Suryaa.co.in

Andhra Pradesh

జాతిపితలా విదేశీ విద్యకు జగన్ పేరుపెట్టుకున్నారు

తుమ్మపూడి రచ్చబండ సభలో నారా లోకేష్ ధ్వజం

దుగ్గిరాల: గత ప్రభుత్వంలో మేం విదేశీ విద్యకు అంబేద్కర్ పెడితే తీసేసి జాతిపితలా జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు, అధికారంలోకి విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్ పేరు పెడతామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవడానికి అహర్నిశలు కష్టపడ్డాను, ప్రజలు ఆశీర్వదిస్తే దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా చేసే బాధ్యత తీసుకుంటా. రూ.200 పెన్షన్ ను రూ.2వేలు చేసింది చంద్రబాబు, అన్న క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చింది, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకువచ్చింది, పెళ్ళికానుక, చంద్రన్న బీమా, విదేశీ విద్య ద్వారా పేదలను ఆదుకున్నది చంద్రబాబే.

జగన్ వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ రద్దు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆయా పథకాలను తిరిగి ప్రవేశపెడతామని లోకేష్ చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ వైసిపినేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ మాయమాటలను ముస్లీం మైనార్టీలు నమ్మవద్దు. మైనార్టీలను మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేష్ చెప్పారు.

లోకేష్ ఎదుట తుమ్మపూడి ప్రజల సమస్యలు
తుమ్మపూడి గ్రామస్థులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేలా ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేయాలి, తాపీపని వారికి పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. గీత కార్మికులను ఆదుకోవాలని, మంగళగిరి-తెనాలి రహదారిని నిర్మించాలని, ముస్లీం మైనార్టీల స్మశాన వాటికకు రహదారి నిర్మించాలని, డ్రైనేజీ నిర్మించాలని కోరారు. చిలువూరు గేటు దగ్గర మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలి.

ముస్లిం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ అమలుపై నెలకొన్న అపోహలు తొలగించాలి. ఇళ్లులేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ.. మంగళగిరి నిరుద్యోగుల కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. కులవృత్తులను కాపడతానని హామీ ఇచ్చారు. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తాం. ముస్లిం స్మశాన వాటికకు రహదారి విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. 117 జీవో రద్దు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE