Suryaa.co.in

Andhra Pradesh

తుఫాను బాధితులకు భోజనం పెట్టలేరా?

-తుఫాను పై ప్రభుత్వ సన్నద్ధతా లేదు….బాధితులకు సాయమూ లేదు
-బాధిత గ్రామాలలో పలువురితో నేరుగా ఫోన్ లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు
-కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచన
-హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో పరిహారం పెంచి సాయం చేశాం
-పెరిగిన సాగు ఖర్చులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు పరిహారం పెంచి అందించాలి
-టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్

అమరావతి: తుఫాను బాధితు ప్రజలకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదు….బాధితులకు సాయమూ లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుఫాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టేలేదని…ప్రభుత్వ స్పందన సరిగా లేదని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు చంద్రబాబుకు చెప్పారు.

తుఫాను ప్రభావంపై దాదాపు 12 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా….పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలి అని సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు దేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని….ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా….చేతలు గడప దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. దీనికి క్షేత్ర స్థాయి పరిస్థితులే నిదర్శనం అని మండిపడ్డారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా…ప్రజలను అలెర్ట్ చేయడంలో విఫలం అయ్యారని… వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి అన్నారు.

హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయం
విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించాం. హుద్ హుద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా నష్ట పరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలి.

తెలుగు దేశం హయాంలో విపత్తుల సమయంలో సాయం పెంచి ఎలా ఇచ్చిందీ….వైసీపీ ప్రభుత్వం ఎలా కోతలు పెట్టిందీ అనే విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

LEAVE A RESPONSE