-అభివృద్ధిచేసి మంగళగిరి ప్రజల మన్ననలు పొందుతా!
-ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా
-దుగ్గిరాల మండలం రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్
దుగ్గిరాల: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తమ్మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తా, ఎన్నికలతర్వాత పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం దుగ్గిరాల మండలం పెనుమూలి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే అయిదేళ్లలో మంగళగిరిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతా, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలకు సేవచేస్తా. అహర్నిశలు శ్రమించి మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనసు గెలుస్తా. 25సంవత్సరాలుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారు నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పదోవంతు చేయలేదు. నిమ్మకూరు తరహాలో మంగళగిరి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుచేసి మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా.
కృష్ణానది నుంచి పైప్ లైన్ ద్వారా 24గంటలూ ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా. మురుగునీరు పంటపొలాల్లో కలవకుండా చర్యలు చేపడతాం. మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రం మొత్తమ్మీద అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా సంకల్పం. గత ఎన్నికల్లో ఓడిపోయినా పట్టుదలతో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను. ఓటమి నాలో కసిపెంచింది, మంగళగిరి సొంతం అనుకొని సేవలందిస్తున్నా. మంగళగిరి రూపురేఖలు మార్చి నెం.1గా తీర్చిదిద్దే బాధ్యత నాది. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి, ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత గట్టిగా పోరాడి నియోజకవర్గానికి నిధులు తెస్తా.
పన్నులబాదుడుతో ప్రజల నడ్డివిరిచిన జగన్
ప్రజలకు పదిరూపాయలు ఇచ్చి వంద కొట్టేయడంలో జగన్ దిట్ట. అయిదేళ్లలో కరెంటు బిల్లులు 9సార్లు, ఆర్టీసి ఛార్జీలు 3సార్లు పెంచారు. పెట్రోల్,డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. యువగళం సందర్భంగా నేను రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్ర చేశా. ఆ సమయంలో నా దష్టికి వచ్చిన సమస్యలు చెప్పాక చంద్రబాబు, పవనన్న సూపర్ -6 పథకాలను ప్రకటించారు. ఎన్నికలయ్యాక వాటిని అమలుచేసి తీరుతాం.
జగన్ కు శవరాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. ఈనెలలో పెన్షన్లు సకాలంలో ఇవ్వకుండా 32మంది వృద్ధులను పొట్టనబెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ ను 4వేలకు పెంచుతాం. వాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా వారి ద్వారా అందిస్తాం. ముస్లింల విషయంలో వైసిపి తప్పుడు ప్రచారం నమ్మొద్దు. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగనీయలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక రంజాన్ తోఫా, దుల్హాన్ వంటి పథకాలను రద్దుచేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం, పలమనేరులో మిస్బాలను ఆత్మహత్యకు ప్రేరేపించారు. నర్సరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారు. మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. కుల,మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.
లోకేష్ దృష్టికి పెనుమూలి, చిలువూరు సమస్యలు
రచ్చబండ సందర్భంగా పెనుమూలి గ్రామస్తులు పలు సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక వడ్లమూడివద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అర్థంతరంగా నిలిపివేశారు. దీనిని పూర్తిచేసి హైలెవల్ చానల్ ను నిర్మిస్తే చిలుమూరు, కొండూరు, పెనుమూలి, కొలకలూరు గ్రామాల పరిధిలో 3400 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో 250 వచ్చే కరెంటుబిల్లు ఇప్పుడు 700 వస్తోంది.
బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం. పక్కాఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో మాల,మాదిగ శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి. మా గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. చిలువూరు గ్రామస్తులు తమ సమస్యలు చెబుతూ… గ్రామానికి రావడానికి వీలుగా రైల్వే ట్రాక్ వద్ద అండర్ పాస్ ఏర్పాటుచేయాలి. దళితవాటికకు స్థలం కేటాయించాలి. గ్రామంలో ప్రభుత్వ హైస్కూలు ఏర్పాటుచేయాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి.
నిమ్మ,సపోటా రైతులకు మద్దతు ధర కల్పించాలి. దీర్ఘకాలంగా బి.ఫాంలు ఉన్నవారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలి. దళితవాడలో ఇళ్లులేని వారికి ఇళ్లు నిర్మించాలి. గ్రామపొలాల్లో పాముకాట్లు అధికంగా ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగాలు కల్పించాలి. పదిపడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి వైద్యసేవలందించాలని కోరారు. గుంటూరు-విజయవాడల నుంచి చిలువూరుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు.
నారాలోకేష్ స్పందిస్తూ… అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వడ్లమూడి లిఫ్ట్ ఇరిగేషన్, హైలెవల్ ఛానల్ పనులను పూర్తిచేస్తాం. కౌలురైతులకు కూడా ఆర్థికసాయం అందేలా గత చట్టాన్ని అమలుచేస్తాం. జనాభా దామాషా ప్రాతిపదికన దళితుల శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం. మెరుగైన టెక్నాలజీతో ఇళ్లులేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెనుమూలి, చిలువూరు గ్రామాలకు ఆర్టీసి బస్ సౌకర్యం కల్పిస్తాం. చిలువూరు రైల్వేట్రాక్ వద్ద అండర్ పాస్ ఏర్పాటుచేస్తాం. పాముకాట్ల సమస్యను ప్రత్యేకంగా పరిగణించి నివారణకు చర్యలు తీసుకుంటాం. బి.ఫాం పట్టాలను రెగ్యులరైజ్ చేస్తాం. విద్యార్థుల సంఖ్యను బట్టి హైస్కూలు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు