Home » ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి

ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి

– విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని సీఎంకు లోకేష్ లేఖ

గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి
విషయం:AP EAPCET విద్యార్థుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో తీవ్ర నిర్లక్ష్యం – సాంకేతిక సమస్యలు, అసంబద్ధ విధానాలు- విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేయడం – ప్రభుత్వం విద్యార్థుల ఫిర్యాదులను విస్మరించడం – విద్యార్ధి సమస్యల త్వరిత పరిష్కారం – కోసం AP EAPCET 2021 లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు కళాశాలల్లో అడ్మిషన్ల కొరకు ఇటీవల కౌన్సెలింగ్ జరిగింది. ప్రతీ ఒక్క విద్యార్థి అడ్మిషన్ పొందాలనే ఉద్ధేశంతో కౌన్సెలింగ్ సాధారణంగా 3 రౌండ్‌లలో నిర్వహించబడుతుంది. ముదటి దశలో అడ్మిషన్‌ పొందకపోతే రెండవ దశ, రెండవ దశలో రాకపోతే మూడవ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

మూడు దశలలలో కౌన్సిలింగ్ జరిపితే ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద సీటు పొందలేని కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మిగిలి ఉంటారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని చూస్తున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఈ ఏడాది ఈ ప్రక్రియ తారుమారు చేయబడిందని వ్రాయడానికి నేను చింతిస్తున్నాను.

మొత్తంగా, ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్, స్పోర్ట్స్, NCC కోటాల కింద 1,12,932 సీట్లు కేటాయించబడ్డాయి. లెక్కల ప్రకారం, AP-EAPCET 2021 పరీక్షలో 1.34 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో మొదటి రౌండ్‌లో 90,606 మంది విద్యార్థులు అడ్మిషన్ కొరకు కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకోగా, 2వ రౌండ్‌లో 1533 మంది నమోదు చేసుకున్నారు.

మొదటి రౌండ్‌లో 80,935 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, రెండవ రౌండ్‌లో 3435 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇలా ప్రభుత్వ కోటా కింద 1,12,932 సీట్లకు గాను 84,370 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కన్వీనర్, స్పోర్ట్స్, ఎన్‌సిసి కోటాలో 28000 సీట్లు కు పైగా ఖాళీగా ఉన్నప్పటికీ, ఇంకా ఏ సీటు పొందని 7600 మంది విద్యార్థులు ఉన్నారు.

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రకటించినప్పుడు ఇదే చివరి రౌండ్ కౌన్సెలింగ్‌ అని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే EWS విద్యార్థులు, వెబ్‌సైట్‌ సాంకేతిక లోపాల కారణంగా సీట్లు కేటాయించబడని విద్యార్థులు ఏం చేయాలో వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. విద్యార్థులు అనేక విధాలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ను సంప్రదించినప్పటికీ అధికారులు ఉదాసీనంగా, బాధ్యతారాహిత్యం గా వ్యవహరించారు.

విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు తిరస్కరించబడ్డాయి. అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎత్తి చూపిన సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదు. విద్యార్థులలో అనేక మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి వచ్చినవారు. EWS రిజర్వేషన్‌కు అర్హులైనప్పటికీ, వారు ఇప్పుడు మేనేజ్‌మెంట్ కోటా ద్వారా అడ్మిషన్లు పొందాలని, ఎక్కువ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఈ సమస్య యొక్క ఆవశ్యకతను పరిగణనలోకి తీసుకుని, విద్యా శాఖ నుండి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వ కోటాలో 28000 పైగా సీట్లు ఖాళీగా ఉన్నా ఇంకా 7600 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడం విడ్డూరం. వెబ్‌సైట్‌లో సీట్లు కేటాయించడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయా? అసలు ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను సమర్ధవంతంగా అమలు చేసిందా? అంతకుముందు సంవత్సరాల్లో అదే మార్కులతో కాలేజీలలో సీట్లు పొందినా 2021 విద్యార్థులు ఎందుకు పొందలేదు? స్పోర్ట్స్, ఎన్‌సిసి కోటాలను భర్తీ చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? 7600 మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు శీఘ్ర సమాధానాలు, మరీ ముఖ్యంగా శీఘ్ర పరిష్కారాలు అవసరం.

కావున, విద్యార్థుల తరపున, ప్రభుత్వం ముందు నేను ఈ క్రింది డిమాండ్లు ఉంచుతున్నాను:
1. ప్రభుత్వ కోటా సీట్లు (కన్వీనర్, స్పోర్ట్స్, ఎన్‌సిసి) భర్తీ అయ్యేలా బాధిత విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
2.సాంకేతిక లోపాలు లేకుండా, EWS రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా వెబ్‌సైట్ అప్డేట్ చేయాలి. EWS రిజర్వేషన్‌ను ఎలా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుందో తప్పనిసరిగా వివరించాలి.
3. విద్యార్థుల సమస్యలపై మరింత ప్రతిస్పందించేలా, విద్యార్థి-స్నేహపూర్వకంగా ఉండేలా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ విధి విధానాలు, ప్రోటోకాల్స్ ను సంస్కరించాలి.
పై డిమాండ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైతే విద్యార్థుల తరపున తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, తమ భవిష్యత్తును అణిచివేస్తుందని విద్యార్థులలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొంది. మీ సత్వర న్యాయమైన ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాను.

ఇట్లు,
నారా లోకేష్

Leave a Reply