్తుల గురించి, పోలీసు వ్యవస్థ గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంది. చిన్న రాయితో చంపే ప్రయత్నం చేశాడని ఎక్కడా వినలేదు. కోడికత్తితో కుడి భుజం మీద పొడిచి మనిషిని చంపడం సాధ్యం కాదు. అయినా అది హత్యాయత్నమని పెద్ద కథలా మార్చారు.

వెల్లంపల్లి మహా నటుడు
వెల్లంపల్లి శ్రీనివాస్ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద దెబ్బతగిలినట్లు డ్రామా ఆడారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కంటిమీద పెద్ద దెబ్బ ఏమీ కనపడలేదు. తెల్లారేసరికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ వేశారు. జగన్ తో వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు హత్యాయత్నం అన్నా నేను మాత్రం ఇది చిన్న సంఘటన మాత్రమే అంటాను. డీజీపీ ఒక మౌన మునిలా వ్యవహరిస్తున్నారు. సీతారామాంజనేయులు సమాధానం చెప్పాలి.

విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా తాతను ప్రశ్నిస్తున్నాను. సంఘటన జరిగిన పది నిమిషాల్లో నారా రూప రాక్షసుడనే ప్లకార్డులు ఎక్కడ నుంచి వచ్చాయి? సంఘటన జరగ్గానే ట్వీట్ ల మీద ట్వీట్లు, ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు పెట్టారంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ లు వారి పనిలో వారు ఉండి ప్రచారాలు చేసుకుంటుంటే వారి మీద పడి ఏడవడమేంటి? రాష్ట్ర ప్రజలు అమాయకులని అనుకోకండి.

ఆనాడు కోడికత్తి-నేడు రాయి డ్రామా
ఆనాడు కోడికత్తి తనకు తగలబోతోందని ముందే తెలుసు. రాయి పడబోతోందని ఈనాడు ముఖ్యమంత్రికి ముందే తెలుసు. లోకల్ పోలీసులు దర్యాప్తు జరిగితే న్యాయం జరగదు. ఒక అమాయకుడు బలౌతాడు. ఆయేషామీరా కేసులో సత్యంబాబు అనే అమాయకుడు బలయ్యాడు. కోడికత్తి కేసులో శీను అనే అమాయకుడు బలయ్యాడు. ఇప్పుడు మరో అమాయకుడు ఇలా బలి కావాల్సిందేనా? ఏ అమాయకుడిని కూడా బలిచేయొద్దని టీడీపీ తరపున కోరుకుంటున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE