ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిక్కు మొక్కు లేని అనాథ బ్రాండ్లతో ప్రభుత్వమే ప్రజలను ముఖ్యంగా పేదలను ఆర్థికంగా దోపిడీ చేస్తూ.. అనారోగ్యం పాలు చేస్తున్న వైనాన్ని ఆధారాలతోసహా నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు గతంలోనే కేంద్ర ప్రజారోగ్య విభాగం అధికారులకు, ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయకు ఫిర్యాదు చేశారు.
తాజాగా మద్యం అమ్మకాల విషయంలో ప్రధాని మానసిక పుత్రిక అయిన డిజిటల్ పేమెంట్స్‌కు స్వస్తి చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం క్యాష్ పద్దతిలోనే మద్యాన్ని విక్రయిస్తుండటం వెనుక భారీ ఆర్ధిక నేరం దాగి ఉందని ఆయన మరో ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి ప్రధాని, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వెళ్లటంతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బ్రాండ్లు, రేట్లు, అమ్మకాల విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక సిద్ధం చేయటానికి రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఈ విషయంపై ప్రధాని దృష్టి సారించారు అనే సంకేతాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్వీయ రక్షణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే మద్యం ధరలను 5 నుంచి 20 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటమే కాక, మార్కెట్లో పేరున్న బ్రాండ్ మద్యాన్ని కూడా ప్రభుత్వ వైన్ షాప్‌లలో అమ్మకానికి పెట్టనుంది. ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్‌పై కూడా ఓ నిర్ణయం తీసుకోవాలిని భాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి స్వంత ఎంపీనే ప్రభుత్వాన్ని మడమ తిప్పేలా చేయడంతో పార్టీ పెద్దలు సైతం కొరివితో తల గోక్కున్నామా అనే డైలమాలో పడిపోయారు. కేంద్రంలో తన పరపతి రఘురామకృష్ణంరాజు పరిచయాల ముందు తేలిపోవటంతో రఘురామరాజుకు మోకాలడ్డటానికి ఓ ఎంపీ చేసిన అతి వల్లే అధ్యక్షునికి, రఘురామరాజుకు మధ్య దూరం పెరిగిందని, ఆ ఎంపీ ఇగోకు పోయి పార్టీని ఇరుకును పెట్టేశాడని, ఆయన వైఖరి వల్ల మనలో ఒకడిగా ఉండాల్సిన రఘురామరాజు.. తానొక్కడే ఒకవైపు.. పార్టీ మొత్తం ఒకవైపు అన్నట్లుగా పరిస్థితిని మార్చేశాడని ఆంతరంగిక సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తన పలుకుబడిని ఉపయోగించి ఇంకెన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాడో అర్ధం కావటం లేదని ఆఫ్ ది రికార్డ్‌గా మాట్లాడుకుంటున్నారు.